Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

కాంగ్రెస్ ‘ప్రజాపంపిణీ’ని ఎలా చక్కబెడతారో ఈ స్పెషల్ అబ్జర్వర్ గారు…

October 22, 2023 by M S R

Nancharaiah Merugumala…….    పశ్చిమ గోదావరి మూలాలున్న ఈ కర్ణాటక మంత్రి నడింపల్లి బోసురాజు ఎన్నికల ‘స్పెషలబ్జర్వర్‌’గా తెలంగాణ ‘కాంగ్రెస్‌ ప్రజా పంపిణీ వ్యవస్థ’ను ఎంత సమర్ధంగా నడిపిస్తారో చూడాల్సి ఉంది…!

……………………………….తెలంగాణ శాసనసభ మూడో ఎన్నికల్లో నియమించబడిన కాంగ్రెస్‌ ప్రత్యేక పరిశీలకులు ఇద్దరిలో ఒకరు కర్ణాటక చిన్న తరహా నీటిపారుదల శాఖా మంత్రి నడింపల్లి ఎస్‌ బోసు రాజు… ఈయన్ని శనివారం ‘కాంగ్రెస్‌ ఐ కమాండ్‌’ నియమించింది. పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం మోగల్లులో పుట్టి పెరిగిన ఈ కాంగ్రెస్‌ నేత మొన్నటి మే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయకుండానే సిద్దరామయ్య మంత్రివర్గంలో కేబినెట్‌ మంత్రిగా చేరారు. తర్వాతే రాజు గారు శాసనమండలి సభ్యుడయ్యారు.

ఇది వరకు రాయచూరు జిల్లా, మాన్వి నుంచి రెండుసార్లు శాసనసభకు ఎన్నికైన బోస్‌ రాజు తాను మంత్రి కావడానికి ముందు నుంచే తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జీకి సహాయకుడిగా అనేకసార్లు హైదరాబాద్‌ వచ్చిపోయేవారు. మళ్లీ ఇప్పుడు మంత్రి హోదాలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ ప్రత్యేక పరిశీలకుడిగా మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్‌ ఎస్‌ చవాన్‌ తోపాటు బోస్‌ రాజు నియమితులవ్వడం విశేషం. ఆయన తాజా నియామకం– న్యూఢిల్లీ ఏఐసీసీ ఆఫీసులో, సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీల దగ్గర ఆయనకున్న పలుకుబడికి నిదర్శనం.

Ads

కర్ణాటక కాంగ్రెస్‌ రాజకీయాల్లో రాయలసీమ రెడ్లతోపాటు గట్టి కమ్మ నేతలు గతంలో, ఇప్పుడూ ఎందరో ఉన్నప్పటికీ బోస్‌ రాజులాగా నెమ్మదిగా పక్కనున్న తెలుగు రాష్ట్రం కాంగ్రెస్‌ వ్యవహరాల పర్యవేక్షకుడిగా లేదా పరిశీలకుడిగా పెత్తనం చేసే అవకాశం వారెవరికీ రాలేదు. ఇది వరకు కోస్తా, రాయలసీమ జిల్లాలకు చెందిన నేతలు లేదా అధికారులకు తెలంగాణలో తాత్కాలికంగా ఆధిపత్యం చెలాయించే పదవులు ఇచ్చినప్పుడు గోల చేసిన రికార్డు ఉన్న తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఏ రేవంత్‌ రెడ్డి కావాలనే బోస్‌ రాజుగారి నియామకానికి లాబీయింగ్‌ చేశారా లేక ఢిల్లీ అధిష్ఠానమే ఆయనను పంపించిందా?

ఈ విషయం కోమటిరెడ్లు, ఉత్తమరెడ్లకే తెలియాలి. ఈ ఏడాది కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ రాయచూరు జిల్లాలో అత్యధిక సీట్లు గెలవడానికి వీలుగా తనకు, తన కొడుకు రవి బోస్‌ రాజుకు పార్టీ టికెట్‌ వద్దని చెప్పిన బోస్‌ రాజు గారు ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేశారని అప్పట్లో వార్తలొచ్చాయి.

తండ్రికి తగ్గ తనయుడు రవి బోస్‌ రాజు

………………..

ఆయన వారసుడిగా రవి బోస్‌ రాజు కూడా రాయచూరు జిల్లా కాంగ్రెస్‌ పార్టీ వ్యవహారాల్లో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుత కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి సిద్దరామయ్య కాంగ్రెస్‌ లో చేరకముందు సోషలిస్టు మహానేత డా. రాంమనోహర్‌ లోహియా ‘అడుగుజాడల్లో’ నడిచిన సంగతి చాలా మందికి తెలుసు. కాబట్టే ఆయన లోక్‌ దళ్, జనతాదళ్‌ లో కొనసాగారు కూడా.

కాంగ్రెస్‌లో చేరిన (2006) ఏడేళ్లకే ఆ పార్టీ తరఫున 2013లో కర్ణాటక ముఖ్యమంత్రి అయిన సిద్దరామయ్య ఇప్పటికీ డా.లోహియా సిద్ధాంతాల ఆచరణకే కట్టుబడి ఉన్నానని చెబుతుంటారు. అందుకే సిద్దమరామయ్య కళ్లలో ఆనందం చూడడానికి రవి బోస్‌ రాజు కూడా డా.లోహియా పుట్టినరోజున ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ప్రజలకు శుభాకాంక్షలు చెప్పడం ఎప్పటి నుంచో జరుగుతోంది. చివరికి ఇన్ఫోసిస్‌ స్థాపకుడు ఎన్‌.ఆర్‌.నారాయణమూర్తి వంటి ప్రముఖుల జన్మదినం సందర్భంగా కూడా గ్రీటింగ్స్‌ చెప్పడం బోసురాజు గారి అబ్బాయికి అలవాటుగా మారింది.

తండ్రి కన్నా ఎక్కువ చురుకైన, సమరశీల నేతగా రవికి పేరొచ్చింది. కాంగ్రెస్‌ పార్టీకి ‘చావో రేవో’ అనే రీతిలో వస్తున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం 60 సీట్లు గెలుచుకుని హైదరాబాద్‌ లో దాదాపు పదేళ్ల తర్వాత అధికారంలోకి హస్తం పార్టీని రప్పించడానికి– 71 ఏళ్ల డైనమిక్‌ బోస్‌ రాజుగారు ‘ప్రత్యేక పరిశీలకుడి’గా ఎలా పనిచేస్తారో ఊహించడం కష్టమేమీ కాదు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేతుల నుంచి ముందే రూ.40 లక్షల చెక్కులు తీసుకుని, ఇంకా సొంత అర్ధబలంతో దూసుకుపోతున్న బీఆరెస్‌ అభ్యర్థులను కాంగ్రెసోళ్లు తట్టుకోవడానికి– బోస్‌ రాజు గారి దగ్గర ఎలాంటి ఐడియాలున్నాయో మరి! 1993లో నాటి కాంగ్రెస్‌ ప్రధాని పీవీ నరసింహారావు గారి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతిపక్షాల అవిశ్వాస తీర్మానం నుంచి కాపాడడానికి నాటి కాంగ్రెస్‌ నేత, చిత్తూరు జిల్లాలో గట్టి పునాదులున్న బలిజ నాయుడు డీకే ఆదికేశవులు గారు–అవరమైనన్ని కట్టలతో నిండిన సూటుకేసులను బెంగళూరు విమానాశ్రయం నుంచి హస్తినకు పకడ్బందీగా, సకాలంలో పంపించారు.

ఈ కట్టలు రాజధాని చేరాకే కాంగ్రెస్‌ సర్కారు నిలబడింది. పని అయ్యాక అపరచాణక్యుడు–బహుభాషా కోవిదుడితో ‘శభాష్, నాయుడూ,’ అని ప్రశంసలు పొందారు ఆదికేశవులు గారు. బెంగళూరులో మద్యం ఉత్పత్తి చేసే డిస్టిలరీలున్న ఆదికేశవులు గారు తర్వాత తెలుగుదేశంలో కూడా చేరి పార్టీ నేత చంద్రబాబు గారికి ఆసరాగా నిలబడ్డారు.

నవంబర్‌ 30న పోలింగ్‌ జరిగే తెలంగాణ ఎన్నికల్లో కూడా దాదాపు 115 మంది కాంగ్రెస్‌ అభ్యర్థుల గెలుపునకు అవసరమైన సాధనసంపత్తిని ఈ నడింపల్లి బోసురాజు గారు ఎలా బెంగళూరు నుంచి హైదరాబాదుకు బట్వాడా చేయిస్తారో చూడాలి. ఉత్తర తెలంగాణ పద్మనాయకుల కన్నా గోదావరి జిల్లాల రాజులే గుట్టుచప్పుడు కాకుండా ఉత్తమ ఫలితాలు రాబట్టే మంచి ఆటగాళ్లనే పేరు రావాలంటే– బోస్‌ రాజు పోలింగుకు పది రోజులు ముందు కాంగ్రెస్‌ ‘ప్రజా పంపిణీ వ్యవస్థ’ను అత్యంత పటిష్ఠంగా నడిపించాల్సి ఉంటుంది. అప్పుడే 1990 తర్వాత, అంటే దాదాపు 33 ఏళ్లకు ఓ తెలంగాణ రెడ్డి కాంగ్రెస్‌ నేత హైదరాబాద్‌ లో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసే అవకాశం వస్తుంది…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఒక కోట… ఒక బ్రహ్మి… ఎప్పుడు చూసినా నవ్వులు పండించే హిట్ మూవీ….
  • ఒక గొప్ప ఫోటో..! దీని వెనుక ప్రతి లీడర్ తప్పక చదవాల్సిన ఓ కథ..!!
  • నీలిపూల నిద్రగన్నేరు చెట్టు… పరోమా! ఉదాత్తమైన అక్రమ ప్రేమ కథ…
  • గొప్పల తిప్పలు తరువాత… ముందు నీ గోచీ సరిచూసుకోవయ్యా ట్రంపూ…
  • ఇది ఆ పాత కాంగ్రెస్ కాదు… ఈ జుబ్లీ గుట్టల్లో కొత్తగా స్ట్రాటజిక్ అడుగులు…
  • ‘‘కేసీయార్‌వి ప్రచార నాటకాలు- రేవంత్ రెడ్డి ప్రభుత్వం అలా కాదు’’
  • మొన్నటి అమ్మాయిల విజయం వెనుక ఓ అలుపెరుగని గురువు..!!
  • ఓ సుదీర్ఘ వీక్షణం… ఆ పాత వైబ్స్ లేవు, ఆ గూస్ బంప్స్ లేవు…
  • అదే రవితేజ… అదే మొనాటనీ… అదే యాక్షన్… అదే ‘మాస్ జాతర’…
  • నిన్న అమ్మాయిల గెలుపు హోరు… నేడు అబ్బాయిల పేలవ ఆటతీరు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions