Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

సుమలత ఖాళీ చేయదు… రాజేంద్ర ప్రసాద్ అమ్ముకోలేడు… అల్లరల్లరి..!!

November 16, 2025 by M S R

.

Subramanyam Dogiparthi …. విజయ బాపినీడు మార్కు పూర్తి వినోదాత్మక చిత్రం 1988 లో వచ్చిన ఈ దొంగ కోళ్లు … సినిమా అంతా అల్లిబిల్లి ఆంజనేయులు పాత్రలో రాజేంద్రప్రసాద్ అల్లరే . అతని బాధితురాలు సుమలత కష్టాలు , ఇబ్బందులు , చివరకు దగ్గరయి సినిమా శుభాంతం అవుతుంది .

కధ ఏంటంటే అల్లిబిల్లి ఆంజనేయులుకు పట్టణంలో ఓ ఇల్లు ఉంటుంది . అందులో సుమలత కుటుంబం అద్దెకు ఉంటుంది . చితికిపోయిన కుటుంబానికి ఆమె చిరు ఉద్యోగమే ఆధారం .

Ads

ఆంజనేయులు కష్టాలు ఆంజనేయులివి . అప్పుల బారి నుండి బయటపడటానికి పట్టణంలో ఉన్న తమ ఇంటిని అమ్మేయాలని అనుకుంటాడు . అద్దెకు ఉన్నోళ్ళు ఖాళీ చేస్తే కానీ ఇల్లు అమ్ముడుపోదు . ఖాళీ చేస్తే మరో అద్దె ఇంటికి వెళ్ళే ఆర్ధిక పరిస్థితి సుమలత వాళ్ళకు ఉండదు .

అందుకని ఖాళీ చేయం అని మొరాయిస్తారు . వాళ్ళ చేత ఖాళీ చేయించేందుకు అక్కడే ఓ గదిలో చిన్నగా తిష్ఠ వేసి , వాళ్ళను అల్లరి చేస్తూ ఉంటాడు . సినిమాఖరిలో వాళ్ళ కష్టాలు తెలుసుకుని మనసు కరిగి వాళ్ళను ఉండిపొమ్మని చెపుతాడు .

ఇంతలో జైల్లో ఉన్న సుమలత తండ్రి పారిపోయి వచ్చి, తనను జైలుకు పంపిన కూతుర్ని చంపటానికి ప్రయత్నిస్తాడు . ఆంజనేయులు వచ్చి సుమలతను రక్షించి పెళ్లి చేసుకుంటారు . కధ కంచికి .

మలయాళంలో 1986 లో వచ్చిన సన్మనస్సులవరక్కు సమాధానం సినిమాకు రీమేక్ మన తెలుగు సినిమా . మలయాళంలో మోహన్ లాల్ , కార్తీక లీడ్ రోల్సులో నటించారు . 1988 లో తమిళంలోకి ఇల్లం టైటిలుతో రీమేక్ అయింది . తమిళంలో శివకుమార్ , అమల నటించారు . హిందీ లోకి యే తేరా ఘర్ మేరా ఘర్ టైటిలుతో రీమేక్ అయింది . హిందీలో సునీల్ శెట్టి , మహిమా చౌదరి నటించారు . ఆనంద నిలయం అనే టైటిలుతో కన్నడంలోకి రీమేక్ అయింది .

చంకలో గొడుగు , చెవిలో పువ్వు , చేతిలో ఓ ఫైలు . ఇదీ రాజేంద్రప్రసాద్ ఆహార్యం . అల్లరి సన్నివేశాలలో , క్లైమాక్సులో సుమలత కష్టాలకు కరిగిపోయి దయార్ద్ర హృదయుడు అయ్యే సన్నివేశంలో భిన్న నటనను బాగా చూపారు .చితికిపోయిన దిగువ మధ్య తరగతి కుటుంబానికి ఆసరా అయిన నిస్సహాయ వనితగా సుమలత చక్కగా నటించింది .

దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని హడావుడి చేసే సబ్ ఇనస్పెక్టర్ పాత్రలో నూతన్ ప్రసాద్ , సుమలత పనిచేసే ఆఫీస్ యండిగా వంకాయల , సుమలత మేనమామగా దాదాగిరి చేసేందుకు వచ్చిన కైకాల సత్యనారాయణ అదరగొట్టేసారు .

ప్రత్యేకంగా చెప్పుకోవలసింది వై విజయ పాత్ర . పురుష లౌల్యం కల లేడీగా భర్త ఉండగానే నచ్చిన పురుషుడితో సరసం చేసే పాత్రలో అదరగొట్టేసింది . ఆమె భర్తగా డా శివప్రసాద్ నటించాడు . సుమలత ఉండే మూడిళ్ళ ప్రాంగణంలో మరో జంట బ్రహ్మానందం , కల్పనారాయ్ . తాగుబోతు మొగుడిగా బ్రహ్మానందం , పతి భక్తి పరాయణిగా కల్పనారాయ్ బాగా నటించారు .

వాసూరావు సంగీత దర్శకత్వంలో పాటలన్నీ చాలా శ్రావ్యంగా ఉంటాయి . వెటరన్ విజయ బాపినీడు బాగా చిత్రీకరించారు . మొదట చెప్పాల్సింది వై విజయ , డా శివప్రసాదుల రీమిక్స్ పేరడీ గోల పాట . రావోయి మా ఇంటికి , రావోయి చందమామ , ఈ లైలా కోసం వగైరా పాటలను మిక్సర్లో వేసి వండారు భువనచంద్ర . చాలా అల్లరి అల్లరిగా ఉంటుంది .

ఆయన వ్రాసిందే మరో శ్రావ్యమైన పాట ఏమని వివరించను నా బాధ ఎవరికి వినిపించను చిత్రీకరణ హృద్యంగా ఉంటుంది . సినిమాలో కీలకమైన పాట కూడా . సుమలత , రాజేంద్రప్రసాద్ , ఇతర నటీనటులు కూడా బాగా నటించారు . సీతమ్మో మాయమ్మో అంటూ రాజేంద్రప్రసాద్ సుమలతను టీజ్ చేసే పాట కూడా బాగుంటుంది .

సుమలతతో ఐ లవ్ యూ జీబ్రా డ్యూయెట్ డిస్కో శాంతితో క్లబ్ పాట లవులో మిస్సు హుషారుగా ఉంటుంది . పాటల్ని వేటూరి , భువనచంద్ర వ్రాయగా బాలసుబ్రమణ్యం , నాగోర్ బాబు , సుశీలమ్మ , చిత్ర , శైలజ గాత్రించారు . మాటల్ని కాశీ విశ్వనాధ్ చాలా బాగా వ్రాసారు .

ఇతర పాత్రల్లో శుభ , రావి కొండలరావు , మిశ్రో , పావలా శ్యామల , కాశీ విశ్వనాధ్ , చిట్టిబాబు , మా గుంటూరు వాడు ప్రదీప్ శక్తి నటించారు . విశాఖ మాజీ మేయర్ N S N రెడ్డి గారు స్పెషల్ అప్పియరెన్సులో కనిపిస్తారు . విశాఖపట్టణం అభినయ ఆర్ట్స్ అకాడమీ సభ్యులు సినిమాలో పలు చిన్న చిన్న పాత్రల్లో నటించారు .

పూర్తిగా విశాఖపట్టణంలో తీయబడిన ఈ సినిమాకు నిర్మాత గుత్తా మధుసూధనరావు . పాపం మన నిర్మాతలు ప్రభుత్వ ప్రోత్సాహకాలు లేకపోయినా 1970 ల నుంచే సినిమాలను విశాఖపట్టణంలో తీస్తున్నారు . మరో గొప్ప విషయం ఏమిటంటే సుందర విశాఖలో తీయబడిన ఆల్మోస్ట్ అన్ని సినిమాలు సక్సెస్ అయ్యాయి …

సరదా సరదాగా సాగే ఈ హిలేరియస్ సినిమా యూట్యూబులో ఉంది . చక్కటి కాలక్షేపం . వై విజయ కోసం తప్పక చూడాలి . 100% వినోదం గ్యారెంటీ . నేను పరిచయం చేస్తున్న 1167 వ సినిమా ఇది . #తెలుగు_సినిమాల_సింహావలోకనం #సినిమా_స్కూల్ #తెలుగుసినిమాలు #సినిమా_కబుర్లు

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అసలు రాహుల్ గాంధీ నాయకత్వం కాంగ్రెస్ పార్టీకి ఇక పనికిరాదా..!?
  • సుమలత ఖాళీ చేయదు… రాజేంద్ర ప్రసాద్ అమ్ముకోలేడు… అల్లరల్లరి..!!
  • ఓ సైంటిస్టు ఘన సృష్టి..! కానీ మన కుళ్లు వ్యవస్థ తనను చంపేసింది..!
  • కిరాతకం..! పసి పిల్లాడిపై ఓ సవతి తండ్రి దారుణ హింస..!!
  • ఘట్టమనేని కృష్ణ… సూపర్‌నోవా ఆఫ్‌ ఏ సూపర్‌స్టార్‌..!
  • సంతానప్రాప్తిరస్తు..! ఓ సున్నితమైన, భిన్నమైన సబ్జెక్టు… పర్లేదు…!!
  • అంతా మాయ..! పీఆర్ టీమ్స్ మాయ..! బిగ్‌బాస్ వోటింగు మాయ..!!
  • శ్రేయసి సింగ్…! షూటింగ్ ఆట నుంచి… పొలిటికల్ షూటింగ్ వరకు…
  • సోషల్ మీడియా గెలిపించదు… జుబ్లీ హిల్స్ ఫలితమే పక్కా ఉదాహరణ…
  • ఆర్జేడీ సాధించిన వోట్లే ఎక్కువ…! మరెందుకు కొట్టుకుపోయినట్టు..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions