థాంక్ గాడ్… మా అల్లూరి కథే అనుకుని జగన్, మా కుమ్రం భీమ్ చరిత్రే అనుకుని కేసీయార్ ఆర్ఆర్ఆర్ సినిమాకు వినోదపన్ను రద్దు చేయలేదు… హమ్మయ్య… చిరంజీవితో కలిసి వెళ్లి, ఏదో అడగ్గానే జగన్ టికెట్ రేట్లను అమాంతం పెంచేశాడు, ఈ రేట్ల విషయంలో ఎలాగూ కేసీయార్ చేతికి ఎముకే లేదు… కానీ నిజంగానే రాజమౌళి అడిగి ఉంటే, ఈ హిస్టారిక్, సారీ, చరిత్రను పరమ నీచంగా వక్రీకరించిన సినిమాకు బహుశా వినోదపన్ను మినహాయింపు ఇచ్చేవాళ్లేమో… అందుకే థాంక్ గాడ్ అనిపించింది… (ఎన్టీయార్ భయోపిక్స్ కథానాయకుడు, మహానాయకుడు సినిమాలకు కూడా పన్ను రద్దును కానుకగా ఇచ్చిపారేస్తే ఓ పనైపోయేదేమో… జనం పకపకా నవ్వుతారని అనుకున్నారేమో…)
బాలయ్యకు సుప్రీం నోటీసులు అనే వార్త చదవగానే నిజంగా ఇలాగే అనిపించింది… ఎందుకు నోటీసులు అంటే..? అప్పట్లో బాలయ్య గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా తీశాడు కదా… అడిగిందే తడవుగా రెండు ప్రభుత్వాలు వినోదపన్ను రద్దు చేశాయి… మరి ఆమేరకు టికెట్ రేట్లు తగ్గాలి కదా, పన్ను రద్దు అంటేనే టికెట్ ధరలు తగ్గి, మరింత మంది సినిమా చూడాలని కదా… కానీ ఆ పన్ను జనానికి ట్రాన్స్‌ఫర్ కాలేదు… అది పక్కా మోసం… అంతటి అద్భుతమైన సినిమా తీసినందుకు రెండు ప్రభుత్వాలు తమకు ఈ ప్రోత్సాహం ఇచ్చినట్టు బాలయ్య ప్లస్ నిర్మాతలు ఫీలయ్యారు… ఎందుకంటే, వినోదపన్ను మొత్తం మిగిలింది కదా…
ఐదేళ్ల తరువాత, సినీ ప్రేక్షకుల వినియోగదారుల సంఘం పేరిట ఎవరో పిటిషన్ వేయడంతో ఇది తెరమీదకు వచ్చింది… అదీ సుప్రీం నిర్మాతలకు వివరణ కోరుతూ జారీ చేసిన నోటీసుల పుణ్యమాని..! నిజానికి ఒక నటుడిగా లీగల్‌గా బాలయ్యకు సంబంధం లేకపోవచ్చు… శిక్షార్హుడు కాకపోవచ్చు… కానీ ఆ వినోదపన్ను రద్దుకు కారకుడు బాలయ్యే… ఏపీ సీఎం బాలయ్య బావ ప్లస్ వియ్యంకుడు కాబట్టి ఈయన అడగ్గానే బంధుప్రీతి అస్సలు లేని ఆ చంద్రబాబు సరే అనేశాడు… సీమాంధ్రుల విశ్వాసం చూరగొనడానికి వాళ్ల కాళ్లల్లో విరిగిన ముళ్లను పళ్లతో పీకే పనిలో ఉన్న కేసీయార్ కూడా ‘నా అభిమాన హీరో కొడుకు బాలయ్య నాకూ ఇష్టుడే’ అని పన్ను రద్దు ఇచ్చేశాడు…
Ads
రెండు నిర్ణయాలకూ ప్రజోపయోగం లేదు… వాళ్ల వ్యక్తిగత ఇష్టాయిష్టాలతో తీసుకోబడిన నిర్ణయాలు… సీఎంలుగా వాళ్ల విచక్షణాధికారం అనుకుందాం… కానీ ఆ వినోదపన్ను మైనస్ చేసి టికెట్ల రేట్లు వసూలు చేసుకోవాలి కదా, అదెందుకు అమలు చేయలేదు, దానికి ఏమైనా జీవో ఇచ్చారా..? అలా ఇవ్వవచ్చా..? అప్పట్లోనే తెలంగాణ మేధావులే ఇదొక దిక్కుమాలిన సినిమా, పూర్తిగా చరిత్రను వక్రీకరించారు అని మొత్తుకున్నారు… అసలు కేసీయార్ వింటే కదా… చంద్రబాబు అయితే ఎలాగూ వినడు…
అప్పటి వార్త చదువుతారా..?
పంజగుట్ట: గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాలో చరిత్రను పూర్తిగా వక్రీకరించారని, సినిమా మొత్తం చారిత్రక అసత్యాలతో కూడి ఉందని పలువురు చరిత్రకారులు అన్నారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వాయిస్ ఆఫ్ తెలంగాణ అధ్యక్షులు కెప్టెన్ ఎల్.పాండురంగారెడ్డి, హైదరాబాద్ డక్కెన్ డెమోక్రటిక్ అలయన్స్ అధ్యక్షులు డాక్టర్ చిరంజీవి కొల్లూరి, తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరం ప్రతినిధి డి.పి.రెడ్డిలు మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన తెలంగాణ చరిత్రను, ఇక్కడి కళాకారులను ప్రొత్సహించేది పోయి చరిత్రను వక్రీకరించిన సినిమాకు వినోదపన్ను రాయితీ ఇవ్వడం సరికాదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
వినోదపన్ను రద్దు కమిటీ నివేదిక లేకుండా పన్ను రద్దు చేశారని, వెంటనే పన్ను రద్దును ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని వారు హెచ్చరించారు. సినిమాలో పేర్కొన్నట్లుగా గౌతమీపుత్ర శాతకర్ణి కోటి లింగాలలో జన్మించలేదని, ఇతని తల్లి బాలశ్రీ నాసిక్‌లో వేయించిన శిలా శాసనములో ఈ విషయాన్ని పేర్కొనలేదని గుర్తుచేశారు. ఈయన భారతదేశం మొత్తం పాలించారని చూపారని, కాని కేవలం పశ్చిమ దక్కన్ పీఠభూమి మాత్రమే శాతకర్ణి ఆధీనంలో ఉందని తెలిపారు.
శాతకర్ణి ఇండో గ్రీకు రాజైన డిమిట్రిస్‌తో యుద్ధం చేశాడన్నది చారిత్రక అసత్యమని, డిమిట్రిస్ క్రీస్తుపూర్వం 312కు చెందిన వారని, అతనికి శాతకర్ణికి 390 సంవత్సరాలు తేడా ఉందన్నారు. అతను తెలంగాణ వారిగా చూపారని, కాని మహారాష్ట్రకు చెందిన వారని తెలిపారు. ప్రజల్ని తప్పుదోవపట్టించి డబ్బులు సంపాదించుకునేందుకు సినిమా బృందం వినోదపన్ను రద్దు చేయించుకుని, ప్రభుత్వానికి వచ్చే ఆదాయానికి గండి కొడుతోందని ఆరోపించారు.
అర్థమైందిగా… ఆ కథతో చరిత్రకు మోసం, పన్ను రద్దు ప్రయోజనం ప్రజలకు ఇవ్వకుండా మరో మోసం… మరో విషయం చెప్పుకోవాలి… తెలంగాణ ప్రభుత్వం రుద్రమదేవి సినిమాకు వినోదపన్ను మినహాయింపు ఇచ్చింది… ప్రజలు దాన్ని ఆమోదించారు… ఉన్నంతలో గుణశేఖర్ రుద్రమదేవి కథను పెద్దగా వక్రీకరణలు, తప్పుడు బాష్యాలు లేకుండా చెప్పాడు… తను ఏపీ ప్రభుత్వాన్ని పదే పదే అడిగాడు, ఏపీలో కూడా తన సినిమాకు పన్ను మినహాయింపు ఇవ్వాలని…
బాలయ్య తన బావమరిది కాబట్టి చంద్రబాబు శాతకర్ణికి పన్ను మినహాయింపు ఇచ్చాడు… కానీ గుణశేఖర్ ఎవరు..? నిజానికి ఇక్కడ కూడా చంద్రబాబు మరో కోణంలో తప్పు చేశాడు… రుద్రమదేవి తెలంగాణ పాలకురాలు కాదు, అప్పట్లో ఆంధ్ర, తెలంగాణ లేవు… సువిశాల కాకతీయ సామ్రాజ్యానికి ఆమె అధినేత్రి… ఏపీకి సంబంధం లేదని చంద్రబాబు ఎలా అనుకున్నాడు… వక్రీకరణల శాతకర్ణి ఇష్టుడెలా అయ్యాడు..? ఓ లేడీ రూలర్ రుద్రమదేవి అయిష్టురాలు ఎలా అయ్యింది..?
ష్… కాకతీయులంటే మా కమ్మవాళ్లే అని చెప్పుకుంటుంటారు కదా… మరి చంద్రబాబు ఆ కోణం కూడా మరిచాడు ఎందుకో… ఓ కమ్మ మహిళ అద్భుత ప్రస్థానం అంత చేదు ఎలా అయ్యింది చంద్రబాబుకు..? ఇక్కడ ఆ సినిమాల నిర్మాణ విశేషాలను చెప్పడం లేదు… ఆ రెండు సినిమాల తరువాత మళ్లీ అలాంటి వివాదం ఏదీ రాలేదు… కానీ సుప్రీం బాలయ్యకు, నిర్మాతలకే గాకుండా… పనిలోపనిగా ప్రభుత్వాలకు కూడా నోటీసులు జారీచేశారు కదా, ఇక మరింత నిర్మాణాత్మక చర్చ జరుగుతుందేమో…!!
Share this Article