Bharadwaja Rangavajhala……… 2014 లో అనుకుంటా …. ప్రముఖ సినీ దర్శకుడు ఐఎన్ మూర్తి అనారోగ్యంతో కన్నుమూశారు అనే వార్త చూశాను. అప్పటికి ఆయన వయసు సుమారు 89 సంవత్సరాలు. ఎవరీ ఐఎన్ మూర్తి అనుకుంటున్నారా …
ఎన్టీఆర్ తొలిసారి దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన సీతారామకళ్యాణం చిత్రానికి ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ గా వ్యవహరించారాయన. నిజానికి ఈ సినిమాకు దర్శకత్వం ఎన్టీఆర్ అని టైటిల్ కార్ట్స్ లో పడదు. అయినా అన్నగారు దర్శకత్వం వహించిన తొలి చిత్రం అదే. అయితే ఎన్టీఆర్ పేరు దర్శకుడుగా తొలిసారి తెరమీద పడింది మాత్రం పాండవీయానికే.
ఐ.ఎన్.మూర్తి అనలు పేరు ఐనాపురపు నారాయణమూర్తి. తండ్రి పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంటులో పనిచేసేవారు. మన మూర్తిగారికి కాలేజీ రోజుల నుంచీ రంగస్థలం మీద అనుభవం ఉంది. అనేక నాటకాలు ఆడారు. పేరు సంపాదించుకున్నారు.
Ads
ఫైనల్ గా సివిల్ ఇంజనీరింగు చేస్తానని ఇంట్లో చెప్పి సినిమా అవకాశాల కోసం వెతకొచ్చని మనసులో అనుకుని మద్రాసు చేరారు. ఇంజనీరింగు చేస్తూనే సినిమా ప్రయత్నాలూ చేశారు. ఇలా ఉండగా ఓ రోజు తమిళనాడు టాకీస్ అధినేత ఎస్. సౌందరరాజన్ ను కల్సారు. అప్పటికి ఆయన అదృష్టదీపుడు అనే సినిమా తీస్తున్నారు. అది గుమ్మడి వెంకటేశ్వరరావుకి తొలి చిత్రం.
మూర్తి తపన చూసిన సౌందరరాజన్ నిర్ణయం తీసుకున్నారు. వెంటనే వచ్చి తన దగ్గర చేరిపోమ్మన్నారు. అలా చేరిన మూర్తిగారికి సౌందర్ రాజన్ తన తర్వాత సినిమా నవ్వితే నవరత్నాలు చిత్రానికి నెలకు వందరూపాయల వేతనానికి ఉద్యోగం ఇచ్చారు. గుమ్మడి , కృష్ణకుమారి కలసి నటించిన చిత్రం ఇది.
ఆ తర్వాత అక్కడ నుంచీ నాగయ్యగారి అవర్ ఇండియా కంపెనీకి మారారు. అక్కడ నా ఇల్లు సినిమాకి పనిచేశారు. నా ఇల్లు సమయంలో ఆయన పనేమిటంటే ఆ రోజుల డ్రీమ్ గరల్ … టి.ఆర్.రాజకుమారికి తెలుగు నేర్పడం. ఈ రాజకుమారి ఎవరంటే … మన టాప్ డాన్సర్లు ఉన్నారు కదా … జ్యోతిలక్ష్మి, జయమాలిని. వాళ్లకి పెద్దమ్మ కూతురన్నమాట. అంటే అక్క అవుతుంది.
రాజకుమారి అన్నగారు రామన్న దర్శక నిర్మాత దర్శకుడుగా పాపులర్. ఓ సందర్భంలో జయమాలిని ఇతన్ని కాస్త ఘాటుగానే విమర్శించింది. సినిమాల్లో అవకాశాల కోసం అడిగితే తను పెద్ద స్థానంలో ఉండీ సరిగా స్పందించలేదంది. అయితే ఆ విషయం పక్కన పెడితే …
తెలుగులో మంచీచెడు, ఇంటికి దీపం ఇల్లాలే తదితర చిత్రాలు తీశారు రామన్న . రామన్న అసలు పేరు రామచంద్రన్. అందుకేనేమో ఆయన ఎమ్జీఆర్ తో సన్నిహితంగా ఉండేవారు. రామన్న దగ్గర కూడా మన బెజవాడ మూర్తిగారు అసిస్టెంట్ డైరక్టర్ గా పనిచేశారు. ఎమ్జీఆర్ , శివాజీ గణేషన్ కలసి నటించిన ఒకే ఒక్క సినిమా క్కూండుక్కిలి సినిమా సమయంలో రామన్నగారి కంపెనీలో మూర్తి పనిచేశారు.
సిటీ స్టూడియోలో సౌండు రికార్టిస్టుగా సినీ జీవితాన్ని ప్రారంభించిన టి.ఆర్. రామన్న నెమ్మదిగా దర్శకత్వ శాఖలోకి ప్రవేశించాడు. ఆ తర్వాత ఎమ్జీఆర్, ఎన్టీఆర్ లతో తమిళ తెలుగు భాషల్లో విజయవంతమైన సినిమాలు చేశారు. రామన్న ఎన్టీఆర్ తో తీసిన కార్తవరాయని కథ చిత్రానికి పనిచేస్తున్న సమయంలో మూర్తిగారికి ఎన్టీఆర్ తో పరిచయం అయ్యింది.
కార్తవరాయని కథ చిత్రానికి అధికారికంగా దర్శకుడు రామన్నే అయినా సినిమాను మొత్తంగా డైరక్ట్ చేసింది మూర్తిగారే. మద్దిపట్ల సూరి కథ అందించిన ఈ సినిమా మ్యూజికల్ గా బావుంటుంది. అశ్వత్థామ సంగీతం అందించిన కార్తవరాయని కథలో మల్లాది రాసిన ఆనందమోహనా ఖగరాజ వాహనా అనే పాట కాస్త ప్రత్యేకంగా ఉంటుంది. కార్తవరాయని కథ సమయంలోనే మూర్తిగారి మీద రామారావుకు నమ్మకం కుదిరింది.
అక్కడ నుంచీ విజయా ఎన్ఎటీ సంయుక్త నిర్మాణంలో వచ్చిన రేచుక్క పగటి చుక్క చిత్రానికి చేరిపోయారు. స్వస్తిశ్రీ బ్యానర్ లో వచ్చిన ఈ సినిమా నిర్మాణ ఒప్పందం మీద మూర్తిగారు గొప్పగా జోకేసేవారు. లాభం వస్తేనే తనకు వాటా ఇవ్వాలని … నష్టం వస్తే తనకు సంబంధం లేని విధంగా నాగిరెడ్డి ఒప్పందం రాయించుకున్నారట.
ఆ తర్వాత ఎన్టీఆర్ దగ్గరే సీతారామకళ్యాణానికి కంటిన్యూ అయ్యారు మూర్తిగారు . ఇలా అసిస్టెంట్ డైరక్టర్ గా జీవితం సాఫీగా సాగిపోతుండగా … నటి నిర్మలమ్మ భర్త అయిన కృష్ణారావు మిత్రులు కొందరు బందరు నుంచీ వచ్చి సినిమా తీయాలన్నారు. దానికి మూర్తిని దర్శకుడుగా తీసుకున్నారు. ఎన్టీఆర్ హీరోగా సినిమా మొదలెట్టారు. టైటిలు ఇరుగు పొరుగు. నిజానికి నిర్మలమ్మది బందరే. అయితే విజయవాడ లో ఉండి ఆకాశవాణి కార్యక్రమాల్లో పాల్గొనేది. అలాగే రేడియో నాటకాల్లోనూ నటించేవారు. ఇతరత్రా ఎవరైనా పిలిస్తేనూ వెళ్లి వారి నాటకాల్లో నటించేవారు.
విజయవాడ సత్యనారాయణపురం రాజన్ కిళ్లీ షాపు దగ్గర్లో ఉండేవారట. నిజానికి అంతకు ముందే ఆవిడ సినిమాల్లో రెండు మూడు పాత్రలు చేసి వెనక్కి వచ్చారు. అలా ఇరుగు పొరుగు చిత్రంతో దర్శకుడయ్యారు మూర్తిగారు. ఆ సినిమా బాక్సాఫీసు దగ్గర దెబ్బతిన్నది. దీనికి కారణం ఈ సినిమా మీద ఎన్టీఆర్ తోనే కె.వి రెడ్డిగారు తీసిన శ్రీ కృష్ణార్జున యుద్ధం విడుదలవడం. జయంతీ బ్యానర్ లో కె.వి నిర్మాణ బాధ్యత కూడా వహించి తీసిన సినిమా అది. ఆ సినిమా ముందు ఇరుగు పొరుగు నిలబడలేకపోయింది.
అసలు ఐ.ఎస్ మూర్తి అనగానే గుర్తొచ్చే సినిమా మాత్రం సుఖదుఃఖాలే. ఎస్వీ రంగారావు కోరి మరీ తీయించుకున్న చిత్రం అది. దీని మూల కథా రచయిత కె.బాలచందర్. ఆయన రాసి రంగస్థలం మీద అద్భుతమైన విజయం అందుకున్న మేజర్ చంద్రకాంత్ నాటకమే సుఖదుఃఖాలు సినిమా గా రూపొందింది. నిజానికి ఆ నాటకాన్ని తమిళంలో సినిమాగా తీశారు. అప్పటి నుంచీ అందులో మేజర్ కారక్టర్ తనే చేయాలనే కోరిక ఎస్వీఆర్ లో బలంగా ఉండడంతో నిర్మాతల్ని ఒప్పించి సినిమా తీయించారు.
సినిమా టేకింగుకు సంబంధించి ఎస్వీఆర్ మీద బిఎన్ ప్రభావం బలంగా ఉండేది. అందుకే సుఖదుఃఖాలు స్క్రిప్టు వర్కు పాలగుమ్మి పద్మరాజుగారు చేశారు. సినిమాలో దేవులపల్లి వారి సాహిత్యం … కోదండపాణి సంగీతం … అంతా బిఎన్ సినిమా ధోరణిలోనే నడుస్తుంది. ఎస్వీఆరే స్వయంగా దర్శకత్వం వహించిన బాంధవ్యాలు సినిమా మీద కూడా బిఎన్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. సుఖదుఃఖాలు సినిమాకు సంబంధించిన మరో విశేషం ఏమంటే …
ఈ సినిమాకు వాణిశ్రీ తీసుకున్న పారితోషికం కేవలం నాలుగు వేలే. జయలలిత మాత్రం నలభై వేల వరకు తీసుకున్నారట.
ఇరుగు పొరుగు ఫెయిల్ అయిన సందర్భంలో ఉన్నట్టుండి ఓ రోజు టి.ఆర్ రామన్న నుంచీ కబురొచ్చింది మూర్తిగారికి. తమిళంలో విజయవంతమైన పెరియ ఇడత్తు పెణ్ అనే సినిమాను తెలుగులో శభాష్ సూరి అనే టైటిల్ తో తీయాలనుకుననారు. ఆ సినిమా దర్శకత్వ బాద్యత మూర్తిగారికి అప్పగించారు. ఎన్టీఆరు, కృష్ణకుమారి నటించిన ఈ సినిమాతోనే రమాప్రభ సినీ జీవితం ప్రారంభమయ్యింది. ఈ శభాష్ సూరి ఓ మోస్తరుగా ఆడేయడంతో మూర్తి పర్లేదనే కాన్ఫిడెన్సు నిర్మాతలకు వచ్చింది. దీంతో సినిమాలు రావడం ప్రారంభమయ్యింది.
ఐఎన్ మూర్తి ఓ తరహా సినిమాలకే పరిమితం కాలేదు. సాధారణంగా … ఇండస్ట్రీలో కొందరు క్రైమ్ సినిమాలే తీస్తారనీ, ఫ్యామ్లీ సెంటిమెంటు బాగా తీస్తారనీ, ఇలా ముద్రపడిపోతారు. అదృష్టవశాత్తూ మూర్తిగారికి ఈ ఇబ్బంది ఎదురుకాలేదు. సుఖదుఃఖాలు లాంటి సినిమా తీసిన తర్వాత ఆ నిర్మాతలే అంటే రాఘవ, ఏకాంబరేశ్వరరావుల సారధ్యంలోనే వచ్చిన క్రైమ్ మూవీ జగత్ కిలాడీలు సినిమాకీ పనిచేశారు.
అపరాద పరిశోధన ప్రధానంగా సాగే ఈ సినిమాలోనూ దేవులపల్లి వారితో పాటలు రాయించుకున్నారు. ఎగిరే పావురమా దిగులెరుగని పావురమా , వేళ చూస్తే సందెవేళ ఈ రెండూ శాస్త్రిగారు రాసినవే. సుఖదుఃఖాలుతో మంచిపేరు తెచ్చుకున్న వాణిశ్రీనే ఈ సినిమాలో హీరోయిన్ గా పెట్టుకున్నారు. జగత్ కిలాడీలు సినిమా కూడా మంచి విజయాన్నే సాధించింది.
దాసరి నారాయణరావు డైలాగ్స్ రాసిన ఈ సినిమాకు సంబంధించి మరో విశేషం ఏమిటంటే … తర్వాత రోజుల్లో డైలాగ్ చెప్పాలంటే తనే చెప్పాలి అనే పాపులార్టీ సంపాదించుకున్న రావుగోపాల్రావుకు ఈ సినిమాలో నటి జయలక్ష్మి తండ్రి దశరధరామిరెడ్డితో డబ్బింగు చెప్పించడం. ఆయనే తర్వాత రోజుల్లో రజనీకాంత్ కూ డబ్బింగ్ చెప్పారు. చైన్ జైపాల్ గా ప్రేమసాగరం సినిమాలో పాపులర్ అయిన టి. రాజేందర్ కూ ఆయనే డబ్బింగ్ చెప్పారు.
ఇక మళ్లీ మనం కథలోకి వస్తే … ఓ బాండ్ తరహా చిత్రం తమిళంలో తీశారు ఐఎన్ మూర్తి. సినిమా పేరు ఢిల్లీ టూ మద్రాస్ . ముత్తురామన్ , జయశంకర్ లు హీరోలుగా చేసిన ఈ సినిమా ద్వారా నటి శ్రీ విద్యకు ఇండస్ట్రీకి పరిచయం చేశారు. శ్రీ విద్య ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసురాలు ఎమ్మెల్ వసంతకుమారి కుమార్తె. మూర్తిగారు తన దగ్గరకు వచ్చిన నిర్మాతలకే సినిమాలు చేశారు తప్ప తనకుగా తాను వెళ్లి అవకాశాల కోసం వెంపర్లాడలేదనే మాట కూడా వినిపిస్తుంది.
తెలుగులో ఫ్యాక్టరీలాగా సినిమాలు తీసిన నిర్మాతలు కొందరు కనిపిస్తారు. వాళ్లలో అట్లూరి పూర్ణ చంద్రరావు ఒకరు. ఆయన నిర్వహణలో పి.వి.సుబ్బారావు నిర్మాతగా వచ్చిన జగమే మాయ సినిమా అవకాశం మూర్తిగారి దగ్గరకు వచ్చింది. గొల్లపూడి స్క్రిప్టు రాసిన ఆ సినిమా కూడా క్రైమ్ బ్యాక్ డ్రాపులోనే నడుస్తుంది. నిజానికి ఈ సినిమాకి ఓ హిందీ సినిమా బేస్ ఉంది.
ఎస్.డి లాల్ తను తీసిన ఓ షార్ట్ ఫిలింలో నటించిన కుర్రాళ్లను చూపించి మూర్తిగారూ మీరేదో కొత్తోళ్లతో సినిమా అంటున్నారు కదా … వీళ్లేమన్నా మీకు ఉపయోగపడతారేమో చూడండి అన్నారట. అలా సెలక్ట్ చేసుకున్న కుర్రాళ్లే మురళీమోహన్, గిరిబాబు… ప్రస్తుతం ఉన్న హీరోల్లో మూర్తిగారి దగ్గర పనిచేసిన వారిలో చిరంజీవి కూడా.
ఎన్టీఆర్, ఎస్డీ లాల్ కాంబినేషన్ లో నిప్పులాంటి మనిషి, నేరం నాది కాదు ఆకలిది లాంటి క్రైమ్ సినిమాలు తీసిన రవిచిత్రా వై.వి.రావ్ … కోతి ప్రధాన పాత్రలో తీసిన శ్రీ రామబంటు చిత్రానికి మూర్తిగారే డైరక్టరు. అందులో హీరో పాత్రకు చిరంజీవిని తీసుకున్నారు. సినిమా మంచి విజయాన్నే అందించింది.
దాదాపు శ్రీ రామబంటు మూర్తిగారి చివరి చిత్రం. ఆ తర్వాత ఆయనకి అవకాశాలు రాలేదు. అప్పటికే ఆయన వయసు యాభై దాటేసింది. ముగ్గురు పిల్లలను జీవితంలో సెటిల్ చేయడం మీద దృష్టి సారించారు. అయితే ఇండస్ట్రీ తనను మరచిపోయిందనే ఆవేదన మాత్రం ఆయనలో కనిపించేది.
Share this Article