కొడుక్కి పాలిస్తూ… కళ్లల్లో నీళ్లు తుడచుకుంటూ… రెండేళ్లు అసలు నేను గది దాటి బయటికి రాలేదు….. ఈ మాటలు అన్నది ఎవరో కాదు… రీనా ద్వివేది… ఫోటో చూడగానే ఆమె ఎవరో గుర్తుపట్టే ఉంటారు కదా… పోలింగ్ సామగ్రి తీసుకెళ్తున్న ఆమె ఫోటో దేశవ్యాప్తంగా వైరల్ రెండు సందర్భాల్లో… ఒకసారి 2019 జనరల్ ఎలక్షన్స్‌లో… మరోసారి 2022 అసెంబ్లీ ఎన్నికల్లో…
ఆమె మీద ఎన్ని చెణుకులు, జోకులు, మీమ్స్, వ్యాఖ్యలు, హాట్ పోస్టులు… మొదటి ఎర్ర చీరెలో కనిపించిన ఆమె ఫోటో ఓ ఊపు ఊపింది సోషల్ మీడియాను… మళ్లీ ఇప్పుడు స్టార్టయ్యాయి… ఇప్పుడెక్కడ ఆమె డ్యూటీ పడింది అంటూ… 100 శాతం పోలింగ్ కంపల్సరీ అంటూ… ఇలాంటి సహోద్యోగి కావాలంటూ, ఇలాంటి ఆఫీసర్ కావాలంటూ… ఆమె పేరు ముందే చెప్పుకున్నాం కదా… ఈసారి ఎక్కడ డ్యూటీ పడిందో ఇంకా మీడియా ఫోకస్ చేయలేదు… ఆమే దూరంగా ఉందో, ఇంకా పోలింగ్ తేదీ రాలేదో తెలియదు…
ఆమె ఈ ఫ్యాషన్ లుక్కు, అందమైన డ్రెసింగు వెనుక కూడా ఓ విషాదం ఉంది… బతుకు వ్యథ ఉంది… ఆమె పుట్టింది యూపీలోని గోరఖ్‌పూర్ ప్రాంతంలోని డియోరియా…
Ads
‘‘మాది మధ్యతరగతి కుటుంబం, గోరఖ్‌పూర్‌లోనే చదువుకున్నాను, నాన్న పోలీస్ శాఖ, అమ్మ గృహిణి… ఇద్దరు బ్రదర్స్, ఒకరికి బ్యాంకులో పని, మరొకరు మెడికల్ ఫీల్డ్… ఒక అక్క టీచర్… మరొకరు గృహిణి… అందరిలో చిన్నదాన్ని కాబట్టి అందరికీ నామీద ప్రేమ… కాలేజీ అయిపోయాక అప్పట్లో ఏదో కంప్యూటర్ కోర్స్ చేశాను, మారుతి సుజుకిలో బీమా మేనేజర్‌గా కూడా చేశాను కొన్నాళ్లు…
2004… పెళ్లయింది… భర్త పేరు సంజయ్ ద్వివేది… 2013లో ఏదో మాయదారి జబ్బుతో నన్ను విడిచి వెళ్లిపోయాడు… ఒక్కసారిగా నాచుట్టూ ఓ చీకటి… ఏడేళ్ల కొడుకు… రెండేళ్లు డిప్రెషన్‌లోనే ఉండిపోయాను… ఎగురుతూ, తుళ్లుతూ, నవ్వుతూ, ఆనందంగా గడిపే నేను ఒక్కసారి శోకంలోకి నెట్టేయబడ్డాను…
గది దాటి బయటికి వచ్చేదాన్ని కాదు… కొడుకును చూసుకుని, ధైర్యం కూడదీసుకున్నాను, కుటుంబంతోపాటు యోగా నన్ను మామూలు మనిషిని చేసింది… పాత రీనా అయ్యాను… నా భర్త మరణంతో అదే పబ్లిక్ వర్క్స్ శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా కారుణ్య నియామకం కింద కొలువు ఇచ్చారు… అదీ నా కథ… ఇప్పుడు నేను సీనియర్ అసిస్టెంటును…
చాలా ఇష్యూస్ వచ్చాయి జీవితంలోకి… ఇక ఏడుస్తూ కాదు, నవ్వుతూ, ధైర్యంగా ఫేస్ చేశాను… తేలికగా వదిలే మనిషిని కాను… అవును, 2019లో ఆ పసుపు చీరెలో నా ఫోటో వైరల్ అయ్యింది… బాధేమీ లేదు, ఆనందించాను… తరువాత 2022లో అసెంబ్లీ ఎన్నికలప్పుడు ప్యాంటు, నలుపు షర్టులో కనిపించాను, మళ్లీ ఫోటోలు వైరల్… ఎవరో విలేకరి అడిగాడు, ఏమిటీ మార్పు చీరె నుంచి ప్యాంటు షర్టులోకి అని…
‘తప్పలేదు, కొంత మారాలి కదా’ అన్నాను అంతే… నాకు అందంగా డ్రెసప్ కావడం అంటే ఇష్టం… ఫిజిక్, ఆరోగ్యం కాపాడుకోవడం ఇష్టం… టీవీ సీరియళ్లు, భోజ్‌పురి సినిమాల్లో అవకాశాలు వచ్చాయి… వాటంతటవే… కానీ నాకు నా చిన్న ప్రపంచం చాలు, నేను- నా కొడుకు… వాడిని చూసుకోవాలి…
టిక్‌టాక్, ఇన్‌స్టా వీడియోలు, ఫోటోలు, డ్రెస్సులు… అవును, నేను సోషల్ మీడియాలో యాక్టివే… https://www.instagram.com/dwivedi_reena1987/?utm_source=ig_embed&ig_rid=1f8f0f18-cbb8-4e0a-bf73-aab9e0f4ae47
ఏడుస్తూ బతకడం నాకిష్టం ఉండదు… పొద్దున్నే లేచి యోగా చేస్తాను, తరువాత పూజ, ఆ తరువాత ఆఫీసు… తిరిగి వచ్చాక వీడియోలు చేస్తాను, పోస్ట్ చేస్తాను, నా కొడుకు చదువుసంధ్య చూసుకుంటాను… ఇన్‌స్టా క్వీన్ అనీ, లేడీ సింగం అనీ పేర్లు పెట్టారు… నో రిగ్రెట్స్, అభినందనలుగా స్వీకరిస్తాను… బిగ్‌బాస్ ఆఫర్‌నూ నా చిన్న ఆనంద ప్రపంచం కోసమే వద్దన్నాను…’’
ఇదంతా 2022లో దైనిక్ భాస్కర్‌కు ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూ… చదువుతాను, నా ఫోటోల కింద ప్రతి కామెంట్ చదువుతాను, పాజిటివ్ ఉంటే హేపీ, లేదంటే సింపుల్‌గా డిలిట్ చేస్తాను… నేను ఎక్కడ పనిచేస్తున్నా, ఎక్కడ బతుకుతున్నా సరే చాలామంది ఫ్రెండ్స్ అవుతారు… మహిళ అనగానే జీవితమంతా కష్టాలు, కన్నీళ్లేనా..? వీలైన ప్రతి అంశంలోనూ ఆనందాన్ని వెతుక్కోవాలని చెబుతాను నా ఫ్రెండ్స్‌కు, అదే నా ధోరణి, మారను అని చెప్పుకొచ్చింది… ఆమె ఫోటోల కింద నెగెటివ్, బూతు కామెంట్లు పెట్టే ప్రతి ఒక్కరూ చదవాల్సిన కథ ఇది… డ్రెస్సింగును బట్టి జడ్జ్ చేయడం మూర్ఖత్వం కాబట్టి..!!
Share this Article