ఈ ఫోటో చూడగానే చటుక్కున ఎవరు స్ఫురిస్తారు..? అల్లూరి సీతారామరాజు..! అవును, అలాగే ఉన్నాడు… కథ కూడా అల్లూరి కథే… కాకపోతే అల్లూరికి చాలాముందు కథ ఇది… అల్లూరి వంటి సాయుధ స్వాతంత్ర్య పోరాటవీరులకు తొలి స్పూర్తిదాత ఫోటో ఇది… తన పేరు వాసుదేవ్ బల్వంత్ ఫడ్కే… మనకు చిన్నప్పటి నుంచీ ఇండిపెండెన్స్ వారియర్స్ అనగానే గాంధీ, నెహ్రూ, పటేల్ వంటి కొందరి పేర్లనే పదే పదే నూరిపోశారు… కానీ వాళ్లకు ఎన్నో ఏళ్ల ముందే స్వాతంత్ర్య కాంక్షలకు, పోరాటాలకు, త్యాగాలకు బీజాలు పడి ఉన్నయ్… వాటికి ఈ గాంధీలు, ఈ నెహ్రూలు కేవలం కొనసాగింపులు మాత్రమే…
ఫడ్కే కథను కూడా అలాగే చూడాలి… చరిత్ర ఇసుక పొరల కింద మరుగునపడిపోయిన ఆ త్యాగం ఓసారి స్మరించుకోవాలి… భారతదేశ తొలి సాయుధ తిరుగుబాటుకు నాయకుడి కథే ఈ ఫడ్కే కథ… పుట్టింది 1845లో… మహారాష్ట్ర, రాయగఢ్ జిల్లాలోని షిర్దోన్… చిన్నప్పటి నుంచే చురుకు… దూకుడు ఎక్కువ… అడవుల్లో పడి, గుట్టల్లో పడి తిరిగేవాడు… పడుతూ లేస్తూ తన చదువును కల్యాణ్, పూణెల్లో సాగించాడు… తండ్రి తనను ఓ వ్యాపారి దుకాణంలో నెలకు పదిరూపాయల జీతంతో కూర్చోబెట్టాడు… ఈ కొలువు ఎవడు చేస్తాడు అనుకున్న ఫడ్కే ముంబైకి వెళ్లిపోయాడు…
ఎలాగోలా పూణెలోని మిలిటరీ అకౌంట్స్ విభాగంలో చేరాడు… 15 ఏళ్లు చేశాడు… ఆ సమయంలోనే ఫడ్కే మహదేవ్ గోవింద్ రనడే వంటి స్వాతంత్ర్య సమరయోధులతో మాట్లాడుతూ ఉండేవాడు… నేనూ ఈ బ్రిటిషర్ల మీద పోరాడతాను అని మనసులో పదే పదే సంకల్పం చెప్పుకునేవాడు… ఆ సమయం రానేవచ్చింది…
Ads
1871… ఓ సాయంత్రం తనకు టెలిగ్రామ్ వచ్చింది… ‘‘వాసూ, త్వరగా ఇంటికి రా, లేకపోతే అమ్మను మళ్లీ చూడలేకపోవచ్చు’’… అదీ టెలిగ్రామ్… తన బ్రిటిష్ అధికారి వద్దకు వెళ్లి సెలవు అడిగాడు… భారతీయులంటే చులకనభావం ఉండి, పదే పదే అవమానించే అలవాటున్న సదరు అధికారి ఫోఫో, సెలవు లేదుఫో అని కసిరాడు… దాంతో ఫడ్కే ఆ కొలువుకు అక్కడే నమస్కారం పెట్టి, ఇంటికి బయల్దేరాడు… తీరా తను వెళ్లడానికి ముందే అమ్మ కన్నుమూసింది… ఫడ్కే మనసు గాయపడింది… ఇక తను ఎన్నాళ్లుగానో సంకల్పించిన సాయుధపోరాటం వైపు మనస్సు మళ్లింది…
కానీ ఎవరూ పెద్దగా సహకరించేవాళ్లు కాదు… తోడుగా వచ్చేవాళ్లు కాదు… బ్రిటిషర్లంటే భయం… అక్కడక్కడా స్వాతంత్య్రం కోసం ఆందోళనలు చేసే మనుషులున్నారు… కానీ ఆర్గనైజ్ చేసేవాళ్లు లేరు… ఒక్కొక్కరినీ కూడగట్టసాగాడు… మహారాష్ట్ర అంతటా తిరిగాడు… ప్రత్యేకించి కోలి, భిల్, దంగడ్ వంటి గిరిజన తెగలను ఉత్తేజపరుస్తూ రామోషి సంస్థను స్థాపించాడు… కానీ ఆయుధాలకు, గ్రూపు నిర్వహణకు డబ్బు కావాలి కదా… అందుకని బ్రిటిష్ వడ్డీ వ్యాపారులు, పెద్ద అధికారులను దోచుకునేవాడు… ఈ సైన్యం ప్రభావం మహారాష్ట్రలోని ఏడు జిల్లాలకు విస్తరించింది…
1879… పలువురు ఉన్నతాధికారులు, వ్యాపారులు రహస్యంగా ఓచోట సమావేశమై ఫడ్కేను అంతం చేసే ప్రణాళికలు చర్చిస్తున్నారు… అక్కడికి చేరిన ఫడ్కే వాళ్లను చంపి, ఆ భవనానికి నిప్పుపెట్టాడు… తరువాత బ్రిటిష్ ప్రభుత్వం ఫడ్కే తల మీద ఏకంగా 50 వేల బహుమతిని ప్రకటించింది… ఆ పోస్టర్లు వేయించిన రిచర్డ్ ఫోటోలతో ఫడ్కే కూడా ముంబై గోడల మీద పోస్టర్లు వేయించాడు… రిచర్డ్ తల నరికి తెస్తే నేను 75 వేల బహుమతి ఇస్తానని ప్రకటించాడు… అదీ ఫడ్కే అంటే…
అనేకసార్లు బ్రిటిష్ సైన్యం, ఫడ్కే సైన్యానికీ నడుమ ఎదురుకాల్పులు జరిగేవి… బ్రిటిషర్లు తెలివిగా వెనక్కి తగ్గేవాళ్లు… ఫడ్కే వద్ద మందుగుండు ఖర్చయిపోతూ ఉండేది… ఈ స్థితిలో కొన్నాళ్లు ప్రశాంతంగా ఉండి, కావల్సినంత మందుగుండు సమీకరించుకోవాలని ఫడ్కే అనుకున్నాడు… పూణె దగ్గరలోని గిరిజన ప్రాంతాల్లో తలదాచుకున్నాడు… 1879… ఫడ్కే కాస్త అనారోగ్యంతో ఓ గుడిలో పడుకున్నాడు… ఎవరో ఇన్‌ఫార్మర్ ఉప్పందించాడు… ఇంకేముంది బ్రిటిషర్లు వచ్చి చుట్టుముట్టారు… నిర్బంధించారు…
ఉరిశిక్ష విధించారు… కానీ ప్రముఖ న్యాయవాది మహదేవ్ ఆప్టే తనకు అనుకూలంగా వాదించాడు… దాంతో మరణశిక్షను కాస్తా కాలాపానీగా మార్చారు… అండమాన్‌కు పంపించారు… 1883 ఫిబ్రవరి… అక్కడే మరింత అనారోగ్యానికి గురై కన్నుమూశాడు ఫడ్కే… 1984లో తన పేరిట ఓ స్టాంపు విడుదల… దక్షిణ ముంబైలో ఓ విగ్రహం పెట్టారు… ఇదీ ఫడ్కే కథ… ఎందరికి తెలుసు..? తను చిరస్మరణీయుడు కాదా..?!
Share this Article