నిన్న ఆంధ్రజ్యోతిలో బ్యానర్ స్టోరీ… ప్రధాన సారాంశం ఏమిటంటే… నన్ను అక్రమంగా జైలుపాలు చేశారు, నేను నీతిమంతుడిని, ఈ వయస్సులో నన్ను మానసిక క్షోభకు గురిచేస్తున్నారు, ఇన్నేళ్లు ప్రజాసేవ చేస్తే ఇదా ప్రతిఫలం… ఇదీ తన ఆవేదన… నన్ను ఉంచిన స్నేహ బ్యారక్‌లో ఏసీ లేదు, ప్రత్యేకంగా బెడ్స్ లేవు, దోమలు కుడుతున్నాయి, భద్రత లేదు వంటి శుష్క వాదనల్ని చంద్రబాబు చేయడం లేదు కాబట్టి వాటిని ఇక్కడ పరిగణనలోకి తీసుకోవడం లేదు…
మరీ టీవీ5 సాంబశివుడిలా, మహాన్యూస్ వంశీలా ఏదిపడితే అది మాట్లాడటం లేదు… కానీ ఇన్నేళ్ల ప్రజాసేవ, నా వయస్సు, అక్రమ అరెస్టు అనే మాటల దగ్గరే అభ్యంతరం… రాజకీయాలు క్రూరంగానే ఉంటాయి బాబు గారూ… ఐనా మీకు తెలియనిది ఏముంది..? ఇన్నేళ్లు దేశసేవ చేశాను అని మీఅంతట మీరే గొప్ప క్రెడిట్స్ ఇచ్చేసుకుంటే కేసుల నుంచి, అవినీతి ఆరోపణల నుంచి ఇమ్యూనిటీ వస్తుందా..? మన చట్టాల్లో ఆ మినహాయింపులు ఉన్నాయా..? అరెస్టు చేయకుండా రక్షణ లభిస్తుందా..? ఐనా మిమ్మల్ని నేరస్థుడు అనడం లేదుగా, నిందితుడు అనే అంటున్నారు…
ఇక వయస్సు అనే దగ్గర ఆగుదాం… వయస్సును బట్టి ఇమ్యూనిటీ ఏమీ ఉండదు కదా మన చట్టాల్లో… ఆరోపణల తీవ్రత ఎంత..? ఏ సెక్షన్లు వర్తిస్తాయి అని మాత్రమే చూడబడతాయి… చివరకు నిందితుడి రోగాన్ని కూడా చూడవు చట్టాలు… కాకపోతే జుడిషియల్ కస్టడీ కాబట్టి చికిత్సకై హాస్పిటల్‌కు పంపిస్తారు… అంతే… ఒకదానిపై ఒకటి కేసులు, క్వాష్ పిటిషన్లు పట్టించుకోని కోర్టులు, బెయిల్ పిటిషన్లలోనూ భంగపాటే, కస్టడీకి కూడా ఇచ్చారు… అనగా తను ఒకప్పుడు తన మాటే శాసనంగా భావించిన సీఐడీ అధికారులు కాసేపు ప్రశ్నలతో ఆడుకుంటారన్నమాట…
Ads
సరే, ఇవన్నీ పక్కన పెడితే… వయస్సు అని వార్తలో ఉన్న పదం దగ్గర మౌజ్ ఆగిపోయింది… కొన్నాళ్ల క్రితం పబ్లిషయిన ఓ వార్త గుర్తొచ్చింది… వెతికితే దొరికింది… జస్ట్, ఆ వార్తను ఓసారి చదువుదాం… సబ్జెక్టు ఇంటరెస్ట్ కొద్దీ…
87 ఏళ్ల వయస్సు… తీహార్‌లోని వివిధ బ్యారెక్స్‌లో ఉన్న 19,584 మంది ఖైదీలలో ఓం ప్రకాష్ చౌతాలా అత్యంత పెద్దవాడు… (ఈయన తెలుసు కదా… ఒకప్పుడు ఉపప్రధానిగా చేసిన బలమైన నాయకుడు దేవీలాల్ కొడుకు… తన కొడుకులు కూడా రాజకీయాల్లో పలు పోస్టుల్లో పనిచేశారు, మనమడు వేరే పార్టీ పెట్టుకుని, అధికారంలో భాగస్వామిగా మారి, ఉపముఖ్యమంత్రి అయ్యాడు హర్యానాకు… అంటే ఆ కుటుంబం ఎంత పలుకుబడి కలిగినదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు…)
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ప్రత్యేక సీబీఐ కోర్టు ద్వారా దోషిగా నిర్ధారించబడ్డాడు… నాలుగు సంవత్సరాల జైలు శిక్ష విధించబడింది… అంతేకాదు, 50 లక్షల జరిమానా కూడా వేశారు… ఇది 2022 నాటి వార్తే… మరీ పాతది కాదు… చౌతాలా దోషిగా జైలుకు తీసుకెళ్లబడ్డాడు… ప్రత్యేక సదుపాయాలు ఏమీ లేవు… మరో ఇద్దరు ఖైదీలతోపాటు ఒకే సెల్‌లో ఉంచుతారు… జైలు రికార్డుల ప్రకారం 80 ఏళ్లు పైబడిన ఏడుగురు ఖైదీల్లో చౌతాలా కూడా ఒకరు…
70 నుంచి 80 ఏళ్లు పైబడిన వారు 63 మంది ఉన్నారు… ఎవరికీ ఏసీలు లేవు, అందరినీ దోమలు కుడతాయి… ఎవరికీ ప్రత్యేక భద్రత లేదు… చౌతాలాకు శిక్ష పడటానికి ముందు ఆ జైలులో 85 ఏళ్ల ఓ ముసలాయన ఉండేవాడు… అందరికన్నా వయస్సులో పెద్ద… సో, వయస్సుకూ జైలుశిక్షకూ లింక్ లేదు… ఉండదు… కాకపోతే ముసలితనం, అనారోగ్యం కారణంగా చౌతాలాకు పెద్దగా పనులు అప్పగించరు… బెడ్స్‌కు కూడా అనుమతిస్తారు… కింద పడుకోవడం కష్టం కాబట్టి… ఆ బెడ్స్ కూడా ఆ జైలు ఫ్యాక్టరీలో తయారైనవే… చౌతాలాకే కాదు, అలాంటి ఖైదీలందరికీ అదే సదుపాయం… వృద్ధులు కదా, కాస్త కనిపెట్టుకుని ఉండే బాధ్యతను తోటి సత్ప్రవర్తన ఖైదీని అటాచ్ చేసే సౌకర్యం కూడా ఉంటుంది…
అన్నట్టు అసలు విషయం చెప్పనేలేదు కదూ… ఈ శిక్షకు ముందు చౌతాలా జూనియర్ బేసిక్ టీచర్స్ రిక్రూట్‌మెంట్ స్కామ్ కేసులో జైలు శిక్ష అనుభవించాడు..,. 2021 ఫిబ్రవరిలో విడుదలయ్యాడు… అదీ ప్రభుత్వం దయ వల్ల… అన్నట్టు మరో వృద్ధ ఖైదీ గురించి కూడా చెప్పాలి… మాజీ ఎంపీ సజ్జన్‌కుమార్ తెలుసు కదా… ఆయన వయస్సు (ఈ వార్తాకాలంలో…) 76 ఏళ్లు… 1984 భీకరమైన సిక్కు వ్యతిరేక అల్లర్లలో ప్రధాన దోషి… జీవిత ఖైదు పడింది…
చెప్పుకుంటూ పోతే ఇలాంటి ఎన్నో ఉదాహరణలు… అంతెందుకు..? నేరం రుజువైతే తమకు పడే శిక్షలకన్నా ఎక్కువ రోజులు జైలులో గడిపినవారు, అనగా సకాల విచారణకు నోచనివాళ్లు వేలు… జైలు గదుల్లో ఆరోగ్యం దెబ్బతిని మరణించినవారూ ఉన్నారు… జైళ్లలో వాళ్లు అనుభవించే మానసిక క్షోభ చెప్పనలవి కాదు… మరి వీళ్ల స్థితిగతులను అధికారంలో ఉన్నప్పుడు ఒక్క నాయకుడైనా పట్టించుకుంటున్నాడా..?
ఖర్మ కాలి జైలుకెళ్లే స్థితి వస్తే… తమకు ప్రత్యేక సౌకర్యాలు, మినహాయింపులు దక్కితే చాలు… కోట్లాది రూపాయల ఫీజు తీసుకుని కూడా తమ లాయర్లు ఫెయిలైతేనే… ఇన్నేళ్లు స్టేలతో ఏ సీరియస్ విచారణకూ చిక్కనంత మాత్రాన ‘‘నిజాయితీపరుడు’’ అయిపోరు… సీఎంగా పనిచేస్తే, అహర్నిశలు ప్రజాసేవలో ఉంటే, వయస్సు మళ్లితే చట్టాలు ఏమీ కరుణ చూపవు… కావాలంటే లాలూ ప్రసాద్ యాదవ్‌ను అడగండి…!! (ప్లీజ్ ప్రజాసేవ, అహర్నిశలు పని అనే పదాలకు నిర్వచనాలు అడక్కండి ప్లీజ్…)
Share this Article