Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మీడియా ‘ముద్ర’ణ చెరిగిపోతున్నది… డిజిటాక్షరి ముంచెత్తుతున్నది…

January 5, 2023 by M S R

Media Transformation:  ప్రపంచవ్యాప్తంగా ప్రింట్ మీడియా పరిస్థితి ఏమీ బాగాలేదు. టీవీ న్యూస్ ఛానెళ్లు వచ్చాక ప్రింట్ మీడియా తెరమరుగవుతుందని అనుకున్నారు కానీ...అలా జరగలేదు. ఎంతటి నరాలు తెగే ఉత్కంఠతో సాగిన క్రికెట్ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం టీవీల్లో చూసినా…దాని విశ్లేషణ ప్రింట్ మీడియాలో చదువుతున్నప్పుడు అక్షరాలా కలిగే అనుభూతి వేరు. కదిలే దృశ్యంగా వీడియోలో ఏమి ఉంటే దాన్నే కన్ను చూడాలి. అచ్చయిన అక్షరం, పదం, వాక్యం, వ్యాఖ్య, విశ్లేషణ, సంపాదకీయాల్లో దాన్నొక భావంగా చదువుతున్నవారు నిర్మించుకోవాలి. ఊహించుకోవాలి. అందుకే కదలని చిత్రం, కదిలే దృశ్యం కంటే అక్షరం గొప్పది. దాని పేరే అ- క్షయం. నాశనం లేనిది.

డిజిటల్ మీడియాలో ఎన్నెన్ని ప్లాట్ ఫార్మ్స్ ఉన్నాయో అందరికీ తెలుసు. వెబ్ సైట్లు మొదలు పొట్టి వాక్యాల ట్విట్టర్ దాకా ఒక్కో ప్లాట్ ఫార్మ్ అడ్వాంటేజ్ ఒక్కోలా ఉంటుంది. ఈరోజు వార్త జరిగితే…విలేఖరి కాగితం మీద వార్త రాసి బస్సులో ఎడిషన్ కేంద్రానికి పంపితే…రేపు అచ్చయితే…ఎల్లుండి పొద్దున పాఠకుడికి అందిన 1980-90 రోజులకే జర్నలిజం వేగానికి రాకెట్లు సిగ్గు పడ్డాయి. ఆపై ఈరోజు వార్త ఈరోజే అచ్చయి…రేపు ఉదయానికే పాఠకుడికి చేరే వేగం రాగానే మనోవేగం సిగ్గుతో తలదించుకుంది. డిజిటల్ రోజులు జడలు విప్పగానే ఇప్పుడు జరిగిన వార్త ఇప్పుడే పాఠకుడికి, ప్రేక్షకుడికి, శ్రోతకు చేరే వేగం వచ్చింది.

Print Media

Ads

చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండి సామాజిక మాధ్యమాల్లో చురుకుగా ఉన్న ప్రతివారు నార్ల వెంకటేశ్వరరావు కంటే గొప్పగా సంపాదకీయాలు రాయగలిగిన వాళ్లం అనే అనుకుని రాస్తున్నారు. చదివేవారు చదువుతున్నారు. సోషల్ మీడియాలో ఎంత చెత్త వస్తున్నా…ఎన్ని ఫేక్ వార్తలు వస్తున్నా…మెయిన్ స్ట్రీమ్ మీడియా పునాదులను కదిలించిన మాట నిజం. సోషల్ మీడియా వార్తలు ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియాకు పెద్ద సోర్స్. డ్రయివింగ్ ఫోర్స్. ఇందులో మంచి- చెడుల చర్చ ఇక్కడ అనవసరం. శిక్షణ పొందిన మెయిన్ స్ట్రీమ్ మీడియా జర్నలిస్టుల కంటే ఎలాంటి ఫార్మల్ జర్నలిజం చదువు, అనుభవం లేని కొందరు డిజిటల్ జర్నలిస్టులు రాసేవి గొప్పగా ఉంటున్నాయి. మొత్తం జర్నలిజం స్వరూప, స్వభావాలను, పనితీరును డిజిటల్ మీడియా శాసిస్తోంది.

చందాదారులు పోతున్నారు.
లైకులు, షేర్లు, వ్యూస్, సబ్ స్క్రిప్షన్లు, కామెంట్లు, ఫాలోయర్లు, రీట్వీట్లవారు వస్తున్నారు.

పేపర్ గాలికి తేలిపోతోంది.
స్మార్ట్ ఫోన్లో ప్రపంచ జర్నలిజం ఒదిగిపోతోంది.

 

పేపర్ కు ప్రకటనల కాలం చెల్లుతోంది.
డిజిటల్ యాడ్స్ కాలం వచ్చేసింది.

పత్రిక రీడర్షిప్ లెక్కలు లెక్కలేనివి అవుతున్నాయి.
లెక్కకు మిక్కిలి పుట్టుకొచ్చిన డిజిటల్ మీడియా రెక్కలు విప్పి ఎగురుతోంది.

పడికట్టు పదాల ఇనుపగుగ్గిళ్ల సంప్రదాయ సంపాదకీయాలను కొత్తతరం డిజిటల్ రాతలు ఈడ్చి అవతల పారేస్తున్నాయి.

మెయిన్ స్ట్రీమ్ మీడియా అక్షరం డిజిటల్ మీడియా శీలపరీక్షకు నిలబడాల్సి వస్తోంది.

Print Media

ఏది వార్త?
ఏది వ్యాఖ్య?
అన్న స్పృహను, ఆ విభజన రేఖను పాటించాల్సిన అవసరాన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియానే పట్టించుకోవడం మానేసిన రోజుల్లో డిజిటల్ మీడియా విలువలు, ప్రమాణాల గురించి ఆలోచించడం దండగ.

కొత్త డిజిటల్ మీడియా ప్రవాహంలో పాత మీడియా మునిగిపోతోంది. దశాబ్దాల పాటు ఆగని ప్రయాణం చేసిన మహా మహా పత్రికలు, మ్యాగజైన్లు నిలువెల్లా వణికిపోతున్నాయి. ప్రకటనల ఆదాయ బలం తగ్గి బక్కచిక్కి నీరసించాయి. కొన్ని శాశ్వతంగా మూత పడ్డాయి. కొన్ని ఐసీయూలో, కొన్ని వెంటిలేటర్ మీద ఉన్నాయి. కొన్ని చావలేక బతుకుతున్నాయి.

ఈనేపథ్యంలో ప్రింట్ అయిన అక్షరమే గొప్పదని పాఠకులకు జ్ఞానం పంచడానికి ప్రింట్ మీడియా ప్రయత్నిస్తోంది. ఎకనమిక్ టైమ్స్ వాణిజ్య దినపత్రికలో ఒక ఫుల్ పేజీ ప్రకటన వచ్చింది.

“కెనడాకు చెందిన ట్రూ ఇంపాక్ట్ అనే న్యూరో మార్కెటింగ్ సంస్థ చేసిన అధ్యయనం ప్రకారం టీవీ, సినిమా, డిజిటల్ తో పాటు మిగతా అన్నిరకాల మాధ్యమాల కంటే ప్రింట్ అయిన అక్షరమే 21 శాతం ప్రభావవంతం. సులభంగా అర్థం చేసుకోవడానికి ప్రింట్ అయిన అక్షరం ముందు మిగతావన్నీ దిగదుడుపే. కాబట్టి టైమ్స్ ఆఫ్ ఇండియాను చదవండి” అన్నది అందులో సారాంశం. “న్యూరో మార్కెటింగ్” పేరే విచిత్రంగా ఉంది. ఈ సంస్థకు ఉన్న విశ్వసనీయత ఎంతో? వారి అధ్యయనానికి ఎంచుకున్న శాంపిల్ సైజ్ ఎంతో? మనకు తెలియదు.

ప్రవాహంలో కొట్టుకుపోతున్నప్పుడు గడ్డిపోచ కూడా ఒడ్డుకు చేర్చే పడవలాగే కనిపిస్తుందట. అలా ప్రింట్ మీడియాకు ఈ న్యూరో మార్కెటింగ్ అధ్యయనం కనిపిస్తున్నట్లుంది.

ప్రింట్ అయిన అక్షరం నిజంగా గొప్పదే. కానీ డిజిటాక్షరం ముందు ప్రింట్ అక్షరం వెలవెలపోతున్న మాట కూడా అంతే నిజం.

(పాత కథనానికి కొంత కలబోత)

-పమిడికాల్వ మధుసూదన్
madhupamidikalva@gmail.com

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పాపం శమించుగాక… ఇద్దరు వ్యక్తుల పేర్లు పదే పదే గుర్తొస్తున్నాయి…
  • యుద్ధానికి విరమణ సరే… కానీ ఈ ఆపరేషన్ ఏం తేల్చి చెప్పింది..?!
  • హమ్మయ్య… ఆ శ్రీవారి కృప వల్ల టీటీడీ ఉద్యోగుల ప్రాణాలకు భరోసా..!!
  • హీరోనని చెప్పుకోకు నానీ… ఈ దరిద్రపు పోకడలతో చావుదెబ్బ తింటావ్…
  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…
  • పాకిస్థాన్ అంటేనే ఓ రోగ్ కంట్రీ కదా… అందుకే ఎవ్వడూ స్పందించడు…
  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions