అఖండ సినిమా గుర్తుందా..? ధర్మపన్నాలు చెప్పి, దబిడిదిబిడి చేయడానికి ఓ అఘోరా టైపు కేరక్టర్ ఉంటుంది… కానీ స్టార్ హీరోకు అది సరిపోదు కదా… మరో కేరక్టర్ మామూలు హీరో… ఫాఫం, జగమెరిగిన నాయకుడు, కానీ కల్లు కూడా తెలియదు, కలెక్టరమ్మ స్వయంగా కల్లు తాపించి, కల్లు ఏమిటో చెబుతుంది… అంతేకాదు, హీరోకు ఆవకాయ కూడా తెలియదు… హీరోయినే నాలుక మీద రాసి, ఆ టేస్టేమిటో చెబుతుంది… పక్కనున్న చమ్మక్ చంద్ర అంటూనే ఉంటాడు… ‘‘అమ్మా, తమరు బాగా నాకిస్తున్నారమ్మా’’ అని… డ్యూయెట్లు, ఫైట్లు సరేసరి…
ఎందుకో శర్వానంద్, అడివి శేషులతో బాలయ్య నిర్వహించిన అన్‌స్టాపబుల్ చాట్ షో చూస్తుంటే అదే గుర్తొచ్చింది… అదే కాదు, మరొకటీ గుర్తొచ్చింది… బాలీవుడ్‌లో ఒకడు బాగా పాతుకుపోయాడు… సిండికేట్ మెంబర్… పేరు కరణ్ జోహార్… తన పర్వర్షన్ గురించి మనం ఇక్కడ చెప్పుకోబోవడం లేదు… కాకపోతే తను హాట్‌స్టార్‌లో కాఫీ విత్ కరణ్ అని చాట్ షో చేస్తుంటాడు… పరమ చెత్త షోలలో ఇదొకటి… వచ్చే గెస్టుల అక్రమ సంబంధాలు, డేటింగులు, బ్రేకప్పులు, శృంగార అభిరుచులు, అసహజ బంధాల మీద ప్రశ్నలు వేస్తుంటాడు… సినిమాల ప్రమోషన్ ప్లస్ చాట్ షో ఒకేసారి జరుగుతూ ఉంటాయన్నమాట…
తన ప్రశ్నల సరళి, పైత్యం మీద చాలామందికి కోపం ఉంది… ఎవరో తాప్సిని అడిగారు… మీ దొబారా సినిమా ప్రమోషన్ కోసం కరణ్ షోకు వెళ్తారా అని… అబ్బే, నా శృంగార జీవితం అంత ఆసక్తికరంగా ఉండదులెండి అని చెప్పిందామె… జబర్దస్త్ పంచ్… ఒక్కమాటలో ఆ షో పైత్యాన్ని ఎండగట్టేసింది… ఇక అన్‌స్టాపబుల్‌కు వద్దాం… ఇద్దరూ సహజ నటులు… డౌన్ టు ఎర్త్… కష్టపడటం మీద నమ్మకం ఉన్నవాళ్లు… గంటసేపు చాట్ షో అయితే ముప్పావుగంట ఇదుగో ఇలాంటి లవ్వులు, బ్రేకప్పులు ఎట్సెట్రా ప్రశ్నలే… నడుమ బ్లడ్డు, బ్రీడు, సెల్ఫ్ డబ్బా ఎలాగూ తప్పదు కదా…
Ads
ఏమాటకామాట… హోటళ్లలో, ఫంక్షన్లలో మిగిలిన ఫుడ్ ప్యాక్ చేసి, రైల్వే బస్ స్టేషన్ల వద్ద పంచిపెట్టే ఓ వ్యక్తిని పరిచయం చేయడం బాగుంది… ఇది ఆ చాట్‌షోకు మరో కోణం… నిజానికి ఫస్ట్ సీజన్ అన్‌స్టాపబుల్ సూపర్ హిట్… సినిమాలు, సదరు గెస్టుల సరదా సంగతులు, బాలయ్య స్పాంటేనియస్ జోకులు… షో అదిరిపోయింది… సెకండ్ సీజన్ వచ్చేసరికి చంద్రబాబును తెచ్చి కూర్చోబెట్టాడు… పక్కదారి పట్టింది… తరువాత గెస్టులు దొరకడం లేదు… కష్టమ్మీద విష్వక్‌ను, సిద్దూను ఒక ఎపిసోడ్‌కు ఒప్పించారు… సేమ్, తిప్పలు పడి శర్వాను, శేషును ఒప్పించారు…
రష్మిక, నా క్రష్మిక అని గత ఎపిసోడ్‌లో అన్నాడు కదా… ఈసారి శర్వాతో ఓ ఫోన్ ఇప్పించి, అందులో రష్మిక అలియాస్ క్రష్మిక వీడియోలు బహూకరించారు షో నిర్మాతలు… స్క్రిప్టెడ్… తరువాత శర్వా ఓ సందర్భంలో… మీరు 100, 120 దాకా సినిమాలు చేసి ఉంటారు కదా… అంటే కనీసం 25, 30 మందినైనా చేసి ఉంటారు కదా అంటాడు శర్వా… అర్థమైంది కదా… మరో సందర్భంలో ‘‘కవర్ జేబులో పెట్టుకునే తిరుగుతుంటావా..?’’ అంటాడు బాలయ్య… డబుల్ మీనింగులు, స్ట్రెయిట్ ప్రశ్నలు… ఎక్కువ శాతం సంభాషణ ఇదే…
అంతేకాదు, బ్రేకప్పుకు ఓ నిర్వచనం కూడా చెప్పించారు బాలయ్యతో… ‘‘పనైపోగానే హ్యాండిస్తే బ్రేకప్పు’’ అట… ఫోన్‌లో ఎన్ని బిట్లున్నాయి..? ఎవరెవరిని ముద్దు పెట్టుకున్నవ్..? అసలు ముద్దు పెట్టుకోకూడదు అనుకునే హీరోయిన్ ఎవరు..? సాయిపల్లవి ని పడేయాలంటే ఏం చేయాలి..? అదితి హైదరి కథ ఏంటి…? ఇవన్నీ జస్ట్, ఉదాహరణలు… ఇలాంటి సంభాషణలే… నిజానికి ఇప్పటివరకూ బాలయ్య గీత దాటలేదు… తనకు తెలుసు అశ్లీలానికి, సరసానికి నడుమ గీత ఎంత సన్నగా ఉంటుందో… అంటే సరదా సంభాషణకు, రోత చాటింగుకు… చిలిపితనానికీ చికాకుతనానికీ తేడా తెలుసు… అందుకే జాగ్రత్తగానే ఉన్నాడు… కానీ జాగ్రత్త బాలయ్యా… అసలే కరణ్ జోహార్ల కాలం ఇది… ఈ గీత ఇక దాటకు… నువ్వసలే ఫ్యామిలీ బాలయ్యవు…!!
Share this Article