Murali Buddha ఎంఐఎం అసదుద్దీన్ ను హడలెత్తించిన కొండయ్య … జర్నలిస్ట్ జ్ఞాపకాలు
ఉమ్మడి రాష్ట్రంలో, ఇప్పుడు తెలంగాణలోనైనా ఫలితాలు ఎలా ఉండవచ్చు అని రకరకాలుగా చెబుతారు కానీ పాత నగరంలోని నియోజకవర్గాల ఫలితాల విషయంలో అందరిలో ఏకాభిప్రాయం ఉంటుంది . పాతనగరం సీట్లను యంఐయం పార్టీకి వదిలేసి లెక్కలు చెబుతారు . అలాంటిది యంఐయం నేత అసదుద్దీన్ ఒవైసి సైతం హడలిపోయేట్టు చేశారు ఒకరు . ఎవరు అమానుల్లా ఖానా ?
అంటే.. . అమానుల్లా ఖాన్ పార్టీ ఎంబీటీకి మూడు అసెంబ్లీ సీట్లు వస్తే ఎంఐఎంకు ఒకటే స్థానం వచ్చిన సందర్భం ఉంది . అమానుల్లా ఖాన్ శాసనసభ్యుడిగా ఉండి ఒవైసిపై ఎంపీగా పోటీ చేసి దెబ్బ తిన్నారు… కానీ లేకపోతే పాతనగరం ఒవైసి చేతి నుంచి అమానుల్లా ఖాన్ చేతికి వచ్చేది . ఆ ఒవైసిని హడలెత్తించింది ఖాన్ కాదు మరెవరూ అంటే ? కొండయ్య .. ఔను నిజం కొండయ్య .. ఈ కొండయ్య ఎవరో అసదుద్దీన్ ఒవైసీకి తెలియకపోవచ్చు , కొండయ్యకు ఒవైసి తెలిసి ఉండకపోవచ్చు… కానీ కొండయ్య వల్ల ఎంఐఎం హడలిపోయిన విషయం నిజం ..
Ads
******
ఛానల్స్ తిరగేస్తుంటే NTV లో కేఏ పాల్ కనిపించగానే అలానే వింటూ ఉండిపోయాను . నేనే కాదు హాస్యాన్ని ఇష్టపడే ఎవరైనా పాల్ మాటలను వింటూ ఉండిపోవలసిందే . 350 మంది ఎంపీలు తనకు పాదపూజ చేశారని , ప్రధాని కూడా పాదపూజ చేశారని చెప్పుకుపోతున్నాడు . ఈసారి అధికారంలోకి వచ్చేది తానే అని జగన్ కన్నా ధీమాగా చెబుతున్నారు . కరోనా కష్టకాలంలో అందరి ముఖాల్లో కాసేపైనా నవ్వులు పూయించింది కేఏ పాల్ . ఆయన చెబుతున్నవి నిజం అని కనీసం ఆయన కూడా అనుకోరు, అందరూ వింటూ ఎంజాయ్ చేస్తారు .
ఒకప్పుడు ఆయన అమెరికా అధ్యక్షుడిని కలిసింది నిజమే . అనేక మంది దేశాధినేతలతో సమావేశం అయింది నిజమే . సొంత విమానం నిజమే . ఇవన్నీ గతం… ఇప్పుడు ఎక్కడా నోటాకు వచ్సినన్ని ఓట్లు కూడా పొరపాటున కూడా ఆయనకు రావు… కానీ ఆంధ్ర , తెలంగాణాయే కాదు, మొత్తం దేశంలో తన పార్టీయే అధికారంలోకి వస్తుంది అని ధీమాగా చెబుతాడు .
పక్కన ఉన్న జ్యోతితో సాక్ష్యం చెప్పిస్తారు . సాధారణంగా ఎన్నికల ప్రచారంలో ఒక పార్టీ వారిని మరో పార్టీ వారు శత్రువులా గుర్రున చూస్తారు . కానీ పాల్ కనిపించారు అంటే ఏ పార్టీ వారైనా నవ్వుతూ సెల్ఫీ తీసుకుంటారు . అంతా నిజమే అనుకొని ఆయన చెప్పే మాటలు వింటుంటే తేడా మనకా ? ఆయనకా ? అర్థం కాదు . ఇదో చిత్రమైన మానసిక స్థితి, బాగానే మాట్లాడుతారు , బాగానే ఉంటారు . ఒక్కోసారి తెలివిగా మాట్లాడుతున్నారు అనిపిస్తుంది కానీ ఏదో తేడా ఉంటుంది …
****
ముందు కొండయ్య గురించి చెప్పండి, మధ్యలో కేఏ పాల్ కథ ఏమిటీ అంటే ? ఆగండాగండి, అక్కడికే వస్తున్నాను . ఇంతకూ కొండయ్య ఎవరు ? అప్పటి నగర పోలీసు కమిషనరా ? ఎన్నికల అధికారా ? రా అధికారా ? అంటే ఇవేవీ కాదు . మానసికంగా కొంత తేడా ఉన్న వ్యక్తి . బాగా మాట్లాడేవాడు . సమాజానికి ఏదో మేలు చేయాలి అనుకునే వాడు . ఒక్క మాటలో చెప్పాలి అంటే కేఏ పాల్ ను కొత్తవారు చూస్తే ఎవరికైనా అనుమానం వస్తుందా ? కొత్తవారికే కాదు పాల్ పాత పలుకుబడి చూసి ఇప్పటికీ విమర్శించాలి అంటే కొంత కష్టమే .
ఐడీపీయల్ లో శాస్త్రవేత్తగా చేశాను అని కొండయ్య చెప్పేవారు . ఎన్నికల విధానంలో మార్పు రావాలి అంటూ ప్రచారం చేసేవారు . గ్యాప్ ఉద్యమం అంటూ ఒకసారి పోటీ చేసినవారు రెండవసారి పోటీ చేయవద్దు అని… ఇలా ఉండేవి అతను సూచించే మార్పులు …
****
ఎన్నికల సంస్కరణలపై ఓసారి లోక్ సత్తా జయప్రకాశ్ నారాయణ నౌబత్ పహాడ్ వద్ద ఉన్న తమ పార్టీ కార్యాలయంలో చర్చ . మీడియా కూడా ఉంది . ఇంతలో కలకలం . కొండయ్య వచ్చి మీరు నిజంగా ఎన్నికల సంస్కరణలు కోరుకుంటే నేను చెప్పిన సంస్కరణలపై ఎందుకు చర్చించడం లేదు అని వాదన పెట్టుకున్నాడు . కొందరు కార్యకర్తలు కొండయ్యను ఎత్తుకెళ్ళి బయట పారేసి వచ్చారు . మీరు కంగారు పడకండి మా మీటింగ్ ఎప్పుడు జరిగినా ఇది కామన్ అని జయప్రకాశ్ నారాయణ అందరినీ కుర్చోబెట్టారు .
****
2002 హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు . గార్గ్ అని ఐఏఎస్ రాష్ట్ర ఎన్నికల అధికారి . వారిని ఎలా ఒప్పించారో కానీ కొండయ్య ఎన్నికల సంస్కరణలకు ఒప్పించారు . హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఓటు వేసే ప్రతి ఒక్కరు వేలి ముద్ర వేయాలి కదా . వేలి ముద్రలు రికార్డ్ చేస్తారు . దీనివల్ల బోగస్ ఓట్లు వేయడం ఉండదు అని కొండయ్య ఒప్పించారు . ఆ ఎన్నికల్లో తొలిసారి వేలిముద్రలను రికార్డ్ చేశారు .
హైదరాబాద్ ఎన్నికల చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 30 శాతం లోపే పోలింగ్ జరిగింది . ఓల్డ్ సిటీలో బోగస్ ఓట్ల మాట దేవుడెరుగు తమ ఓటు తాము వేయడానికే భయపడ్డారు . వేలి ముద్రలు రికార్డ్ కావడం వల్ల ఉద్యోగానికి గల్ఫ్ దేశాలకు వెళితే అడ్డంకి కావచ్చు అని భయపడ్డారు . పోలింగ్ జరుగుతుండగానే అసదుద్దీన్ వేలిముద్రల నిబంధన పార్టీకి కొంప ముంచేట్టు ఉందని ఆందోళన వ్యక్తం చేశారు . కొండయ్య పుణ్యమా ? అని అతి తక్కువ శాతం పోలింగ్ రికార్డ్ నమోదు అయింది . తాను చేసిన అభివృద్ధి పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారని, ఐతే ఆ రోజు క్రికెట్ వల్ల పోలింగ్ శాతం తక్కువగా ఉందని అప్పుడు సీఎంగా ఉన్న బాబు చెప్పారు . తీగల కృష్ణారెడ్డి మేయర్ అయ్యారు . ఎన్నికల సంస్కరణలు తెచ్చిన కొండయ్యకు పాల్ తో పోలికా అంటే ? ….
****
కొండయ్య రెగ్యులర్ గా ఆంధ్రభూమి ఆఫీస్ కు నా కోసం వచ్చేవారు . అతను కనిపించగానే మిగిలిన వారు మీ ఫ్రెండ్ వచ్చాడు అంటూ జోకులేసేవారు . చిత్రమైన ఉద్యమాలు చేసేవారు . కర్నూల్ వెళ్లి అర్ధరాత్రి ఓ.. ఓ .. అని అరుపులు .. ఎందుకీ అరుపులు అని అడిగితే అరుపులకు జనం లేచి ఏమైంది అని అడిగితే ఎన్నికల సంస్కరణల అవసరం గురించి వారికి వివరిస్తారు . (నిద్రించే జాతికి మేలుకొలుపు అన్నమాట)
ఒకసారి గుండు కొట్టించుకునే ఉద్యమం . కొండయ్య , అయన భార్య మాత్రమే గుండుకొట్టించుకున్నారు . ఏదో తేడా ఉందని మాట్లాడడం తగ్గించాను . ఎన్నికల సంస్కరణలపై పిచ్చి పిచ్చి రాతలతో కరపత్రాలు ముద్రించేవారు . చదవడానికి కూడా తీసుకోకుండా పంపిస్తే … ఆ తరువాత ఎన్నికల సంస్కరణలు రాకుండా రామోజీరావుకు నేను అమ్ముడుపోయాను అని ఓ కరపత్రంలో నా గురించి రాసి నాకే ఇచ్చాడు . రామోజీకి అమ్ముడుపోవడానికి సిద్ధంగా ఉన్నాను . మీరే బేరం ఆడండి , చెరి సగం తీసుకుందాం అని చెప్పి పంపాను .
తరువాత ఏమయ్యాడో పట్టించుకోలేదు . చాలా నెలల తరువాత వాళ్ళ అమ్మాయి ఫోన్ చేసి ఆఫీస్ లోనే కింద ఉన్నాను అంటే వెళ్ళాను . బ్యాంకు లో అకౌంట్ ఓపెన్ చేయాలి అంటే కలకత్తా వెళ్లమంటున్నారు . నన్ను సిబిఐ వాళ్ళు ఫాలో అవుతున్నారు అంటూ ఏవేవో చెబుతుంటే పాపం ఇంటిల్లిపాది తేడానే అనుకోని పని ఉందని ఆఫీస్ లోకి వెళ్ళిపోయా …
****
నాలుగు దశాబ్దాల క్రితం సినిమా తీసిన మూడు పాతికల వయస్సున్న ఒకాయన తన ఫోన్లను పదేళ్ల నుంచి ట్యాపింగ్ చేస్తున్నారు అని ఆరోపించారు . పదేళ్ల నుంచి తాను ఎవరితో మాట్లాడడం లేదని , తనతో ఎవరూ మాట్లాడడం లేదని .. మాట్లాడకుండా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని ఆరోపణ . అసలు ఏం జరిగిందో తెలియదుకానీ ఎవరేం మాట్లాడుకుంటున్నారో రహస్యంగా వినడం ఫోన్ ట్యాపింగ్ అవుతుంది కానీ .. ఫోన్ లో మాట్లాడకుండా చేయడం ట్యాపింగ్ ఎలా అవుతుందో ? మాట్లాడుకుంటే రహస్యాలు వినొచ్చు కానీ , మాట్లాడకుండా చేస్తే ఏం తెలుస్తుంది . ఫోన్ బాగా లేదా ? సిగ్నల్స్ లేవా ? ఏమో కొందరి మాటలు అస్సలు అర్థం కావు …. – బుద్ధా మురళి
Share this Article