నిజానికి విజయసాయిరెడ్డి ప్రైవేటుగా ఎవరితో ఎలా మాట్లాడతాడో తెలియదు… కానీ నిన్నటి ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడిన విధానం, వాడిన భాష తన స్థాయికి తగినట్టు లేదు… కడుపులో రగిలిపోతున్నట్టుంది, అదుపు తప్పాడు… పదే పదే కమ్మ కులాన్ని ప్రస్తావించడం, మీడియా మొత్తాన్ని తిట్టిపోయడం బాగాలేదు…
ఎవరో ఓ ఎండోమెంట్ అధికారిణి… పేరు ఏదైతేనేం, కులం ఏదైతేనేం… ఆమెకూ సాయిరెడ్డికీ రంకు అంటగట్టి ఓ సెక్షన్ మీడియా ఎడాపెడా రాసేస్తోంది, ఏదేదో చెప్పేస్తోంది… ఐతే అవన్నీ మీడియా సొంత సృష్టి కాదు… ఆ అధికారిణి మాజీ భర్తగా చెప్పబడుతున్న వ్యక్తి ఏదో ఆరోపణ చేశాడు… ఇక దానికి మసాలాలు జోడించి, అధిక ప్రాధాన్యం ఇచ్చి గాయిగత్తర లేపుతోంది ఆ మీడియా…
సాయిరెడ్డికి మగబిడ్డల్లేరు, కాబట్టి ఓ మగబిడ్డను కని ఇస్తానని తన భార్య అంగీకరించి, సంబంధం పెట్టుకుందని ఆమె మాజీ భర్త ఓ నీచారోపణ చేశాడు… ఆయనకు తన మాజీ భార్యతో ఏవో తేల్చుకోవాల్సిన పంచాయితీలు ఉన్నట్టున్నాయి… అందుకే ఆమెను మరీ బజారుకు లాగుతున్నాడు… DNA టెస్టుకు సాయిరెడ్డి రెడీయా అని సవాల్ విసురుతున్నాడు… పోనీ, నిరూపించి తను సాధించేదేమిటి..? ఎలాగూ ఆమె వదిలేసింది కదా, ఇలా బజారుపాలు చేసి శాడిస్టిక్ ఆనందం పొందడమా తన ఉద్దేశం… సరే, ఇంకేం, సాయిరెడ్డి దొరికాడు కదాని యాంటీ వైసీపీ మీడియా ఇలా పండుగ చేసుకుంటోంది…
Ads
ఆ పాత భర్త వేధింపులు తట్టుకోలేక విడిపోయాననీ, తాను వేరే పెళ్లి చేసుకున్నానని ఆమె చెబుతోంది… నిజానికి ఇలా వివరణ ఇచ్చుకోవల్సి రావడం ఒక మహిళకు చాలా ఇబ్బందికరమే.,. ఉండొచ్చు, సాయిరెడ్డి విశాఖ అక్రమాలు, లీలల మీద చాలా ఆరోపణలు ఉండొచ్చు… ప్రతిచోటా రాజకీయాలు క్రూరం, ఏపీలో నీచం కూడా..! రాజకీయాలతో మాత్రమే అంటకాగే పాత్రికేయమూ అక్కడ అంతే… ఓ మహిళను మరీ బజారుకీడ్చి మీడియా రచ్చ రచ్చ చేస్తున్న తీరు ఇదే…
ఐనా, ఏపీలో తిట్లు, విమర్శలు, సోషల్ దుమారం అన్నీ ఇలాంటి బురద రాజకీయాలే కదా… ఎవరూ తక్కువ కాదు… ప్రత్యేకించి సోషల్ మీడియాలోకి కుటుంబసభ్యులను, మహిళలను కూడా లాగి శీలహననం చేసిన సందర్భాలు ఏపీలో కోకొల్లలు… అంతెందుకు..? వైసీపీ సభ్యుల దూషణలకు సాక్షాత్తూ చంద్రబాబే కన్నీళ్లు పెట్టుకున్నాడు కదా… జనసేన, టీడీపీ, వైసీపీ… ఏ సోషల్ మీడియా వింగూ తక్కువ కాదు…
ఇదే సాయిరెడ్డి ట్విట్టర్ ఖాతా నుంచి బోలెడు అభ్యంతకరమైన ట్వీట్లు కనిపించేవి మొదట్లో… తరువాత కాస్త మారినట్టున్నాయి… ఇప్పుడు తన దాకా వస్తే గానీ తెలియడం లేదు ఆయనకు…
మీడియాపరంగా పదే పదే జరుగుతున్న దాడిని ఆ అధికారిణి ఇక తట్టుకోలేక తను గిరిజన మహిళను అయినందునే తనపై ఈ దాడి జరుగుతుందని చెప్పడమూ సరికాదు… ఆరోపణలు చేస్తున్నది ఆమె మాజీ భర్త… కులం కారణంగా సాగుతున్న దుష్ప్రచారం కాదు, ఐనా ఆమెపై ఈ మీడియా భీకర దాడి కూడా వెగటుగా ఉంది… మరీ టీడీపీ వీరాభిమాన జర్నలిస్టులయితే ఇష్టారాజ్యంగా చెలరేగిపోతున్నారు…
ఐనా సరే, సాయిరెడ్డి భాష అలా ఉండకూడదు… సింపుల్‌గా ఆ భార్యాభర్తల వివాదంతో తనకు సంబంధం లేదు, తనను అనవసరంగా లాగుతున్నారు, నేను కోర్టులో తేల్చుకుంటాను అంటే సరిపోయేది… కులసంఘాల్ని దింపుతాను, కోర్టుకు ఎక్కుతాను, మీడియా అంతు చూస్తాను, నేనే చానెల్ పెడతాను, బదనాం చేసేవాళ్లలో మా పార్టీవాళ్లు ఉన్నా వదలను వంటి వీరావేశం అక్కర్లేదు… నోరు పెంచేకొద్దీ మరింతగా వివాదంలోకి జారిపోవడం, ఇరుక్కోవడం… ఇలాంటప్పుడే మాటల్లో, భాషలో సంయమనం అవసరం…
మళ్లీ ఆ అధికారిణి దగ్గరకు వద్దాం… ఆమె భర్తతో విడిపోవాలనుకోవడం, వేరే పెళ్లి చేసుకోవడం ఆమె వ్యక్తిగతం, ఆమె ఇష్టం… తనతో పడనప్పుడు తెగదెంపులు చేసుకుంది… తను వదిలేసినోడు ఇంకా వేధిస్తున్నాడు, బజారుకు లాగుతున్నాడు… మరి తన ఆరోపణలకు మీడియా అంత ప్రాధాన్యం ఇవ్వడం దేనికి..? సాయిరెడ్డి పేరు వస్తున్నందుకే కదా… రాజకీయాల్లో దొరికాడు కదాని తనను బదనాం చేస్తున్నారు సరే, నడుమ ఆమెనూ చిత్రవధ చేస్తున్నట్టే కదా…!!
Share this Article