ఒక వార్త కనిపించింది… అదెలా ఉందంటే..? ఎహె, ఆపండి మీ సోది… అల్లూరి రామరాజుకి అంత సీన్ లేదు, అసలు ఆయన కాల్పుల్లో చచ్చిపోనేలేదు.., మీ ఉత్సవాలు, మీ భజనలు, మీ డప్పులు, మీ కీర్తనలు ఆపేయండి… 1924లో పోలీస్ కాల్పుల్లో ఉప్పరాపల్లి వీరవెంకటాచార్యులు అనే వ్యక్తి చనిపోయాడు… కానీ అల్లూరి అక్కడి నుంచి వెళ్లిపోయి, తూర్పు గోదావరి జిల్లా, బెండపూడిలో ఆశ్రమం పెట్టుకున్నాడు… 1939 నుంచి 1968 వరకూ అక్కడే ఉన్నాడు, ఇప్పటికీ ఆయన ఇద్దరు భార్యలు బతికే ఉన్నారు… 9 మంది పిల్లలు ఉన్నారు, ఆ పిల్లలకు, సీతారామరాజు కుటుంబసభ్యులకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహిస్తే నిజాలు తేలిపోతాయి,… ఇలా ఒకాయన విశాఖపట్నంలో విలేకరులకు చెప్పాడు, ఆ వార్త పత్రికల్లో వచ్చింది…
ఎవరాయన..? మధురై కామరాజ్ యూనివర్శిటీలో ఎమ్మెస్సీ చదువుతున్నాడట… 2012 నుంచి అల్లూరి మీద పరిశోధన చేస్తున్నాడట… పేరు అల్లు నాగసింహాద్రి… 2015లో ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అనుమతి తీసుకుని, ఆ సాధువు నివాసానికి కూడా వెళ్లాడట… సరే, నీ వాదనను కాదనడం దేనికిలే గానీ తమ్ముడూ… 2012లోనే అధ్యయనం స్టార్ట్ చేశావంటే… అప్పుడు ఎన్నో తరగతి చదువుతున్నావు..? 2015లోనే సీఎంవో అనుమతి తీసుకున్నావు అంటే విశేషమే సుమీ…
Ads
సింహాద్రే కాదు… ఈమధ్య పత్రికల కథనాలు చూసి కొంతమందికి అసలే నచ్చలేదు… ‘అల్లూరికి అంత సీన్ లేదు, ఆయన తండ్రికీ, అక్కడి తహసిల్దార్‌కూ దోస్తీ ఉండేది, ఆయన 50 ఎకరాల అటవీ భూమి రాసిచ్చి, పోడు చేసుకో అన్నాడు… కానీ పోలీసులు పడనివ్వలేదు, దాంతో అల్లూరి వాళ్లపై తిరగబడ్డాడు, అంతే తప్ప స్వాతంత్య్ర కాంక్ష లేదు’ అంటూ నెగెటివ్ ప్రచారానికి దిగారు… మరి ఆ 50 ఎకరాల సొంత భూమి పంచాయితీకి అన్ని గ్రామాల ప్రజలు, గిరిజనులు తన వెంట ఎందుకు నిలబడి, ప్రాణాలకు తెగించి పోరాడారు..? అనే ప్రశ్నకు జవాబు దొరకలేదు, దొరకదు…
అప్పట్లో నేతాజీ మరణం మీద కూడా ఇదేతరహా ప్రచారం… ఆయన విమాన ప్రమాదంలో చనిపోలేదు, ఇండియాకు వచ్చి, చాలా ఏళ్లు ఓ ఆశ్రమం పెట్టుకుని బతికాడు అనే కథ బహుళ వ్యాప్తిలో ఉండేది… ఇండియాకు ఎందుకు వస్తాడు..? తను ప్రేమించి పెళ్లిచేసుకున్న భార్య ఎమిలీ దగ్గరకు ఎందుకు వెళ్లలేదు..? ఇండియాకు స్వాతంత్య్రం వచ్చినా ఎందుకు బయటికి రాలేదు..? ఈ ప్రశ్నలకు జవాబులు దొరకలేదు, దొరకవు… సేమ్, అల్లూరి ఆశ్రమం కూడా…
నిజమే, ఆ ప్రాంతాల్లో ఓ ప్రచారం ఉంది… బెండపూడి సాధువు అనబడే చిద్వెంకట రామబ్రహ్మానంద మహర్షి పేరిట 1941లో ఆశ్రమం ప్రారంభమైంది… ఆయన అసలు పేరు ఉప్పరాపల్లి వెంకటరామ బ్రహ్మానందాచార్యులు… 1968లో ఆయన చనిపోయాడు… కాదు, ఇది అల్లూరి ఆశ్రమమే… సదరు ఉప్పరాపల్లి ఆచార్యులు అల్లూరి స్థానంలో కాల్పులకు గురై మరణించాడు అని ఇలా కొందరి తాజా ప్రచారం, వాదన… అల్లూరే బెండపూడి సాధువు అవతారం ఎత్తాడని వాటి సారాంశం… ఆయన అధికారికంగానే ఏడు పెళ్లిళ్లు చేసుకున్నాడట… ఇక కొన్ని సందేహాలకు వద్దాం…
- 1924లో కాల్పులు జరిగితే… అల్లూరి 1941లో ఆయన బెండపూడికి చేరి, ఓ ఆశ్రమం స్టార్ట్ చేస్తే…. మరి ఈమధ్యకాలంలో ఏమైపోయాడు..? ఎక్కడున్నాడు..?
- ఆయన 1968 వరకూ బతికే ఉన్నదే నిజమైతే… 1947లోనే స్వాతంత్య్రం వచ్చింది కదా, మరి అప్పుడైనా బయటికి ఎందుకు రాలేదు..?
- నేతాజీకి నెహ్రూ తననేమైనా చేయిస్తాడనే సందేహం, భయం ఉండేవనుకుందాం… అల్లూరికి అలాంటి భయాలేమీ లేవు కదా… దేశవిముక్తి తరువాతైనా ఎందుకు బహిరంగపరుచుకోలేదు తనను..?
- తన భార్య సీత మరణానికే తల్లడిల్లినవాడు అన్ని పెళ్లిళ్లు ఎందుకు చేసుకున్నాడు..? ఎందుకు సాధువు అయిపోయాడు..? ఐనా సాధువు అన్ని పెళ్లిళ్లు చేసుకోవడం ఏమిటి..?
- ఒకసారి కాల్పులు జరిగితేనే ఠారెత్తిపోయి, సాధువుగా అవతారం ఎత్తే పిరికివాడే అయితే… నేరుగా ఠాణాలకు వెళ్లి, ముందుగా చెప్పి మరీ దాడులు ఎలా చేసేవాడు..?
- ఒకవేళ కాల్పుల నుంచి తప్పించుకున్నా సరే, మళ్లీ మళ్లీ తిరగబడే కేరక్టర్ కదా తను… ఠాణాలపై దాడుల చరిత్ర చెప్పింది కూడా అదే కదా… మరి బెండపూడి ఎందుకు రమ్మంది..? సో, అల్లూరి అలా కాదు, అల్లూరి ఇలా కాదు అని తాజాగా ఆయన చరిత్రకు కొత్త వెర్షన్లు దేనికి..? ఓ స్పూర్తిపాఠంగా తను అలాగే ఉండిపోనీ…! నష్టమేమీ లేదు కదా…!!
Share this Article