కొంచెం ఇంట్రస్టింగు వార్తే… సుఖేశ్ చంద్రశేఖర్ అనే నిందితుడు తనకు తీహార్ జైలులో ప్రాణహాని ఉందనీ, వేరే జైలుకు మార్చాలని ఏకంగా సుప్రీం కోర్టుకు వెళ్లాడు.., అయ్య బాబోయ్, ఆ పిటిషన్ విచారించి, తన కోరికను మన్నించవద్దు మహాప్రభో అని ఈడీ కోర్టుకు మొరపెట్టుకుంది… ఎందుకు..? అసలు ఎవరీ సుఖేష్..? ఏమిటీ కథ..?
బెంగుళూరులో పుట్టిన సుఖేశ్‌కు చిన్నప్పటి నుంచే ‘లైఫ్’ మీద చాలా క్లారిటీ ఉంది… 17 ఏళ్ల నుంచే మోసాలు స్టార్ట్ చేశాడు… ఏవో దొంగ పరిచయాలు నమ్మబలకడం, మోసగించడం, డబ్బులు వసూలు చేయడం… రోజురోజుకూ ముదిరిపోయాడు… తన మాటల చాతుర్యానికి పెద్ద పెద్ద తోపులం అనే భ్రమల్లో ఉండే సెలబ్రిటీలు కూడా ఢామ్మని పడిపోయేవారు… అడిగినన్ని డబ్బు ఇచ్చేవాళ్లు… మాంచి లావిష్‌గా బతకడం, కొత్త బకరాలను చూసుకోవడం సుఖేశ్ అలవాటు…
ఓ చిన్న ఉదాహరణ చెబితే… ఈ సుఖేశ్ ఎంత పెద్ద ముదురు కేసో అర్థమవుతుంది… తీహార్ జైలు నుంచే కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లాలాగా మాట్లాడి రాన్‌బాక్సీ ప్రమోటర్ మోహన్ భార్య అదితి సింగ్ నుంచి ఏకంగా 215 కోట్లు వసూలు చేశాడు… దటీజ్ సుఖేశ్… మన వ్యవస్థ ఏం చేయగలిగింది..? ఏమీ లేదు, ఏమీ చేయలేదు… వ్యవస్థ డొల్లతనం గురించి సుఖేశ్‌కు మించి చెప్పగలిగేవాడు ఈ దేశంలోనే లేడు… ఎలాగంటే..?
Ads
తన మీద బోలెడు కేసులున్నయ్… జైలుకు వెళ్తే బెయిళ్లు… ఓసారి ఇంటరమ్ బెయిల్ మీద వచ్చి సేమ్, కోట్లు కొల్లగొట్టాడు… మళ్లీ కేసు… ఈసారి ఈడీ ఎంటరైంది… తీహార్ జైలుకు పంపించారు… తను అక్కడ ఓ ఆఫీసే ఓపెన్ చేసేశాడు… మన దేశంలోని జైళ్ల అధికారుల సంగతి తెలుసు కదా… సుఖేశ్ విసిరే బిస్కెట్లతో తను చెప్పినట్టల్లా ఆడేవాళ్లు… అక్కడి నుంచే తన వ్యవహారాలను యధావిధిగా సాగించేవాడు… తను ఏదంటే అదే… తనను కలవడానికి వచ్చే సినిమా తారలు, పెద్ద పెద్ద హైప్రొఫైల్ వ్యక్తుల కోసం జైలు బయట బీఎండబ్ల్యూ కారు మెయింటెయిన్ చేసేవాడు తను… అదీ సుఖేశ్ అంటే..!!
పెద్ద పెద్ద సెలబ్రిటీలు, సినిమా యాక్టర్లు చాలామంది బకరాలు తనకు… కొన్నిసార్లు సరదాగా చిన్న చిన్న టోపీలు కూడా పెట్టేస్తాడు… కేరళలో ఫేమస్ ఇమాన్యుయెల్ సిల్క్స్ అధినేతకు చెప్పాడు… అరె బాస్, కత్రినా కైఫ్ నేను చెప్పినట్టు వింటుంది అని… కొట్టాయంలో షోరూం ఓపెనింగుకు తీసుకొస్తాను అని అడ్వాన్సుగా 20 లక్షలు తీసుకున్నాడు… తీరా టైమ్‌కు అల్లు అర్జున్‌కు… నిజమే, మన బన్నీని తీసుకుపోయాడు… మరి బన్నీకి సదరు సుఖేశ్‌కు ఏం లింక్ అంటారా..? తెలియదు..! (ఈ ఉదంతాన్ని అప్పట్లో ఇండియన్ ఎక్స్‌ప్రెస్ రిపోర్ట్ చేసింది…)
తీహార్ జైలు నుంచే తన వ్యవహారాలు నడిపిస్తున్న సుకేశ్ ఉదంతాన్ని ఈడీ సీరియస్‌గా తీసుకోవడంతో జైలు అధికారులు తప్పనిసరై కాస్త టైట్ చేశారు… ఇక ఇప్పుడు తనకు ప్రాణహాని ఉందని, జైలు మార్చాలని సుకేశ్ డిమాండ్… ఇదీ వార్త… ఇంకేదో జైలుకు వెళ్తే అక్కడా ఓ ఆఫీసు ఓపెన్ చేస్తాడు… అక్కడి నుంచి దందా నడుస్తుంది అన్నమాట… తన మీద 15 కేసులున్నయ్… ఓసారి సముద్రముఖంగా ఉండే ఓ లగ్జరీ విల్లాను సీజ్ చేసింది ఈడీ… సీజ్ సమయంలో తనవి ఒక డజను లగ్జరీ కార్లున్నాయి అక్కడ…
భార్య లీనా మరియా… సుఖేశ్‌కు తగినట్టే ఆమె కూడా ముదురే… ఆమధ్య సినిమా తార జాక్వెలిన్‌తో సుఖేశ్ (ఆహా, సార్థక నామధేయుడు) వ్యవహారాలపై బోలెడు కథనాలు, ఫోటోలు వచ్చాయి… బాలీవుడ్ యాక్టర్ కమ్ డాన్సర్ నోరా ఫతేను కూడా ఈడీ సుఖేశ్ యవ్వారాలపై ప్రశ్నించింది… తవ్వేకొద్దీ బోలెడు మంది సినిమా, టీవీ తారలు, పెద్ద పెద్ద బిజినెస్‌మెన్… జస్ట్, మాటలకు అలా బోల్తాపడతారా అని ఆశ్చర్యం కలిగేంత..! వీడు చార్లెస్ శోభరాజ్‌కు తాత…. ఎంతోకాదు, ఇప్పటికి తన వయస్సు కేవలం 36… ఇంకెన్ని చేయాల్సి ఉందో… దేశం అదృష్టం ఏమిటంటే… తను రాజకీయాల్లోకి ఎంటర్ కాకపోవడం..! ఏమో, చెప్పలేం అంటారా..? అవును… ఈ దేశ రాజకీయాలకు కరెక్ట్ సూటబుల్ ఫెలో…! పీకేలు, బీకేలు ఈకమందం కాదు, తోకమందం కాదు…!!
Share this Article