మీకు గుర్తున్నాయా..? చిన్నప్పుడు పైకప్పుల మీద నీళ్లు జల్లుకుని, కప్పు కాస్త చల్లబడ్డాక, మంచాలు వేసి, పరుపులు పరిచి, చుక్కలు లెక్కెట్టుకుంటూ పడుకున్న రాత్రులు గుర్తున్నాయా..? ఈరోజు ఫ్యాన్లు, ఏసీలు ఇవ్వలేని గాఢ నిద్రను ఆ పైకప్పుల మీద పరిచిన చాపలు ఇచ్చేవి… అవి చీకటి రాత్రులు గానీ, వెన్నెల రాత్రులు గానీ ముచ్చట్లలో గంటలకుగంటలు అలా దొర్లిపోయేవి… యాదికి ఉందా..? ఈ అనుభవాలు లేని జీవితాలు శుద్ధ దండుగే కదా…
మామ్మలు, తాతలు, మేనత్తలు, మేనమామలు, వాళ్ల పిల్లలతో ఒక్కసారి పైకప్పు ఎక్కామంటే మాటలే మాటలు… పాటలు, ముచ్చట్లు… తాత పైకి వచ్చి అదిలించడం, కాసేపు నిశ్శబ్దం… తాత కిందకు దిగిపోగానే మళ్లీ మాటలు, వీలైతే నాలుగు పాటలు… కాకపోతే ఈసారి కొంచెం లోపిచ్‌లో… అప్పట్లో ఇళ్లలో విద్యుత్తు అంటే నాలుగు బల్బులు… అందులో ఒకటి జీరో వాట్స్, అంటే బెడ్ లైట్ అన్నమాట… వంటింట్లో 40 వాట్స్, హాల్లో 100 వాట్స్, మరొకటి 60 వాట్స్… ఫ్యాన్ ఉందీ అంటే డబ్బున్నవాళ్ల ఇల్లు అని అర్థం…
మరుపురాని రాత్రులు… పడుకునేటప్పుడు అందరిదీ ఒకే ఫోజు… తెల్లారేసరికి దుప్పటి ఎక్కడో… దిండు ఎక్కడో… ఒక్కొక్కరు ఒక్కో ఫోజు… సూరీడు వచ్చి వీపు చురుక్కుమనిపిస్తే కదా, మెలకువ… అదీ సగం నిద్రమత్తులో… అటు పక్క, ఇటు పక్క కూడా ఇళ్లు సేమ్ ఎత్తు… ఈ పైకప్పు చూసినా ఇవే దృశ్యాలు…
Ads
అప్పట్లో ఓ అలిఖిత నియమం… ఓ బకెట్లో నీళ్లు పైదాకా తీసుకొచ్చి సాన్పి (కళ్లాపి) జల్లినట్టుగా చల్లాలి… కింద నుంచి కొందరు చాపలు, దిండ్లు, దుప్పట్లు, శెద్దర్లు తీసుకురావాలి… చక్కగా పరవాలి… కాసేపటికి కింద చల్లిన నీటి బిందువులతో ఇవీ చల్లబడతాయి… ఇక పడకేయడమే… భోజనాలయ్యాక, వంట గది సర్దేసి, ఓ చిన్న బిందెలో అత్త గానీ, మామ్మ గానీ నీళ్లు ప్లస్ ఓ గ్లాస్ తీసుకొచ్చి ఆ పిట్టగోడ మీద పెడతారు…
రేడియోలో పాటలు వినిపిస్తూనే ఉంటాయి… నిద్దరొస్తోంది, ఇక అది బంద్ పెట్టి, పడుకొండిరా అని తాత గద్దింపు… అలా చాలాసార్లు అయ్యాక గానీ రేడియోను కట్టేసేవాళ్లం కాదు… ఆకాశాన్ని చూస్తూ, చుక్కల్ని లెక్కిస్తూ, వాటితో రకరకాల ఆకారాల్ని గాలిలోనే గీస్తుంటే అత్తో, మామో సప్తర్షి మండలాన్ని, ధ్రువతారను గుర్తుపట్టేలా చూపించేవాళ్లు… మనం పడుకునేలోపు విమానం గనుక మనపై నుంచి ఎగురుతూ వెళ్తే ఝామ్మని ఎగిసే ఆనందం…
పొద్దున కోడికూత వినిపిస్తే కదా లేవడానికి, అంత గాఢనిద్ర… సూర్యుడి కిరణాలు చురుక్కుమని కాలుస్తుంటాయి… అప్పుడు లేచి శెద్దర్లు, దుప్పట్లు, దిండ్లు గబగబా తీసుకుని, కింద ఓ గదిలో పెట్టేసేయాలి… ఓ మర్యాద ఎవరూ చెప్పకుండానే పాటించేవాళ్లు… ఏదైనా రూఫ్ మీద ఆడవాళ్లు గనుక పడుకోవడానికి వస్తే, ఆ పక్క రూఫ్‌పై పడుకునే పురుషులు సైలెంటుగా దిగిపోయేవాళ్లు…
14 అడుగుల ఆ కప్పు ఎక్కడానికి, దిగడానికి భయపడేలా ఓ పాత వెదురు నిచ్చెన ఉండేది… హఠాత్తుగా ఉరుములు, మెరుపులు, సన్నని వాన మొదలైతే శెద్ధర్లు, దుప్పట్లు తడవకుండా గబగబా కిందకు తీసుకురావడానికి నానా కష్టమయ్యేది… కొన్నిసార్లు కిందకు విసిరేస్తే, కింద ఉన్నవాళ్లు వాటిని గదిలోకి చేర్చేవాళ్లు… రాత్రి, తెల్లవారుజామున కురిసిన తెలిమంచుకు బట్టలు ఇనుప మంచాలకు అతుక్కుపోయేవి… ఆనందం ఏమిటంటే అప్పట్లో పెద్దగా దోమల బెడద ఉండేది కాదు… ఒకటీరెండు ఉన్నా, కుట్టినా మన గాఢనిద్రలో తెలిసేదే కాదు…
మొన్నామధ్య ఆ ఇంటికి మళ్లీ వెళ్లాను వేసవిలోనే… చుట్టూ పెద్ద పెద్ద భవంతులు వచ్చేశాయి… మావాళ్ల ఇల్లే చిన్నగా కనిపిస్తోంది… పరిసరాలన్నీ మారిపోయాయి… దాదాపు ప్రతి ఇంట్లో ఏసీ, ఫ్యాన్లు, ఫ్రిజ్జులు, కూలర్లు కనిపిస్తున్నాయి… నాటి వేసవి రాత్రులు మాయం… మెల్లిగా పైకప్పు మీద పడుకుందామా అనడిగాను… అత్తా, మామ ఒక్కసారిగా నవ్వారు… ఆ నవ్వుతో పొలమారి, కళ్ల వెంట నీళ్లొచ్చాయి వాళ్లకు… ఎందుకో మరి…!!
Share this Article