సినిమా అనేది ఓ వ్యాపారం… ప్రజాసేవ కాదు, ఛారిటీ అసలే కాదు… అన్నింటికీ మించి ఇండస్ట్రీ పదే పదే చెప్పుకునే కళాసేవ అస్సలు కాదు… ఎంత పెట్టాం, ఎంతొచ్చింది… ఇదే లెక్క… సో, జయాపజయాలు వస్తుంటాయి, పోతుంటాయి… జనానికి అన్నీ నచ్చాలనేమీ లేదు… కొన్ని అడ్డంగా తొక్కేస్తారు, కొన్ని అనుకోకుండా లేపుతారు…
గెలుపుతో ఎగిరిపడటం గానీ, ఫ్లాపుతో ఇంకెవరి మీదో పడి ఏడవడం గానీ తగవని గీతకారుడు ఉద్బోధించినట్టు గుర్తు… పెళుసు వ్యాఖ్యలకు, అనవసర వివాదాలకు పెట్టింది పేరుగా పేరుతెచ్చుకున్న విష్వక్సేనుడికి తన కొత్త సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మీద వచ్చిన నెగెటివ్ రివ్యూలతో ఎక్కడో కాలింది పాపం…
అసలే బాలకృష్ణ బాపతు నిర్వాకం రచ్చ రచ్చ అయ్యింది, నేషనల్ మీడియా దాకా వెళ్లింది… నిజమేమిటో గానీ ఇజ్జత్ పోయింది… సెలబ్రిటీలు, లెజెండ్లు పబ్లిక్ డొమెయిన్‌లో ఎంత హుందాగా ఉండాలో మళ్లీ చెప్పింది… సరే, విష్వక్సేనుడు ఏమంటాడంటే… ‘అసలు సినిమా చూడకుండానే రివ్యూలు రాశారు, ఉదయం అయిదారు గంటలకే రివ్యూలు పెట్టేశారు… అసలు బుక్‌మైషో రేటింగులకు టికెట్లు కొని చూసినవారే అర్హులనేలా రూల్స్ మార్చాలి, సంగీతం బాగాలేదన్నారు, మస్తుంది…’ ఇలా చెబుతూ పోయాడు…
Ads
గుడ్… రివ్యూ బాంబింగ్ అనేది ఈమధ్య కాలంలో ఓ నెగెటివ్ ట్రెండ్… పడని దర్శకులు, పడని హీరోలు, పడని నిర్మాతల్ని నష్టపరచడానికి కుట్రపూరితంగా, ప్లాన్‌డ్‌గా నెగెటివ్ రేటింగ్స్ వచ్చేలా చేయడం, నెగెటివ్ టాక్ స్ప్రెడ్ చేయడం, నెగెటివ్ రివ్యూలు రాయడం జరుగుతోంది… రీసెంటుగా విజయ్ దేవరకొండ దాని బాధితుడే… ఎస్, సినిమాలు చూడకుండానే క్యాంపెయిన్ నడిపించారు…
సినిమా రిలీజయ్యాక 2, 3 రోజుల దాకా రివ్యూలు రాకుండా చూడాలనే ప్రతిపాదన కేరళలో చర్చల్లో ఉంది, కానీ ఇంకా తుది తీర్పు ఏమీ రాలేదు… వచ్చినా అమలు కష్టం… సోషల్ మీడియా నియంత్రణ ఇప్పట్లో కష్టం… ఇక గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి విషయానికి వస్తే ఇప్పటికిప్పుడు విష్వక్సేన్ మీద నెగెటివ్ క్యాంపెయిన్ చేయాలనే కుట్ర, వ్యతిరేకత ఎవరికీ లేవు… తను ఇంకా వర్ధమాన హీరోయే కదా… తను టార్గెట్ చేయాల్సినంతగా ఇంకా ఓ రేంజుకు రాలేదు…
నిజానికి ఆ సినిమాలో ఏముంది..? ఏమీ లేదు..! జెన్యూన్ రివ్యూయర్లు కూడా రాసింది అదే… రేటింగ్స్ వదిలేయండి… ఒక ధర్మరాజు ఎంఏ కావచ్చు, ఒక రణరంగం కావచ్చు, మరేదో సినిమా కావచ్చు… చాలా పాత కథ… ఇలాంటి కథ తాను గతంలో చేశానని చెప్పి మొదట్లో శర్వానంద్‌ను అడిగితే తిరస్కరించాడని దర్శకుడే చెప్పినట్టున్నాడు… అలాంటి కథతో జర్నీ చేయడం విష్వక్సేన్ తప్పు…
లవ్ ట్రాకు ఇంప్రెసివ్‌గా లేదు… గోదావరి స్లాంగ్ కృతకం… అక్కడక్కడా బూతులు సరసరి… సంగీతం అందరికీ నచ్చేలా ఏమీ లేదు… సీన్ల మీద సీన్లు వస్తూ పోతాయి గానీ ఏదీ కనెక్ట్ కాదు… సో, నెగెటివ్ రివ్యూలకు హేతువుంది, బేస్ ఉంది… సినిమా చూసి వచ్చిన ప్రేక్షకుల రియాక్షన్ కూడా అదే… సో, కూల్ విష్వక్సేన్… ప్రతిసారీ అనుకూలమైన బొమ్మ పడాలని ఏమీ లేదు… నాణేలకు బొరుసులూ ఉంటాయి..! గవ్వలు విసిరిన ప్రతిసారీ అష్టా లేదా చెమ్మా పడాలని ఏమీ లేదు..!!
Share this Article