చాలామందికి ఉప్మా అంటే ఓ దురభిప్రాయం… అసలు అదీ ఓ ఆహారమేనా..? వంటేనా..? అని ఈసడించుకుంటారు… కానీ పెళ్లిళ్లయినా, ఫంక్షన్లయినా, సమయానికి వేరే వంట వండటానికి ఓపిక లేకపోయినా… చకచకా కొందరి కడుపులు నింపడానికి ఉప్మాయే బెస్టు… కడుపులకు నష్టం కలగజేయదు కూడా… సరే, దాన్ని కూడా రకరకాలుగా వండుకుని ఇష్టపడేవారు కూడా ఉంటారు… ఆ ఉప్మాయణం వదిలేస్తే అది టిఫిన్ మాత్రమే…
అంచుకు ఏమున్నా, (నంజుకు), ఏమీ లేకపోయినా జస్ట్, ఉప్మాను అలాగే ‘రా’ సరుకు లాగించొచ్చు… కానీ ఎంత తిన్నా సరే, కడుపు నిండినట్టుండదు… మెయిన్ కోర్స్, అంటే ఏదో ఒక బియ్యం ఐటం కడుపులో పడాల్సిందే… చివరకు కాసింత పెరుగన్నమైనా సరే… ఏమీ లేకపోతే కాస్త అన్నం, పచ్చిపులుసు అయినా సరే… అన్నిరకాల పోషక విలువలూ ఉండి, అందుబాటులోని కూరగాయలు వేసుకుని, మసాలాలు దట్టించి చేసుకునే టేస్టీ బిర్యానీలో, ఫ్రైడ్ రైసో వేరు… దానికి టైం, ఓపిక గట్రా కావాలి…
అవేవీ లేకుండా సింపుల్‌గా అందరూ చేసుకోగలిగే రైస్ ఐటమ్ ఏది..? ఇప్పుడంటే హాస్టళ్లు, క్యాంటీన్లు, కరీ పాయింట్లు గట్రా ఉన్నయ్… కానీ రెండుమూడు దశాబ్దాల క్రితం వరకూ చదువుకునే విద్యార్థులకు సొంత వంటే దిక్కు కదా… కిరోసిన్ స్టవ్వులు, నాలుగు గిన్నెలు… ప్రత్యేకంగా కూరో నారో చేసుకునే ఓపిక లేకపోతే ఆదుకునే వంట పేరు పబ్బియ్యం… దాన్నే పోనుబియ్యం అంటాం…
Ads
సింపుల్‌గా కిచిడీ అనండి… ఆధరువుగా ఏ రైతా లేకపోయినా, చివరకు ఓ ఊరగాయ ముక్క లేకపోయినా ‘రా’ సరుకే గబగబా కడుపులోకి ట్రాన్స్‌ఫర్ చేసి బ్రేవ్‌మనొచ్చు… వీలయితే కొందరు అందులోనే రెండు గుడ్లు వేసి, ఎగ్ పబ్బియ్యం చేసేస్తారు… అది వేరే కథ… సరే, ఇప్పటికీ కడుపు చేత్తో పట్టుకుని దేశదేశాలు వెళ్లినవాళ్లకు… పబ్బియ్యం బెటర్ డిష్…
మీకు యూట్యూబులో తక్కువ వీడియోలు కనిపిస్తాయి… కనిపించిన వాటిల్లో కూడా అవి వేయండి, ఇవి వేయండి, అంటూ పెండాబెల్లం కలిపేసి, మన కడుపుల మీద పగసాధిస్తాయి… సమయానికి ఇంట్లో ఏమీ లేకపోతే… బియ్యం, శెనిగె పప్పు, పచ్చి మిర్చి, ఉప్పు… నిజానికి ఇవి చాలు… ఆకలితో అలమటించే ఆత్మారాముడికి పెద్ద రిలీఫ్… ఉల్లిపాయలు, అల్లంవెల్లుల్లి, కేరట్, బీన్స్, ఆలూ ఉంటే కాస్త మేలు… కొన్ని వీడియోల్లో కొత్తిమీర వేయండి, కరివేపాకు వేయండి, పుదీనా వేయండి, టమాటాలు కట్ చేసి వేసేయండి అని చెబుతుంటారు… దాల్చినచెక్క, లవంగాలు, ఇంగువ కూడా వేయమంటారు… అవేవీ వద్దు… అసలు పబ్బియ్యానికి అవి సూట్ కావు…
ఇప్పుడు కుక్కర్లు వచ్చాయి కాబట్టి ఇంకా ఈజీ… కాస్త నూనె వేసి (పోసి కాదు…) మిర్చిని కట్ చేసి వేయండి… కాస్త వేగాక మీకు అవసరమున్నంత బియ్యం, దానికి పావుసగం పరిమాణంలో శెనిగెపప్పు వేయండి… ఆ నూనె కాస్త బియ్యం మొత్తానికి అంటితే చాలు, పబ్బియ్యం ముద్ద గాకుండా ఉంటుంది… ఒకటికి రెండు నీళ్లు కలపండి… సరిపడా ఉప్పు కలిపి, మూడు విజిళ్లు రాగానే దింపి, ఆవిరి పోయాక, మూత ఓపెన్ చేసి, ఓసారి మొత్తం పెద్ద చెంచాతో కలిపేయండి…
ఒకవేళ సమయానికి అవకాశముంటే… నాలుగు బీన్స్ ముక్కలు, ఆలుగడ్డ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కేరట్ ముక్కలు వేసుకోగలిగితే…. మొదట్లోనే కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్, కాస్త పసుపు వేస్తే చాలు… రుచికి రుచి… తెలంగాణలో చాలాచోట్ల పల్లీలు కూడా వేస్తారు… అసలు పల్లీలు లేని పబ్బియ్యం ఏమిటబ్బా అంటుంటారు… వంట కుదిరితే వేడివేడిగా గబగబా కడుపులోకి జారిపోతుంది… దీనికి ఊరగాయ అంచుకు ఉంటే చాలు… ఏరకం ఊరగాయైనా సరే, ఈ పబ్బియ్యానికి భలే దోస్త్… పబ్బియ్యం అంటే పప్పు ప్లస్ బియ్యం… అంతే… సో, జాగ్రత్త… కడుపు మీద ఎడాపెడా ప్రయోగాలు చేయకండి, అసలే రోజులు బాగాలేవు… ఈ పబ్బియ్యం చాలా సేఫ్ డిష్…
Share this Article