అంబానీ ఇల్లే వేల కోట్లు… ఆస్తి లక్షల కోట్లు… కొడుకు ప్రీవెడ్డింగ్ ఖర్చు వందల కోట్లు… పెళ్లికయ్యే ఖర్చు లెక్కలేనన్ని కోట్లు… అన్నీ కోట్ల ముచ్చట్లే… అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ పెళ్లికి 2500 వంటకాలు అట… ఇన్ని వంటకాలు అనే వార్తే ఆశ్చర్యాన్ని, నవ్వును కలిగించింది…
జస్ట్, తన సంపద ప్రదర్శనే తప్ప… అందులో పెళ్లి గెస్టులు ఎన్ని తింటారు..? తినడం మాట అటుంచితే ఎన్ని టేస్ట్ చేయగలరు..? ప్రత్యేకించి తనింట పెళ్లికి వచ్చే అతిథులందరూ హైఫై ధనికలోకం… అంటే, ఆల్రెడీ తినడం మీద పరిమితులు స్టార్టయినవారే ఐఉంటారు… అనగా కేలరీలు లెక్కపెట్టుకుని… స్పైస్, సుగర్ చూసుకుని… ఏదో తూతూమంత్రం కానిచ్చేస్తారు…
మరి 2500 దేనికి అనడక్కండి… అంబానీ ఖాన్‌దాన్ అంటే ఆమాత్రం ఉండాల్సిందే మరి… ఎవడు తిన్నా తినకపోయినా సరే… సరే, ఇంతకీ అంబానీ రోజూ ఏం తింటాడు…? బంగారం, వెండి ఏమీ తినడు… జస్ట్, పొద్దున మనలాగే ఇడ్లీ వంటి లైట్ టిఫిన్ లేదంటే నాలుగు పళ్ల ముక్కలు… మధ్యాహ్నం, డిన్నర్ కూడా కాసింత అన్నం లేదా రెండు పుల్కాలు… అదీ సాత్వికమైన కూరలు… అనగా పన్నీర్, ఘీ, బటర్, మసాలాలు దట్టించనివి… నో జంక్ ఫుడ్… నో ఫ్రైడ్ వెరయిటీస్…
Ads
సరే, ఎక్కడో చదివాను, ముఖేషుడి భార్య నీతా అంబానీ ఏం ఇష్టపడుతుంది..? అసలు ఆమె కదా ఈ వైభోగాన్ని పూర్తిగా ఆస్వాదించాల్సింది… ప్చ్, ఆమె కూడా అంతే… గుజరాతీ వంటకాల్ని ప్రేమించడం నేర్చుకుంది, అత్తింటి వంటలు కదా… డోక్లాలే కాదు, ఆమె బాగా ఇష్టపడి, తరచూ ఇంట్లో వడ్డించబడేది రైస్ పంకీ వంటకం అట…
ఇంట్రస్టింగు… అసలు ఏమిటి ఈ పంకీ..? ఏమీ లేదు, బియ్యపు పిండితో చేసే అట్లు… అవును, అట్లు… కాకపోతే అరటి ఆకుల మీద కాలుస్తారు, అంతే తేడా…? అదెందుకు అనకండి… అరటి ఆకులో భోజనం ఎలా శ్రేష్టమో, అరటి ఆకులపై కాల్చిన అట్లు కూడా అట్లే శ్రేష్టం అని క్లాస్ తీసుకోగలదు ఆమె…
మీరూ ట్రై చేయొచ్చు… మాడితే, కడుపులో వికారం అనిపిస్తే మాత్రం నా బాధ్యత లేదు… ముందుగా అరటి ఆకులు తీసుకుని, ముక్కలుగా కట్ చేసుకొండి… చిన్న చిన్న దోశెలు వేసే సైజులో… (నాలుగున్నర ఇంచుల వెడల్పు, ఏడు ఇంచుల పొడవు అనుకొండి)… దానికి ఒకవైపు నూనె రాయండి… తరువాత ఓ గిన్నెలో బియ్యపు పిండి తీసుకుని, దానికి చిలికిన పెరుగు కలపండి…
సరిపడా ఉప్పు, పిండికి మూడొంతుల వెచ్చని నీళ్లు కలపండి… హ్యాండీ కవ్వంతో బాగా చిలకండి… నాలుగైదు గంటలు దాన్నలా వదిలేయండి… కాస్త పులుస్తుంది… (పులిసిన ఫుడ్ ఎంత ఆరోగ్యకరమో ఆల్రెడీ చెప్పుకున్నాం కదా… ఇదీ అదే హెల్తీ)… అలా పులియబెట్టిన పిండికి కాస్త ఇంగువ (జీర్ణానికి మంచిది), కాస్త దంచబడిన జిలకర కూడా జతచేయండి…
అల్లం, వెల్లుల్లి, మిర్చి కలిపిన పేస్ట్ కూడా ఈ పిండికి కలపండి… కాస్త నెయ్యి, కాస్త పసుపు… ఇక చాలు… దోశె పిండిలా తయారైంది కదా… అరిటాకు ముక్కల మీద దోశె వేసినట్టే పోయండి… పెనం మీద పెట్టి మరో నూనె పూసిన అరిటాకు ముక్కను బోర్లించండి… మంచిగా కాలాక, ఓ ప్లేటులో పెట్టి అరిటాకు ముక్కల్ని తొలగించండి… అంతే… ఏ చట్నీ అయినా సరే, లేదంటే ఆవకాయ…
ఇదంతా చదివితే మీకు పనస ఆకుల్లో వండే పొట్టెక్కలు గుర్తొస్తున్నాయా..? అంతే, కాకపోతే అది ఆవిరి మీద ఉడికించడం, ఇవి పెనం మీద కాల్చడం, అంతే తేడా… తెలంగాణలో కొన్ని కూరలు కూడా ఆకుల్లో చుట్టి వండుతుంటారు… సో, చలో పంకీ… అంబానీ వారి గుజరాతీ తిండి మా ఇంట్లోనూ అని ఫీలవుతూ తినాలి… అది మరింత టేస్టు..!!
Share this Article