మొన్న మనం రావణ పరిచారిక… త్రిజట గుడి గురించి చెప్పుకున్నాం కదా… చాలామంది ఈ తరం యువతకు ఓ డౌటొచ్చింది… రాక్షస జాతికి చెందిన వేరే పురాణ పాత్రలకూ గుళ్లున్నాయా..? ఇలా అనగానే గుర్తొచ్చేది హిడింబి గుడి… అదే ఎందుకు గుర్తురావాలి..? హిడింబి గుడి ఉన్నది మనాలిలో… చాలామంది టూరిస్టులు మనాలి వెళ్తుంటారు కదా, హిడింబి గుడి కూడా వెళ్లొస్తుంటారు… కానీ హిడింబి మన మనిషి, పూజించాల్సిన దేవత ఎలా అయ్యింది..?
మహాభారతంలో ఓ అంతుచిక్కని మార్మిక పాత్ర హిడింబి… తన కళ్ల ముందే తను బాగా అభిమానించే అన్నను చంపిన భీముడిని అక్కడిక్కడే, అప్పటికప్పుడే ప్రేమించేస్తుంది… కొంతకాలం ఇదే అడవిలో ఉంటేనే, హిడింబి సైన్యంతో రక్షణ ఉంటుంది, కౌరవులు ఇటువైపు అస్సలు రాలేరు అనుకున్న కుంతీదేవి లౌక్యంగా ఆ ప్రేమకు ఆమోదం చెప్పి, స్వయంగా పెళ్లిచేస్తుంది… సమాజానికి భిన్నంగా పోవడం కుంతీదేవికి అలవాటే కదా… అలా హిడింబి రాజ్యంలో తలదాచుకుంటారు పాండవులు…
తరువాత హిడింబిని వదిలేసి, కుంతీ తన కొడుకులతో సహా వెళ్లిపోతుంది… హిడింబి అభ్యంతరపెట్టదు… అప్పటికే గర్భిణి… మళ్లీ ఎప్పుడూ భీముడి ఆచూకీ కోసం కూడా ప్రయత్నించదు… భీముడి మీద ఎంత ప్రేమ అంటే, తను ఆ రాజ్యానికి రాణి కాబట్టి, ఇంకా సంతానం కావాలి బట్టి వేరే మగవాళ్ల తోడుతో వేరే పిల్లల్ని కంటుంది తప్ప పెళ్లి మాత్రం ఇంకెవరినీ చేసుకోదు… అందుకే ఆ పాత్ర అంటే హైందవ సమాజానికి జాలి, ఇష్టం…
Ads
తరువాత ఘటోత్కచుడి సాయం కోసం భీముడు మళ్లీ ఆ అడవికి వస్తాడు… అప్పుడూ హిడింబి కోపంగా, ప్రేమగా, ఆర్తిగా కాసేపు కొట్టి, గుద్ది… తరువాత మళ్లీ నన్ను విడిచిపోకోయ్ అన్నంతగా హత్తుకుపోతుంది… అంతేతప్ప తన ప్రియసఖుడికి వ్యతిరేకంగా వ్యవహరించదు… ఘటోత్కచుడిని యుద్ధరంగానికి పంపించడానికి కూడా సమ్మతిస్తుంది… తను పాండవుల పక్షాన పోరాడి, చివరకు హతమారిపోతాడు… ఘటోత్కచుడి కొడుకుల్నీ యుద్ధానికి పంపిస్తుంది… జరిగిన నష్టానికి హిడింబి పాండవులను నిందించదు… బతికిన మనమడు మేఘవర్ణుడిని ఘటోత్కచుడి స్థానంలో రాజును చేస్తుంది… హస్తిన అధికారం కోసం అర్రులు చాచలేదు…
ఈ కారణాలకు తోడు ఆమె ఆర్యుడిని పెళ్లిచేసుకోవడంతో ఇంటి కోడలు అయిపోయింది… అందుకే ఆమె హైందవులకు ప్రీతిపాత్రమైంది… హిందువులు ఎవరికైనా గుడి కట్టేయగలరు… హిడింబికీ కట్టేశారు… మరి మనాలిలోనే ఆ గుడి ఎందుకుంది..? కురుక్షేత్రం తరువాత మేఘవర్ణుడికి రాజ్యం అప్పగించి, మనాలీలోనే తపస్సు చేసుకుంటూ గడిపిందని స్థలపురాణం… గుడి సాదాసీదా ఉంటుంది… చెక్కలతో కట్టారు… మనాలీ నుంచి కాలినడకన వెళ్లిరావచ్చు… ఈ గుడి నుంచి 70 మీటర్ల దూరంలో ఘటోత్కచుడికీ ఓ చిన్న గుడి ఉందట… దాని వివరాలు పెద్దగా తెలియవు…
ఇక్కడ డూన్గరి మేళా అత్యంత వైభవోపేతంగా జరుగుతుంది… ఈ మేళాలో అక్కడి ఆడ పిల్లలు సంప్రదాయ దుస్తుల్లో తయారై, హిడింబి దేవి అనుగ్రహం కోసం నృత్యం చేస్తారు. వసంత ఋతువులో జరిగే ఉత్సవం కావటం వల్ల భక్తులు అధిక సంఖ్యలో ఇక్కడికి వచ్చి హిడింబి దేవిని పూజిస్తారు… హిందువులు ఎవరినైనా తమలో కలిపేసుకోగలరు… అది మతాన్ని పరిపుష్టం చేసింది… అదేసమయంలో అది బలహీనతగా మారింది కూడా…!!
Share this Article