పంజాబ్… బర్నాలా జిల్లాలోని ఉగోకే… ఆమె పేరు బల్దేవ్ కౌర్… ఓ ప్రభుత్వ పాఠశాలలో స్వీపర్… అదీ కంట్రాక్టు పద్ధతిన… 22 ఏళ్లుగా కంట్రాక్టు జీతమే… ప్రతి ఏటా క్రమబద్ధీకరణకు ఆమె దరఖాస్తు చేసుకుంటుంది, ప్రభుత్వం రిజెక్ట్ చేస్తుంది… భర్త కూలీ… ఆ ఇంటికి ఆమె తీసుకొచ్చే జీతమే ప్రధాన ఆధారం… పొద్దున్నే ఓ చీపురు తీసుకుని స్కూల్ వెళ్లడం, ఆవరణతోసహా గదులన్నీ క్లీన్ చేయడం, లాంగ్ బెల్ కొట్టేదాకా అక్కడే ఉండి, ఇంటికి వచ్చేయడం… అదే ఆమె దినచర్య… ఆమె కొడుకు పేరు లాభ్‌సింగ్…
లాభ్‌సింగ్ మొదట్లో ఓ చిన్న మొబైల్ షాపులో పనిచేసేవాడు… తరువాత తనే ఓ షాపు పెట్టుకున్నాడు… వేణ్నీళ్లకు చన్నీళ్ల తోడు అన్నట్టుగా ఆమ్మ జీతానికి తన సంపాదన కాస్త తోడు… జీవితంలో కష్టనష్టాలెన్నో చూసింది ఆమె… కొన్నేళ్ల క్రితం లాభ్‌సింగ్‌కు పెళ్లి చేసింది… భార్య పేరు వీర్‌పాల్ కౌర్… బట్టలు కుడుతుంది… లాభ్‌సింగ్ రాజకీయాల్లోకి చేరాడు… అమ్మ వద్దనలేదు, అలాగని వీరతిలకం దిద్దలేదు… నిర్వికారంగా తన పని తాను… అది పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ సొంత నియోజకవర్గం లోకబహదూర్…
ఆప్ చన్నీ మీద తమ అభ్యర్థిగా లాభ్‌సింగ్‌ను ఎంపిక చేసింది… హడావుడి, ప్రచారం, హంగామా… ఆప్ ఎన్నికల గుర్తు చీపురును, తన చేతిలో చీపురును ఓసారి చూసి… తన పనిలో తాను మునిగిపోయింది… ఆమె పని ఆమెదే… స్కూల్, చీపురు, క్లీనింగ్… సీఎం మీద కొడుకు భారీ మెజారిటీతో గెలిచాడు… దండలు, పొగడ్తలు, జెయింట్ కిల్లర్ అంటూ అభినందనలు… ఇంటికి వచ్చీపోయే జనం… ఆరోజు ఆమెకు స్కూల్ వెళ్లడానికి వీలు కాలేదు… మరుసటిరోజు పొద్దునే చీపురు తీసుకుని, స్కూల్‌కు వెళ్లిపోయింది, యథావిధిగా… తన పని తనది…
Ads
కొడుకు ఎమ్మెల్యే కాగానే… నా పని మానేయాలా..? ఇన్నాళ్లూ తిండి పెట్టింది, కడుపు నింపింది ఈ పనే… కొడుకుది ఎమ్మెల్యే పని… నాది స్వీపర్ పని… ఎవరి పని వాళ్లదే… ‘‘ఇంకా స్వీపింగ్ పని చేస్తావా’’ అనడిగిన వాళ్లకు ఆమె అణకువగా చెప్పిన జవాబు ఇదే… ఆమె మాటలో కూడా వీసమెత్తు తేడా రాలేదు… లాభ్‌సింగ్ తండ్రికి ఈమధ్యే కంటి ఆపరేషన్ జరిగింది… కూలీ పనికి వెళ్లడం లేదు… తను మాత్రం ఆనందంగా ఉన్నాడు… పదిమందిలో రేంజ్ పెరిగింది కదా…
సదరు కొత్త ఎమ్మెల్యే కూడా ఆ స్కూల్‌లో చదువుకున్నవాడే… 22 ఏళ్ల తరువాత… ఎమ్మెల్యే గారిని పిలిచి స్కూల్ వాళ్లు మొన్న ఓ రిబ్బన్ కటింగ్ ఫంక్షన్ పెట్టారు… వెళ్లాడు… ఆరోజు కూడా అమ్మ పనిలోకి వచ్చింది… కొడుకు సన్మాన కార్యక్రమం జరుగుతూ ఉంటే, దూరంగా నిల్చుని చూస్తుండి పోయింది… సహజంగానే దండలు, దండాలు, పొగడ్తలు నడుస్తున్నయ్… ఆమె చూస్తూ, వింటూ అలా నిలబడిపోయింది… ఇక్కడ కలుక్కుమనేది ఏమిటంటే..?
ఆ కార్యక్రమం ముందు వరుసలోని కుర్చీలో అమ్మను కూర్చోబెట్టి ఉంటే ఎంత బాగుండేది..? ఆమె కళ్లు ఎలా వెలిగిపోయి ఉండేవి..? ఆమె గుండెలో ఆనందం ఎలా వెల్లువెత్తేది..? తను స్వీపర్‌గా 22 ఏళ్లుగా చాకిరీ చేస్తున్నచోట… తన కొడుకు ఎమ్మెల్యే స్థానంలో… తన తల్లిగా గర్వంగా ఆ కుర్చీలో కూర్చుని ఉంటే అదెలా ఉండేది..? కానీ అదేమీ జరగలేదు… అంతా అయ్యాక కొడుకు ఆ అమ్మ దగ్గరకు వెళ్లాడు… ఫోటో దిగాడు… మీడియాకు ఆ ఫోటో కావాలి… ‘‘అమ్మే మా కుటుంబాన్ని పోషించింది చాన్నాళ్లు… ఆమె పని ఆమెకు గౌరవం… ఇప్పుడు హఠాత్తుగా ఆ పనిని వదిలేయాల్సిన పనేముంది..?’’ అన్నాడు మీడియా వాళ్లు చకచకా రాసుకున్నారు…
‘‘ఏమమ్మా…? నీ కొడుకు ఇప్పుడు ఎమ్మెల్యే కదా… ఇప్పుడు నీ మనస్సులో ఏమనిపిస్తోంది’’ ఇదీ మీడియా పదే పదే వేసే ప్రశ్న ఆమెకు… ‘‘ఇంట్లో నా కొడుక్కి అమ్మను… బడిలో ఈరోజుకూ జీతం రెగ్యులరైజ్ గాని ఓ కంట్రాక్టు లేబర్‌ని… ఎమ్మెల్యే తల్లిని కాబట్టి నా జీతం రెగ్యులర్ చేస్తారేమో, కానీ అందరు స్వీపర్ల కొడుకులు ఎమ్మెల్యేలు కాలేరు కదా… ప్రభుత్వమే మాలాంటోళ్ల సమస్యల్ని పట్టించుకోవాలి… (పీటీఏ నిధి నుంచి వీళ్ల జీతాలు చెల్లిస్తుంటారు)… నా కొడుకు తన రూట్స్ మరిచిపోకుండా, తన పాత జీవితం మరిచిపోకుండా నలుగురికీ మంచి చేసే పనులు చేస్తే చాలు’’ అని బదులిచ్చింది… తిరిగి అదే చీపురు, అదే బడి… ఆమె పని ఆమె చేస్తోంది… ఇప్పటికీ… గ్రేట్… అమ్మా… సలాం…!!
Share this Article