ప్రభుత్వం ఇచ్చే అవార్డుల వెనుక చాలా పైరవీలు, సిఫారసులు, కొన్నిసార్లు ప్రభుత్వ పొలిటికల్ ఈక్వేషన్లు, మన్నూమశానం ఉంటయనే అపప్రథ ఉన్నదే కదా… పద్మపురస్కారాలూ అంతే… అయితే ఈసారి (2019) జాతీయ సినిమా అవార్డుల్లో కంగనా రనౌత్‌కు మణికర్ణిక, పంగా సినిమాలకు గాను ఉత్తమ నటి అవార్డు వరించడం పెద్ద ఆశ్చర్యమేమీ అనిపించలేదు… ఆమె బీజేపీ మనిషే కదా… పైగా మహారాష్ట్రలో సినిమా మాఫియా, శివసేన సర్కారుతోనూ ఫైటింగ్ చేస్తోంది… అయితే… జాతీయ ఉత్తమనటి అవార్డును పొందే స్థాయిలో ఉందా లేదా వదిలేస్తే ఆ రెండు సినిమాల్లోనూ నిజంగానే తన నటన బాగుంది… సో, మరీ తేలికగా తీసిపారేయనక్కర్లేదు… ఇలాగే ఇతర అవార్డుల వెనుక కూడా చాలా లెక్కలు ఉంటయ్… ఉదాహరణకు ధనుష్‌కు అవార్డు రజినీ ఫ్యాన్స్ ఆదరణ కోసం అనే ఓ లెక్క వినిపిస్తోంది… అసలు ఏ లెక్కలకూ అందకుండా నవ్వు పుట్టించిన అవార్డు బహుశా తెలుగు సినిమాలకు దక్కిన అవార్డులే కావచ్చు… మహర్షి సినిమాకు ఉత్తమ వినోదాత్మక సినిమాగా అవార్డు ప్లస్ ఉత్తమ కొరియోగ్రఫీ అవార్డు… వీటి మీద తెలుగు సోషల్ మీడియాలో జోకులు దీపావళి బాణాసంచా స్థాయిలో పేలుతున్నయ్… ఎందుకు అంటే..?
మహర్షి సినిమా బాగా లేదని కాదు… అందులో కమర్షియల్ వాల్యూస్, ఎంటర్టెయిన్మెంట్ కూడా ఉండవచ్చుగాక… కానీ ఓ భిన్నమైన కథాంశాన్ని తీసుకుని, తమదైన స్టయిల్లో, మహేష్ బాబు ఇమేజీకి తగినట్టు చిత్రీకరించారు… అందుకని దాన్ని పాపులర్ వినోదాత్మక సినిమా అంటూ అవార్డు ఇవ్వడమే నవ్వు పుట్టించింది… అలాగే అదే సినిమాలో కొరియోగ్రాఫర్‌గా పనిచేసిన రాజు సుందరానికి కూడా జాతీయ అవార్డు వచ్చింది… అసలు అందులో సూపర్ రేంజ్ డాన్సులు ఎక్కడున్నయ్..? ఆ స్టెప్పులను డాన్సులు అంటారా..? వాటిని కంపోజ్ చేయడం అంత బ్రహ్మాండమైన ప్రతిభా..? ఇవీ సోషల్ మీడియా సంధించి, వెక్కిరిస్తున్న ప్రశ్నలు… కొందరు నెటిజన్లయితే మరీ తమిళనాడు ఎన్నికల కోసం ఈ అవార్డు ఇచ్చారంటూ కామెంట్స్ పెడుతున్నారు… నిజంగానే బీజేపీకి ఆ ఎత్తుగడ ఉంటే ఈ రాజు సుందరానికే ఎందుకివ్వాలి..? సో, ఆ విమర్శలో పస లేదు… నిజానికి రాజు సుందరానికి ఆ సినిమాలో కొరియోగ్రఫీకి జాతీయ అవార్డు దక్కడం నవ్వు పుట్టించవచ్చుగాక… కానీ తను జాతీయ అవార్డులకు అర్హుడైన కొరియోగ్రాఫరే… పైగా ఇదేమీ కొత్త కాదు తనకు… ఆల్రెడీ జనతా గ్యారేజీ సినిమాలో ప్రణామం పాటకు ఓసారి జాతీయ అవార్డు గెలుచుకున్నవాడే… ఎవరీ రాజు సుందరం..?
Ads
సుందరం మాస్టర్ ముగ్గురు కొడుకుల్లో తనూ ఒకడు… ప్రభుదేవా, రాజు, నాగేంద్రప్రసాద్… తండ్రి బాటలో ముగ్గురూ కొరియోగ్రాఫర్లయ్యారు… ఏదో తండ్రి పేరు చెప్పుకుని కాయలమ్ముకునే రకం కాదు… ముగ్గురూ స్వతహాగా జెమ్స్… స్వయంగా సూపర్ డాన్సులు చేయగలరు, చేయించగలరు… మారి-2 సినిమా కోసం ప్రభుదేవా సాయిపల్లవి, ధనుష్‌లతో వేయించిన రౌడీబేబీ స్టెప్పులు ఈరోజుకూ యూట్యూబులో 110 కోట్ల వ్యూస్ దాటి ఇంకా జోరు కొనసాగుతున్న నంబర్ వన్ ఇండియన్ సినిమా సాంగ్… సరే, ప్రభుదేవా సంగతి అందరికీ తెలిసిందే… ఈ రాజు తెలుగు తెరపైన ప్రధానంగా కనిపించడు గానీ… మణిరత్నం తీసిన రోజా సినిమా గుర్తుంది కదా… రుక్కిమిణీ రుక్కిమిణీ పాటలో తొలిసారి అందరి దృష్టిలో పడ్డాడు రాజు… తరువాత తమిళం, కన్నడం, తెలుగు, మళయాళం సినిమాల్లో డాన్సులు చేసినా… దొంగ దొంగ సినిమాకు కొరియోగ్రాఫర్‌గా పూర్తి బాధ్యతలు తీసుకున్నాడు… వాటిల్లో కొంచెం నిప్పు, కొంచెం నీరు… వీరబొబ్బిలి కోటలో… వంటి పాటలకు కొత్తతరహా స్టెప్పులు కంపోజ్ చేశాడు… ఇక వెనక్కి తిరిగి చూడలేదు… మణిరత్నం, శంకర్ వంటి పెద్ద పెద్ద దర్శకులందరికీ ఇష్టుడైన కొరియోగ్రాఫర్… డాన్సరే కాదు, రైటర్, డైరెక్టర్, యాక్టర్… ఈ బాబా భాస్కర్, జానీ మాస్టర్ వంటి ప్రజెంట్ డాన్స్ మాస్టర్లెందరో రాజు సుందరం దగ్గర అసిస్టెంట్లుగా, డాన్సర్లుగా పనిచేసినవాళ్లే… సో, ఫర్గెట్ అబౌట్ మహర్షి… రాజు సుందరానికి జాతీయ అవార్డు ఇవ్వడంలో తప్పులేదు… కానీ సరైన సినిమా పేరు చెప్పి ఇస్తే బాగుండేది… అంతే… కొంపదీసి పూజాభట్ ఐటం సాంగ్ పాలపిట్ట స్టెప్పులు చూసి ఈ అవార్డు ఇవ్వలేదు కదా…!!!
Share this Article