నిజానికి ప్రింట్, టీవీ మీడియాకు సంబంధించి కొత్త ఆంక్షల మార్గదర్శకాలు గనుక జారీ అయితే ఇప్పటికే గాయి గాయి గత్తర టైపు రచ్చ జరిగి ఉండేది… జర్నలిస్టు సంఘాలు, హక్కుల సంఘాలు, పార్టీలు, ప్రతిపక్షాలు, మేధావుల సంఘాలు గట్రా భావవ్యక్తీకరణ నాశనమైపోయిందని గోల గోల చేసేవి… కానీ మొన్నామధ్య మోడీ ప్రభుత్వం డిజిటల్ మీడియాకు ఆంక్షలు, పరిమితులు, సర్కారు చర్యలు నిర్దేశిస్తూ కొన్ని కొత్త కఠిన మార్గదర్శకాల్ని (the Information Technology (Intermediary guidelines and Digital Media Ethics Code) Rules, 2021) విడుదల చేసింది కదా… పెద్ద వ్యతిరేకత, ప్రతిఘటన కనిపించడం లేదు… సర్కారు తెలివిగా ఓటీటీ సంస్థల్ని, సోషల్ సైట్లను, చానెళ్లను, ప్లాట్ ఫారాలన్నింటినీ అవే మార్గదర్శకాల్లో ఇరికించేసింది… సహజంగానే సోషల్ మీడియా ప్లాట్ ఫారాలు ఇండియన్ చట్టాల పట్ల తేలికభావాన్ని కనబరుస్తున్నాయి… అలాగే ఓటీటీల కంటెంటుకు అసలు ఏ సెన్సారూ లేకుండా, విశృంఖల అశ్లీలాన్ని ప్రసారం చేస్తున్నయ్… ఈ భావనతో ప్రజలు కూడా కొంత నియంత్రణ అవసరమే అన్నట్టుగా నిర్లిప్తత కనబరిచారు… మెయిన్ స్ట్రీమ్ మీడియాకు ఉన్నట్టుగా డిజిటల్ మీడియాకు లెక్కకుమిక్కిలి సంఘాలు లేకపోవడం, ఇదేదో డిజిటల్ మీడియా తల్నొప్పి, మనకెందుకులే అని మెయిన్ స్ట్రీమ్ వదిలేయడం మరో కారణం…
ఇప్పుడు ఇది ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే… ప్రభుత్వం ఉద్దేశం ఎలా ఉన్నా సరే, అందుబాటులోకి ఓ చట్టమో, మార్గదర్శకాలో, గెజిటో వచ్చిందంటే చాలు, ముందుగా రెచ్చిపోయేది అధికార యంత్రాంగం… ఈ మీడియా వాళ్లు ఎక్కడ దొరుకుతారా అన్నట్టు చూస్తుంటారు… ఇలా డిజిటల్ మీడియా మార్గదర్శకాలు వచ్చాయో లేదో మణిపూర్, ఇంఫాల్ వెస్ట్ కలెక్టర్ ఒకాయన రెచ్చిపోయాడు… ఏకంగా ఓ ఆన్ లైన్ టాక్ షో మీద కత్తి ఝలిపించాడు… ఖనాసి నైనా పేరిట కిషోర్ చంద్ర వాంగ్ఖెమ్ అనే జర్నలిస్టు ఫేస్బుక్ వేదికగా ఆ టాక్ షో నిర్వహిస్తున్నాడు… ఫిబ్రవరి 28న ‘‘Media Under Siege: Are Journalists Walking a Tightrope’ ఆ టాక్ షో సబ్జెక్టు… వెంటనే కలెక్టర్ నోటీసులు జారీ చేశాడు… కొత్త గైడ్ లైన్స్ ప్రకారం ఇలాంటి ఆన్లైన్ వార్తా వ్యవహారాలు కుదరవు, నీ దగ్గర ఉన్న డాక్యుమెంట్లు పట్టుకురా, లేకపోతే ఇక ఎలాంటి నోటీసులు లేకుండా చర్యలు తీసుకోబడును అని హెచ్చరించాడు…
Ads
ఈ జర్నలిస్టు కొంచెం నిక్కచ్చితనం, ధిక్కారం, ప్రజాకోణం గట్రా ఉన్నాయన… ఫ్రాంటియర్ మణిపూర్‌కు అసోసియేట్ ఎడిటర్… బీజేపీ ఈయన్ని పలు కేసుల్లో ఇరికించింది… మూడుసార్లు జైలుకు పంపించింది… ఈ ఫ్రాంటియర్ మణిపూర్ సెవెన్ సలై అనే న్యూస్ పోర్టల్‌తో అనుసంధానమై ఉంది… ఈ ఫ్రాంటియర్ మణిపూర్ చీఫ్ ఎడిటర్ ధిరెన్ సదోక్పం, ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ కమ్ పబ్లిషర్ పావోజెల్ చావోబాలను కూడా ఆమధ్య ఏదో కేసులో అరెస్టు చేశారు… సో, అక్కడి సర్కారుకు ఈ జర్నలిస్టుల గ్రూపుకీ నడుమ కొంత డిష్యూం డిష్యూం నడుస్తూనే ఉంది… ఇప్పుడు కొత్త గైడ్ లైన్స్ రావడంతో కలెక్టర్ అడ్వాంటేజ్ తీసుకున్నాడు… ఈ విషయం కేంద్రానికి తెలిసింది… సదరు జర్నలిస్టుల గ్రూపు యాంటీ-బీజేపీ ముద్ర ఉన్నదే అయినా సరే… కేంద్ర సమాచార ప్రసార మంత్రి ప్రకాష్ జవదేకర్ కలెక్టర్ చర్యను తప్పుపట్టాడు… సదరు శాఖ కార్యదర్శి అమిత్ ఖరే ఏకంగా మణిపూర్ చీఫ్ సెక్రెటరీని లెటర్ పెట్టాడు… అసలు ఆ గైడ్ లైన్స్ చదివారా..? రాష్ట్ర ప్రభుత్వాలకు అంటే, పోలీస్ కమిషనర్లకు లేదా కలెక్టర్లకు చర్యలు తీసుకునే అధికారం ఉందో లేదో కన్ఫరమ్ చేసుకున్నారా..? ఏమిటిది…? వెంటనే మీరు సదరు జర్నలిస్టులను హెచ్చరిస్తూ జారీ చేసిన నోటీసులను విత్ డ్రా చేసుకొండి అని ఘాటుగా ఉందా లెటర్… ఈ అక్షింతలు పడటంతో ఆ నోటీసుల్ని వాపస్ తీసుకుంది మణిపూర్ సర్కారు… ప్రకాష్ జవదేకర్ చెప్పినట్టు… ‘‘ఈ మార్గదర్శకాలు సీరియస్ కేసులకు సంబంధించి వర్తిస్తాయి… ఎవరు పడితే వారు అందరి మీదా ప్రయోగించడానికి కాదు, గైడ్ లైన్స్ అందరికీ ఆ అధికారాలు కూడా ఇవ్వలేదు…’’ ఒకందుకు ఈ కేసు నయమే… ఈ వార్త చదివితే అన్ని రాష్ట్రాల్లోని కలెక్టర్లకు, పోలీసులకు తమ పరిమితులేమిటో ఓ క్లారిటీ వస్తుంది…!!
Share this Article