ఎంతసేపూ ఉప్మాలు, ఉప్పుడుపిండేనా… అత్యంత బలవర్ధకం, రుచికరం, విభిన్నమైన, సంపూర్ణ భోజనం ఏదైనా ఉంటే చెప్పు అన్నాడు ఓ మిత్రుడు… ఉంది, కశ్మీరీ రెస్టారెంట్లు ఎక్కడున్నా సరే దొరుకుతుంది… దాని పేరు వజ్‌వాన్… అయితే రియల్ వాజ్‌వాన్ కావాలంటే కశ్మీర్ లోయే సూపర్… అదీ కట్టెల పొయ్యి మీద, ఆ వంటల ప్రిపరేషన్ బాగా తెలిసిన వంటవాళ్లయితే వజ్‌వాన్ కాదు, వాహ్‌వాన్ అనేస్తారు… అసలు ఈ భోజనం తీరే వేరు…
మాంసాహారాన్ని ఇష్టపడే ఆహారప్రేమికులకు ఘుమఘుమలాడే వేడి వజ్‌వాన్ వంటకాలు గనుక ముందుపెడితే… ఇక ఏమీ అక్కర్లేదు… అర్జెంటుగా స్వర్గానికి వెళ్దాం రావోయ్ అన్నాసరే, ఇది పూర్తయ్యాకే వస్తా అంటారేమో… ఇది అచ్చమైన కశ్మీరీ విశిష్ట భోజనం… డిషెస్ ఎక్కువ కాబట్టి, ఖరీదు ఎక్కువ కాబట్టి ప్రత్యేక పండుగలు, పెళ్లిళ్లు, అల్లుళ్ల మర్యాదలకు ఇదే ప్రిఫరెన్స్… కశ్మీరీ ఫుడ్ ఫెస్టివల్స్‌లో వజ్‌వాన్ లేకపోతే ఇంకేమీ లేనట్టే లెక్క…
హైదరాబాదులో కూడా కొన్ని రెస్టారెంట్లలో దొరుకుతుంది… కానీ పెరుగు పెరుగే, మజ్జిగ మజ్జిగే… కొన్ని ఎక్కడ తినాలో అక్కడే తినాలి… బిర్యానీ 30 రూపాయలకు కూడా దొరుకుతుంది… 3 వేలు చార్జ్ చేసే హోటళ్లూ ఉంటాయి… వాడే దినుసులు, వండే విధానం, ఆంబియెన్స్, క్వాంటిటీ, క్వాలిటీ, నిష్ణాతుడైన చెఫ్… ఇలా చాలా అంశాలు కౌంట్‌లోకి వస్తాయి కదా… సేమ్, వజ్‌వాన్ కూడా అంతే… 200 రూపాయలకు పెట్టేవాళ్లు ఉంటారు… 2500 వరకూ చార్జ్ చేసేవాళ్లూ ఉంటారు…
Ads
కశ్మీర్‌లో ఆయా సమూహాల ఇష్టాయిష్టాలను, అలవాట్లను బట్టి బీఫ్, గొర్రెమాంసం, చికెన్ ఎక్కువగా ఉపయోగిస్తారు… కశ్మీర్‌లో పెద్దగా ఫిష్, ప్రాన్స్ డిషెస్‌కు పెద్ద ఆదరణ ఉండదు… సంపూర్ణమైన వజ్‌వాన్ అంటే దాదాపు 30 నుంచి 36 రకాల వంటకాలు ఉంటయ్… కానీ క్రమేపీ వాటి సంఖ్య ఇప్పుడు ప్రధానంగా 20 వరకూ తగ్గిపోయింది… ఈ భోజనంలో మూడునాలుగు శాకాహార వంటకాలు ఉంటయ్… ఎక్కువగా అన్నంతోనే తింటారు… కానీ చాలామంది అన్నం, చపాతీ, పరోటాలు పట్టించుక్కుండా… సూకా మటన్ డిషెస్ కుమ్మేస్తారు…
రిస్టా… ఎర్రటి గ్రేవీలో బాగా ఉడికించిన మాంసం బాల్స్
లహబీ కబాబ్… పెరుగులో వండేవి, చదునైన మటన్ కబాబ్స్
వాజా కోకుర్… పూర్తి కోడిని లేదా రెండు భాగాలు చేసి అలాగే వండేస్తారు
డేని పౌల్… ఇదీ ఓ మటన్ డిష్
దౌదా రస్… తీయటి పాలల్లో వండే మాంసం
రోగన్ జోష్… కశ్మీరీ సుగంధ ద్రవ్యాలతో వండిన లేత గొర్రె మాంసం
సీర్ ఎ గుష్తబ్… పెరుగు, నేరేడు పండ్లతో ఉడికించే మీట్ బాల్స్
తబక్ మాజ్… గొర్రె లేత పక్కటెముకల్ని పెరుగులో ఉడికించి, ఆపై వేయిస్తారు
దనివాల్ కుర్మా… కొత్తిమీరతో కూడిన మటన్ కూర
వజా పాలక్… చిన్న చిన్న మటన్ బాల్స్‌ను పాలకూర కలిపి వండుతారు
ఆబ్ గోష్… పాలలో వండిన గొర్రె మాంసం కూర
మార్చ్ వంగన్ కుర్మా… ఇది అత్యంత స్పైసీ… ఎక్కువ సుగంధద్రవ్యాలు వేస్తారు
కబాబ్… వేడి బొగ్గులపై కాల్చిన మాంసం ముక్కలు
గుష్తబా… పెరుగు గ్రేవీలో మెత్తగా వండే మాంసం బాల్స్
యాక్న్… ఇది అచ్చంగా పెరుగు కూర… గట్టి దప్పళం టైప్…
రువాంగన్ చమన్… చతురస్రపు పన్నీర్ ముక్కల్ని టమాట గ్రేవీలో ఉడికిస్తారు
దమ్ ఈల్వీ… పెరుగు గ్రేవీలో వండే ఆలుగడ్డ ముక్కలు
దమ్ ఆలూ… చెప్పనక్కర్లేని కామన్ డిష్
గండ్ ఆంచర్… ఉప్పు, పెరుగు, మసాలాలు, మిర్చి వేసిన ఉల్లిపాయ ముక్కలు
ముజి చెటిన్… ముల్లంగి, వాల్నట్స్ చట్నీ
ఫిర్ని… సేమ్యాతో గానీ, రుబ్బిన అన్నంతో గానీ చేసే పాల హల్వా… యాలకులు, కుంకుమపువ్వు గట్రా వేసి, నట్స్ ముక్కలతో సర్వ్ చేస్తారు
…….. ఇవీ కొన్ని డిషెస్ పేర్లు… సరిపోయాయా., ఇంకేమైనా వడ్డించమంటారా..?!
Share this Article