జల్లి కీర్తి… ఐఏఎస్ అధికారి… అస్సోంలోని కచార్ జిల్లా కలెక్టర్… ఒకసారి ఈమె గురించి ఖచ్చితంగా చెప్పుకోవాలి మనం… మన బిడ్డ అని మనం స్వీయాభినందనలు చెప్పుకోవాలి… ప్రస్తుతం జాతీయ మీడియా మొత్తం ప్రస్తుతిస్తోంది ఆమెను… ఎందుకంటే..? కొన్ని ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి… నెటిజన్లు చప్పట్లు కొట్టేస్తున్నారు… సాధారణంగా ట్రోలింగ్ మాత్రమే ఇష్టపడే నెటిజనం ఈమెకు ఎందుకు నీరాజనాలు పలుకుతున్నదో పరిశీలించాలి…
అవును, మీకు పెద్దగా ఆమె వివరాలు నెట్‌లో దొరకవు… ఆమె పని ఆమె చేసుకుంటూ పోతుంది… లో ప్రొఫైల్… మనం చెప్పుకుందాం ఆమె గురించి… అచ్చ తెలంగాణ ఆడబిడ్డ ఆమె… జనగామ ఏరియా, నర్మెట్ట మండలం, తరిగొప్పుల ఆమె స్వస్థలం… ఒకప్పుడు నక్సల్స్ అడ్డా… మధ్యతరగతి కుటుంబం… తండ్రి పేరు జల్లి కనకయ్య… పెదనాన్న జల్లి సిద్ధయ్య, లీడర్ కమ్ లాయర్… తండ్రి కనకయ్య ఉస్మానియాలో చదివాడు… లా గ్రాడ్యుయేట్… కొన్నాళ్లు ప్రభుత్వ ప్లీడర్‌గా కూడా చేశాడు… ఇద్దరు ఆడపిల్లలు… ఈమె పెద్దామె…
Ads
తన ప్రాక్టీస్, కొలువు కోసం కనకయ్య హైదరాబాద్‌లోనే ఉండేవాడు… నాలుగైదేళ్ల క్రితం తెలంగాణ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ తను… బిడ్డ కీర్తి పుట్టింది, పెరిగింది, చదివింది అన్నీ హైదరాబాదే… ఒక్క ముక్కలో చెప్పాలంటే ప్యూర్ హైదరాబాదీ… చదువుకున్నది శ్రీనిధి ఇంజినీరింగ్ కాలేజీలో కంప్యూటర్స్ సైన్స్… (చెల్లె ఐశ్యర్య కూడా ఐఐఎంలో చదివి బెంగుళూరులో జాబ్ చేస్తోంది…) అయ్యో, ఇద్దరూ ఆడపిల్లలే వాళ్ల చదువుల కోసం ఉన్నదంతా ఖర్చు పెట్టేస్తున్నాను అని ఎప్పుడూ కనకయ్య ఆందోళన పడలేదు…
ఆడపిల్లల చదువు ప్రాధాన్యం గురించి తనకు తెలుసు… వాళ్లకు తనే గైడ్… ఇంజనీరింగ్ కాగానే ఢిల్లీకి పంపించాడు కీర్తిని… ఐఏఎస్ కోచింగ్ కోసం… అదీ ఖర్చే… కానీ ఓ ఏడాది కష్టపడి, తొలి ప్రయత్నంలోనే 89 ర్యాంకుతో ఐఏఎస్ కొట్టేసింది… (బర్త్ year కూడా 1989).. దక్కింది అస్సోం కేడర్… కష్టంగా భావించలేదు కీర్తి… ఇష్టంగా వెళ్లి జాయినైపోయింది… మన కనకయ్య బిడ్డ కదా… మన తరిగొప్పుల ఎంతో అస్సోంలోని ప్రతి పల్లే అలాగే నా పల్లె అనుకుందామె…
ఎందుకు కీర్తి గురించి చెప్పుకోవాలి..? కారణం ఉంది… ఒక పూజా సింఘాల్ ఐఏఎస్… అధికార దుర్వినియోగానికీ, డబ్బు సంపాదనకు ప్రతీక… మొన్న కుక్కతో వాకింగ్, స్టేడియం దుర్వినియోగంలో బదనాం అయిపోయి, జనం ఛీత్కరణతో ఏకంగా అరుణాచల్‌ప్రదేశ్‌కు తరిమేయబడిన ఒక రింకూ డుగ్గా ఐఏఎస్… బాధ్యతారహితమైన బతుక్కి, కొలువుకు ప్రతీక… వాళ్లతో పోలిస్తే కీర్తి ఎంత ఫార్ ఫార్ బెటర్… !! అదుగో అదే నెటిజన్లు నీరాజనాలు పట్టడానికి కారణం…
ఆమె మొదటిసారి హైలకండి జిల్లా కలెక్టర్ (అస్సోంలో డిప్యూటీ కమిషనర్‌గా పిలుస్తారు కలెక్టర్ పోస్టును) అయినప్పుడు… అందరూ ఆమెను చూసి జాలిపడ్డారు… మూడు ఈశాన్య రాష్ట్రాల నడుమ, బంగ్లాదేశ్ సరిహద్దులకు చేరువలో ఉన్న ఈ దేశపు మారుమూల జిల్లా అది… గుట్టలు, కొండలు, ఆదివాసులు, అడవులు… మనసులో ఏ సందేహమూ, అసంతృప్తీ లేకుండా, సంతోషంగా తన బాధ్యతలు స్వీకరించింది ఆమె…
అక్కడ ఆడవాళ్లలో విపరీతమైన రక్తహీనత… పిల్లల్లో పౌష్టికాహారలోపం… ఇవీ ఆమె గమనించి మొదట ఫోకస్ చేసిన అంశం… సెల్ఫ్ హెల్ప్ గ్రూపులను బాగా యాక్టివేట్ చేసింది… అంగన్‌వాడీలతో లింక్ చేసింది… అప్పటిదాకా పంపిణీ చేసే ఐరన్ టాబ్లెట్లను పల్లెజనం పెద్దగా పట్టించుకునేవాళ్లు కాదు… దాంతో ఉసిరి, బెల్లంతో చేసిన ఓ రకమైన స్వీట్ తయారు చేయించేది… రోగనిరోధకశక్తి, విటమిన్ సి, ఐరన్ అన్నీ ఒకేసారి సమకూరేలా…
అంగన్‌వాడీల్లో అప్పటికప్పుడు భోజనం వండి వడ్డించేలా చేసింది… పిల్లలు తాము ఇంటి నుంచి తెచ్చుకునే టిఫిన్ బాక్సులను ఇతర పిల్లలతో పంచుకునేలా, మార్పిడి చేసుకునేలా ఎంకరేజ్ చేసింది… ఎక్కువ రుచులతోపాటు పిల్లల నడుమ కుల, మత వైరుధ్యాలు దూరం చేయడం ఆ చర్య ఉద్దేశం… ఒక్కొక్కటీ తనదైన స్టయిల్‌లో మార్చుకుంటూ, కేంద్ర పథకాలను ఆర్గనైజ్ చేసుకుంటూ సాగిపోయిందామె…
మొన్నటి కరోనా పీరియడ్… ఆమెకు పెళ్లి ఖాయమైంది… కానీ పెద్ద ఎత్తున ఫంక్షన్ చేసుకునే పరిస్థితి లేదు… వరుడు ఆదిత్య కీర్తి… బిజినెస్‌మ్యాన్… కరోనా ఆంక్షలకు ఓ జిల్లా కలెక్టర్‌గా తనే ఆదర్శంగా ఉండాలి కదా… వరుడిని ఫ్లయిట్‌లో రప్పించి, క్వారంటైన్‌లో ఉంచారు కొన్నాళ్లు… నిజానికి 50 మందికి మించి అతిథులు ఉండటానికి వీల్లేదు… మీరు నమ్ముతారా..? జస్ట్, 15 మంది అతిథులతో ఒక కలెక్టర్ పెళ్లి చేసుకుంది… అది కాదు అసలు విశేషం… పెళ్లయిన తెల్లవారే విధులకు హాజరైంది… ఓ కరోనా హాస్పిటల్ అప్‌గ్రెడేషన్ పనుల సమీక్షకు వెళ్లిపోయింది… దటీజ్ జల్లి కీర్తి…
తరువాత సచార్ జిల్లా కలెక్టర్‌గా మార్చారు… పక్క జిల్లాయే… తను ఎప్పుడు ఏ ఊరికి వెళ్లినా వరదల సమయంలో వస్తున్న ఇక్కట్ల గురించి చెప్పేవాళ్లు… మొన్న భారీవర్షాలు, వరదలు ఆ ప్రాంతాలను ముంచెత్తాయి… అసలు ప్రాబ్లం ఏమిటో తెలుసుకోవడానికే ఇదే కరెక్టు సమయం అనుకుంది… బయల్దేరింది… బురద బాటలు, ముంపు ప్రాంతాలు, నడుస్తూ, పడవల్లో వెళ్తూ, మాట్లాడుతూ, వరదసాయం పంపిణీ చేస్తూ సాగిపోయింది… అదుగో ఆ ఫోటోలు, ఆ వీడియోలే ఇప్పుడు వైరల్ అవుతున్నాయి… ఆమెకు లభించిన అవార్డుల గురించి ఇక్కడ ఏమీ రాయడం లేదు… వాటితో ఆమెకు విలువేమీ లేదు… నిజానికి అవే విలువను పెంచుకున్నాయి… అందుకని…!! (తెలంగాణ మీడియా అని గొప్పలు చెప్పుకునే వాళ్లకు ఇవెందుకు కనిపించవో సమజ్ కాదు కదా… కాస్త అభినందించండర్రా…)
Share this Article