నేను 300 కోట్లు పెట్టాను, నేను 400 కోట్లు పెట్టాను… టికెట్ల ధరలు పెంచుకుంటాం, మీ కాళ్లు మొక్కుతాం, పర్మిషన్ ఇవ్వండి అని మన దర్శకులు, నిర్మాతలు, హీరోలు పాలకుల దగ్గర దేబిరిస్తున్న సీన్లు చూశాం… తీరా చూస్తే చందమామ కథలకన్నా అధ్వానం… జనం ఛీకొడుతున్నారు.. ఇదీ మన స్టేటస్… ఇదీ మన టేస్ట్… ఇదీ మన భావదారిద్య్రం… ఎంతసేపూ హీరో అనబడే ఓ సూపర్ నేచురల్ కేరక్టర్ దగ్గర కథాకాకరకాయ పొర్లుదండాలు పెడుతూ ఉంటుంది…
దిక్కుమాలిన యాక్షన్ సీన్లు… స్మగ్లర్ల కథలు, మాఫియాలు, ప్రతీకారాలు… చరిత్రలకు వక్రబాష్యాలు, మోటార్ సైకిళ్లను అలా తిప్పేస్తూ ఉంటారు… పులులు, సింహాలకు ఎదురెళ్తుంటారు… ఓ లాఠీతో వేలమందిని ఆజమాయిషీ చేస్తుంటారు… కాదంటే సమాంతరంగా హీరోయిన్ అనబడే ఓ తోలుబొమ్మ తొడలు, బొడ్డు, చంకలు, నడుం వంపుల్లో పడి తెలుగు క్రియేటివిటీ సూసైడ్ చేసుకుంటూ ఉంటుంది… అదేదో సినిమాలో హీరోయిన్ కాళ్ల దగ్గర హీరో నేల మీద పడుకుని మరీ ‘నీ కాళ్లను పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్లు’ అని పొర్లిగింతలు పెడుతుంటాడు… చివరకు ఇంకేదో సినిమాలో శివుడు, పార్వతి ప్రణయాన్ని మంచి ఫీల్‌తో రాసినా సరే, లాహే లాహే అని పిచ్చి సినిమా స్టెప్పులు వేసి ఆ ఫీల్‌ను మట్టిలో కలిపేస్తాడు… ఇవన్నీ రీసెంటు మాస్టర్ పీసులే…
కానీ మలయాళంలో జస్ట్, 10 కోట్లతో ఓ సినిమా తీశారు… పేరు జనగణమన… ఏప్రిల్‌లోనే రిలీజ్ చేశారు… 50 కోట్లు వసూలు చేసింది… ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ చేశాక తమిళం, తెలుగు వెర్షన్ల మీద కూడా జనంలో బాగా చర్చ సాగుతోంది… దర్శకుడు ఓ సామాజిక ప్రయోజనం కలిగిన డిబేట్‌ను ముందుపెట్టాడు… కళ సాధించాల్సిన ప్రయోజనం ఇదే… దర్శకుడి భావాలతో అందరూ ఏకీభవించాలని ఏమీ లేదు… విభేదించేవాళ్లు కూడా బోలెడు మంది ఉంటారు… కానీ ఫేక్ ఎన్‌కౌంటర్లు అనే చర్చను జనంలోకి వదిలాడు… అదీ మలయాళం సినిమాల టేస్ట్…
Ads
వాళ్లు మొదటి నుంచీ అంతే… తక్కువ ఖర్చుతో, తక్కువ సమయంలో భిన్నమైన ఔట్‌పుట్ ఇస్తారు… రిస్క్ తక్కువ… ఎక్కువ పెట్టుబడి ఉంటే ఎక్కువ అవలక్షణాలు చేరతాయి సినిమాలో… కొన్నాళ్లుగా తమిళంలోనూ మంచి కథాంశాలతో సినిమాలు వస్తున్నాయి… ఎటొచ్చీ దిక్కుమాలిన బాటలో పయనిస్తున్నది తెలుగు సినిమాయే… ప్రధాన కారకులు పెద్ద హీరోలు, వాళ్ల పైత్యాలే…
జనగణమన సినిమా విషయానికి వస్తే… దర్శకుడు మన మీడియా, పోలీస్, పొలిటికల్ వ్యవస్థల డొల్లతనాన్ని బట్టలిప్పి బజారున పెట్టేస్తాడు… బహుశా సీక్వెల్ కూడా రాబోతున్నట్టుంది ఈ సినిమాకు… ప్రత్యేకించి ఈ సినిమాలో మీడియా మీద, జాతికి అది చేస్తున్న ద్రోహం మీద, దాని ప్రభావం మీద, వెర్రి పోకడల మీద దర్శకుడు పాశుపతాస్త్రాలే వదిలాడు… నిజం… ప్రస్తుతం సొసైటీకి సోకిన ప్రధాన కరోనా మీడియా… దీనికి వేక్సిన్ లేదు, చికిత్స లేదు… సమాజంలో భిన్న అంశాల మీద మీడియా ఉన్మాదాన్ని ఎలా రేకెత్తించగలదో చెబుతాడు దర్శకుడు…
ఇక పోలీస్, పాలిటిక్స్ గురించి చెప్పాల్సిన పనేలేదు… సత్వరన్యాయం దిశలో జరిగే తప్పుల్ని చర్చించాడు కథలో… ఇదంతా ఆ సినిమా మీద రివ్యూ కాదు… కానీ ఓ సీరియస్ సబ్జెక్టును ప్రేక్షకుడికి బోర్ కలగకుండా రాసుకున్న స్క్రిప్టులో విశేషం ఉంది… ప్రేక్షకుడిని ఆలోచనల్లో పడేసిన తీరులో విశేషం ఉంది… చివరకు చాలామంది డ్రై సీన్లుగా భావించే కోర్టు విచారణల్ని కూడా ఆసక్తిగా మలచడంలో విశేషం ఉంది… సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో ఉంది…!! దర్శకుడు డిజో జోస్ ఆంటోనీకి అభినందనలు…!!
Share this Article