సూపర్ స్టార్ కృష్ణ మరుపురాని పాటలు అని వెతుకుతూ ఉంటే… ఓ పాట కనిపించింది, వినిపించింది… ఫాఫం అనిపించింది… రాజరాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ అని ఓ సినిమా వచ్చింది 1976లో… నమ్మలేని విషయం ఏమిటంటే… దానికి దర్శకుడు బాపు… కాకపోతే పాటలు బాగుంటాయి… చిత్రీకరణలో కాదు, ట్యూన్లు, కంటెంటు… అందులోనూ రాకోయీ అనుకోని అతిథి పాట ఓ మరుపురాని పాటే…
ఇది వింటుంటే మనసు పదే పదే మేఘసందేశం సినిమా వైపు వెళ్తుంది… అందులో ఓ పాట… ముందు తెలిసెనా ప్రభూ అనే పాట… ఈ సినిమాకు దర్శకుడు దాసరి… ఈ సినిమాలో పాటల గురించి చెప్పనక్కర్లేదు… ఎవర్ గ్రీన్… ఏ నిద్దుర పట్టని నిశిరాతిరిలోనైనా సరే మనసుకు గొప్ప రిలాక్స్… విచిత్రం ఏమిటంటే… ఇలాంటి గీతాలు చిత్రించే భావుకత బాపుది… తనేమో రాకోయి అనుకోని అతిథి పాట చిత్రీకరణలో ఫెయిల్… ఇలాంటివి దాసరి జానర్ కావు, ఐనా మేఘసందేశాన్ని జాతీయ అవార్డుల దాకా తీసుకుపోయాడు…
పాటలు రెండూ ఒకేతరహా… కాస్త ముందు చెప్పి రావయ్యా ప్రేమికా, కాస్త ఒళ్లూ ఇల్లూ చూడబుల్ గా చక్కదిద్దుకోవాలి అని ప్రేమికురాలు చెప్పుకోవడమే… కాకపోతే ఒక్కో గీత రచయిత ఒక్కో తరహాలో రాస్తాడు… కథలోని సందర్భాన్ని కూడా దృష్టిలో పెట్టుకుంటాడు… మేఘసందేశంలోని పాట రాసింది దేవులపల్లి కృష్ణశాస్త్రి… అసలే జగమెరిగిన భావకవి… ఏదో పాత పాటను స్పూర్తిగా తీసుకోవడం గానీ, కాపీ కొట్టడం గానీ ఊహించలేం కదా… రాకోయి అనుకోని అతిథీ అనే పాట శ్రీ రాజేశ్వరీ విలాస్ కాఫీ క్లబ్ అనే సినిమాలోనిది… ఇది 1976లో వస్తే, మేఘసందేశం 1982లో వచ్చింది… అంటే ఆరేళ్ల క్రితం వచ్చిన ఒక పాటను దేవులపల్లి అనుకరించాడని అనుకోవాలా..? అనుకోలేం కదా…
Ads
నిజానికి ఈ అనుకోని అతిథీ అనే పాటను రాసింది పాలగుమ్మి పద్మరాజు… సంగీతమేమో పెండ్యాల నాగేశ్వరరావు… ముందు తెలిసినా ప్రభూ పాట రాసింది దేవులపల్లి కాగా, సంగీతం రమేష్ నాయుడు… రెండు పాటలు పాడింది సుశీలే… రెండు పాటల్లోనూ నాయిక జయప్రదే… ఐతే చిత్రీకరణలో హస్తిమశకాంతరం ఉంటుంది… రాజేశ్వరీ విలాస్ కాఫీ క్లబ్ తీసింది విజయ ప్రొడక్షన్స్, అంటే చక్రపాణి, నాగిరెడ్డి… పైగా బాపు దర్శకత్వం…
ఇంకేముంది..? సూపర్ అనుకుంటాం కదా… కానీ, కాదు… ఎక్కడో తేడా కొట్టింది, ఫ్లాప్ అయిపోయింది… నిజానికి ఆ సంవత్సరం జయప్రదకు బంగారు సంవత్సరం… అంతులేని కథ, సీతాకల్యాణం, మరుసటి ఏడాదే అడవిరాముడు… ఆ తరువాత ఆమె ఎక్కడికో వెళ్లిపోయింది… పైగా మంచి పాత్ర పడాలే గానీ, ముసలి వేషమైనా, చిటికెడు పౌడర్ కూడా పూసుకోకుండా వేషం వేసి మెప్పించగలదు ఆమె… కానీ మేఘసందేశంలో గొప్పగా అభినయించిన ఆ జయప్రదేనా… అంతులేని కథలో అదరగొట్టిన జయప్రదేనా ఈ ‘అనుకోని అతిథి’ పాటలో దేభ్యం మొహం వేసుకుని, ఇంత ఘోరంగా నటించింది అనే నిస్పృహ ఆవరిస్తుంది మనల్ని…
అసలు బాపేనా దర్శకుడు అని కూడా అనిపిస్తుంది… విస్మయం కలుగుతుంది… బాపుకన్నా మన దిక్కుమాలిన కార్తీకదీపం, త్రినయని టీవీ సీరియళ్ల దర్శకులు చాలా బెటరేమో అనిపించినా తప్పులేదు… ఒకసారి ఆ పాట చదవండి… చాలా బాగా రాశాడు పాలగుమ్మి… ఎటొచ్చీ నాయిక అభినయం, చిత్రీకరణ దారుణం… ఏ ఫీలూ లేదు, ఎంతమాత్రమూ కనెక్ట్ కాదు… దీనికన్నా మేఘసందేశంలోని ‘ముందు తెలిసినా ప్రభూ’ పాట చిత్రీకరణ వంద రెట్లు బెటర్…
రాకోయీ.. అనుకోని అతిధి
మేఘసందేశంలోని ‘ముందు తెలిసినా ప్రభూ’ పాట కనిపించింది… ఎంత హృద్యంగా ఉందో..! దేవులపల్లి అలతి పదాలతోనే పాటను మనసులోకి గుచ్చేస్తాడు… భావగీతాలకు చిరునామా… అప్పట్లోనే… అంటే నలభై ఏళ్ల క్రితం… అక్కినేని నాగేశ్వరరావు మేకప్ ఏదీ లేకుండా, గడ్డం విగ్గు పెట్టేసుకుని, ఓ వృద్ధ పాత్రలో జీవించేయగా….. ఖచ్చితంగా చెప్పుకుని మరీ చప్పట్లు కొట్టాల్సిన అభినయం మాత్రం జయప్రదది…
40 ఏళ్ల క్రితమే మేకప్ లేకుండా, ఓ ముసలిదానిలా… పాత బొంతల్ని ధరించి, చింపిరి జుట్టుతో ఆమె కనిపించిన తీరు, ఆ పాత్ర ఆహార్యానికి, ఆకారానికి ఆమె ‘‘ఆ కెరీర్ క్రీం రోజుల్లో’’… ఇరవై ఏళ్ల వయస్సులోనే అంగీకరించిన తీరు నిజంగా విశేషం… మెప్పించింది కూడా… (అఫ్ కోర్స్, సినిమాలో జయసుధ వేషం కూడా డీగ్లామరైజ్డే… బాగా చేసింది, కానీ ఈ పాటతో జయప్రద ఆ సినిమాను పూర్తిగా హైజాక్ చేసేసినట్టనిపించింది…)
జయప్రద… తన వ్యక్తిగత జీవితం, తన రాజకీయ జీవితం, ఆమె వర్తమానం గట్రా ఇక్కడ అప్రస్తుతం… కానీ మంచి నటి… అందం, అభినయాల కలబోత… డీగ్లామరస్ వేషాలు వేయలేదని కాదు… కానీ చాలా అరుదు… సాగరసంగమంలో కూడా ఓ యుక్తవయస్కురాలికి తల్లి పాత్రలో కూడా చేసిందిగా… కాకపోతే హీరోయిన్ అంటేనే ఫుల్లు గ్లామర్ బొమ్మలు కదా మన ఇండస్ట్రీలో… ఇలాంటి కొన్ని అరుదైన వేషాలు, అవకాశాలు ఆమెకు దక్కడం ఆమె అదృష్టం…
అప్పట్లో అభినయ ప్రాధాన్య పాత్ర అంటే జయసుధ… అందం ప్రాధాన్యపాత్ర అంటే శ్రీదేవి… రెండూ కలగలిసిన పాత్ర అయితే జయప్రద… స్వతహాగా మంచి డాన్సర్ కావడం కూడా బాగా ఆమె నటనకు కలిసొచ్చింది… ఇప్పటి హీరోయిన్లలో ఇలాంటి పాత్రలు చేయగలిగిన వారెవరున్నారబ్బా…!? అసలు అది కాదు ప్రశ్న… ఇలాంటి పాత్రలతో సినిమాలు తీసేవారెవరున్నారబ్బా… ఇక పాట విషయానికొద్దాం…
ముందు తెలిసినా ప్రభూ! ఈ మందిరమిటులుంచేనా
మందమతిని నీవు వచ్చు మధురక్షణమేదో
కాస్త ముందు తెలిసినా ప్రభూ! ఈ మందిరమిటులుంచేనా
మందమతిని నీవు వచ్చు మధురక్షణమేదో
కాస్త ముందు తెలిసినా ప్రభూ!
అందముగా నీ కనులకు విందులుగా వాకిటనే
అందముగా నీ కనులకు విందులుగా వాకిటనే
సుందర మందారకుంద సుమ దళములు పరువనా
సుందర మందారకుంద సుమ దళములు పరువనా
దారి పొడుగునా తడిసిన పారిజాతములపై
నీ అడుగుల గురుతులే నిలిచినా చాలును
ముందు తెలిసినా ప్రభూ! ఈ మందిరమిటులుంచేనా
మందమతిని నీవు వచ్చు మధురక్షణమేదో
కాస్త ముందు తెలిసినా ప్రభూ!
బ్రతుకంతా ఎదురుచూచు పట్టున రానేరావు
బ్రతుకంతా ఎదురుచూచు పట్టున రానేరావు
ఎదురరయని వేళవచ్చి ఇట్టే మాయమవుతావు
ఎదురరయని వేళవచ్చి ఇట్టే మాయమవుతావు
కదలనీక నిముసము నను వదలిపోక నిలుపగ
నీ పదముల బంధింపలేను హృదయము సంకెల జేసి
ముందు తెలిసినా ప్రభూ! ఈ మందిరమిటులుంచేనా
మందమతిని నీవు వచ్చు మధురక్షణమేదో
కాస్త ముందు తెలిసినా ప్రభూ!
అయ్యో, మందమతిని, నువ్వు వచ్చే ఆ మధురక్షణం ముందే తెలిస్తే… ఈ మందిరాన్ని ఇలాగే ఉంచేదానినా..? పూలు పరవనా..? నీ పాదముద్రలు పడితే చాలదా..? అని భావావేశానికి గురవుతుంది… పాట రెండో చరణం వచ్చేసరికి, ఈమె ఇక్కడ పాడుతూ ఉంటుంది ఒంటరిగా… బతుకుంతా ఎదురుచూసినా నువ్వు రానేరావు, కలలోనో ఇలలోనో మెలకువలోనో వచ్చినట్టే వచ్చి మాయమవుతావు, ఎటూపోకుండా నీ పాదాల్ని ఎలా కట్టేయను..? నా గుండెనే సంకెళ్లుగా మార్చనా..? అని…
అక్కడ ఆ ప్రియుడు భౌతికంగానే మాయమవుతాడు… ప్రేక్షకుడికి అలా కనెక్టవుతుంది ఆ పాట, ఆ సందర్భం… పాటకు సంగీతం కూడా సరళంగా, మంద్రంగా వినిపిస్తుంటే… కళ్లు అరమోడ్పులవుతాయి… వీనులవిందు అంటే ఇదే…!! రెండు పాటలు ఒకే నటి… ఒకే భావన… ఒకే పలవరింత… ఇద్దరు వేర్వేరు రచయితలు, వేర్వేరు దర్శకులు, వేర్వేరు హీరోలు… వినగానే ఈ తేడాలు చప్పున స్పురిస్తాయి…!!
Share this Article