లాల్‌సింగ్‌చద్దా గతి ఏమైంది..? బాబ్బాబు, నా సినిమా చూడండి, పాత తప్పులన్నీ కాయండి అని అమీర్‌ఖాన్ బతిమిలాడుతున్నాడు… ఒక పరిమితి దాటితే, జనం తిరస్కరించడం మొదలైతే ఇక అంతే… మరి ఆ గతి దిల్‌రాజుకు కూడా పడుతుందా..? ఇదీ తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు చర్చను రేకెత్తిస్తున్న ప్రశ్న… పూర్తిగా థియేటర్లను చెరబట్టిన ఓ నలుగురి సిండికేట్ ఇండస్ట్రీని శాసిస్తోందనే విషయం బహిరంగ రహస్యమే…
తాము అనుకున్న సినిమాలే రిలీజ్ కావాలి, తాము చెప్పినప్పుడే రిలీజ్ చేయాలి, తాము పెట్టిన షరతులతోనే రిలీజ్ చేసుకోవాలి… కాదంటే తొక్కేస్తారు… థియేటర్లు దొరకనివ్వరు… రిలీజ్ కానివ్వరు… మాఫియా… ఈ చర్చ, ఈ విమర్శ ఎన్నాళ్లుగానో ఉంది… మళ్లీ ఇప్పుడు ప్రముఖంగా వినిపిస్తోంది… ఎందుకంటే నిఖిల్ సిద్ధార్థ సినిమా కార్తికేయకు దిల్‌రాజు అడుగడుగునా అడ్డుపడ్డాడు… నానా అవస్థలు పెట్టాడు… ఇండస్ట్రీలో నిలదొక్కుకున్న హీరో నిఖిల్ పరిస్థితే ఇలా ఉంటే, ఇక మిగతా చిన్న హీరోల దురవస్థ మాటేమిటి..?
మొదట్లో జూలైలో రిలీజ్ అనుకున్నారు… దిల్ రాజు కుదరనివ్వలేదుట… అదేదో నాగచైతన్య దిక్కుమాలిన సినిమా థాంక్‌యూ రిలీజ్ చేస్తే, అది గాలికిపోయే పేలపిండిలా కొట్టుకుపోయింది… థియేటర్లు ఖాళీ… ఐనా కార్తికేయకు చాన్స్ ఇవ్వలేదు దిల్ రాజు… రాఖీపండుగ, ఇండిపెండెన్స్ డే తదితర సెలవులతో లాంగ్ వీకెండ్ వచ్చింది కదా, రిలీజ్ చేసుకుందాం అనుకుంటే అక్కడా అడ్డుపడ్డాడుట… ఇప్పుడు అడ్డు దేనికయ్యా అంటే నితిన్ నటించిన మాచర్ల నియోజకవర్గం సినిమా కోసం… అది థాంక్‌యూ సినిమాకన్నా మరింత పెద్ద డొల్ల సినిమా.., తొలిరోజుతోనే దాని భవిష్యత్తు తేలిపోయింది…
Ads
కొన్ని థియేటర్లలోనేమో బింబిసార, సీతారామం నడుస్తున్నయ్… సీతారామం సినిమాకు మంచి టాక్ రావడంతో… జనం లేక ఖాళీగా ఉన్న థియేటర్ల నుంచి లాల్‌సింగ్‌చద్దా ఎత్తిపారేసి సీతారామం వేస్తున్నారు… మరి కార్తికేయకు కూడా మంచి టాక్ వచ్చింది కదా… తెలుగుతోపాటు హిందీలో కూడా మంచి కలెక్షన్స్ వస్తున్నయ్ కదా… ఐనా దానికి థియేటర్లు పెరగడం లేదు… పెరగనివ్వడం లేదు… బాబ్బాబు, థియేటర్ల సంఖ్య పెంచండి ప్లీజ్ అని నిఖిల్ సిద్ధార్థ్ పెట్టిన ట్వీట్ ఫీల్డ్‌లో ఉన్న దుస్థితి అద్దంపడుతోంది… కొన్నిచోట్ల కార్తికేయ రిలీజే జరగలేదంటున్నారు…
దిల్ రాజు వంటి వాళ్లు బయటికి బొచ్చెడు నీతులు చెబుతుంటారు… సినిమాల షూటింగ్ బంద్ చేస్తామంటారు… థియేటర్లను ఎలా ఉద్దరించాలో ప్రణాళికలు వేస్తాం అంటారు… చేసేది ఏమీ ఉండదు… ఉత్త హంబగ్… అసలు థియేటర్ల దోపిడీకి ఎవరు కారకులు..? టికెట్ల ధరల దగ్గర నుంచి క్యాంటీన్ రేట్లు, పార్కింగ్ ఫీజుల దాకా థియేటర్ అంటేనే ప్రేక్షకుడు భయపడే దుస్థితి వచ్చింది ఎవరి వల్ల..? ఇదుగో, ఇలాంటి మాఫియా వల్లే..! జనం థియేటర్లకు రాకపోవడం అనే టెంపో ఇంకొన్నాళ్లు కొనసాగితే బాగుండేది… కానీ బింబిసార, సీతారామం, కార్తికేయ మళ్లీ జనాన్ని థియేటర్ల వైపు మళ్లిస్తున్నయ్… దిల్‌రాజు వంటి వాళ్లకు మళ్లీ ఊపిరి పోస్టున్నయ్…
నిజానికి తగినన్ని థియేటర్లు గనుక దొరికి ఉంటే కార్తికేయ వసూళ్లు ఓ రేంజులో ఉండేవి… కానీ దానికి అడ్డుపడ్డారు… అయితే ఇలా ఎన్నాళ్లు..? ఎన్ని సినిమాల్ని తొక్కేయగలరు..? ఒక దశ దాటేవరకు మాత్రమే… టైమ్ ఎదురుతన్నడం మొదలైతే… ఎంత పెద్ద తోపులైనా చేసేది ఏమీ ఉండదు… థాంక్‌యూ, మాచర్ల నియోజకవర్గంలాగే పేలిపోక తప్పదు…!!
Share this Article