సింపుల్… ఇకపై ఓటీటీల్లో ఫ్రీగా సినిమాలు చూడవచ్చుననే భ్రమల్ని వదిలేసుకొండి… ఓటీటీల్లో కూడా డబ్బు పిండటం స్టార్టయిపోయింది… అదీ అల్లాటప్పాగా కాదు… థియేటర్ల దోపిడీని మించి…! మొన్ననే కదా ట్రిపుల్ఆర్ చూడాలంటే రాజమౌళి జీ5 ఓటీటీలో 100 రూపాయల టికెట్టు పెట్టాడు, వీరపిండుడు ఎక్కడా వదలడు అని తిట్టుకున్నాం… పైగా దానికీ ఆ ఓటీటీ వార్షికచందాకు ముడిపెట్టాడు… ఇద్దరమూ కలిసి ప్రేక్షకుల్ని కుమ్మేద్దాం అనుకున్నారు రాజమౌళి ప్లస్ జీ5….
అయితే అది క్లిక్ కావడానికి ఎన్ని చిక్కులున్నాయో కూడా మనం మొన్న ‘ముచ్చటించుకున్నాం’… మరి రాజమౌళి స్టార్ట్ చేశాక ఇక మిగతా నిర్మాతలు ఊరుకుంటారా..? ఇలాంటి పిండుడు పథకాలకు రాజమౌళే ఆద్యుడు, అందరూ తనను అనుసరిస్తారు… సేమ్, కేజీఎఫ్-2 నిర్మాతలు కూడా అదే బాట పట్టారు… దాన్ని అమెజాన్ ప్రైమ్‌లో పెట్టారు… కానీ చూడాలంటే బాటా చెప్పుల ధరలాగా 199 రూపాయలు కక్కాల్సిందే… ఆ సినిమా నిర్మాణవ్యయం 100 కోట్లు… ఆల్‌రెడీ 1200 కోట్లకు పైగా వసూలు చేసింది…
ఇంకా డబ్బు కావాలట… అదీ కనీవినీ ఎరుగని రీతిలో 199 రూపాయల టికెట్టు..! అందులో అమెజాన్ వాడికి ఎంత..? కేజీఎఫ్ నిర్మాతలకు ఎంత..? అనేది తెలియదు కానీ… ఓటీటీ సబ్‌స్క్రయిబ్ చేసుకున్నంత మాత్రాన సినిమాలు ఫ్రీగా చూడవచ్చుననే ప్రేక్షకుల ఆశల్ని కాల్చిపారేశారు… ఇక ఎవరు ఆగుతారు..? ప్రతి నిర్మాత ఇదే బాట పడతాడు… దిక్కుమాలిన సినిమాలకూ ఇదే సిస్టం పెడతారు… డబ్బు పే చేయి, సినిమా చూడు… పే పర్ వ్యూ… వీడియో ఆన్ డిమాండ్…
Ads
ఈ పరిణామం ఓటీటీల్లో సినిమా వీక్షణాల్ని కూడా తగ్గించేస్తుందా..? ప్రేక్షకులు సినిమాలను వదిలేసి ఇక వెబ్ సీరీస్ వైపు సీరియస్‌గా వెళ్లిపోతారా అనేది వేచిచూడాలి… కాకపోతే కేజీఎఫ్ నిర్మాతల నిర్ణయం ఖచ్చితంగా దోపిడీ వంటి ధరే… అది చెప్పడానికి ఏ గింజులాట అవసరం లేదు… మొబైల్‌లో ఓటీటీలో సినిమా చూడటానికి 199 కట్టాలా..? అసలు థియేటర్ ఎక్స్‌పీరియెన్స్‌లో అయిదు శాతమైనా మొబైల్ వాచింగులో వస్తుందా..?
థియేటర్ కలెక్షన్లయితే కనీసం పన్ను కడతారు… ఓటీటీలో అదీ అవసరం లేదు… వేళ్లలో కత్తెర్లు పెట్టుకున్నారుగా… జేబులు కత్తిరించండి… కమాన్…! పైరసీ పెరుగుతుందీ అంటే… ఎందుకు పెరగదు మరి..! అన్నట్టు, నిర్మలమ్మా… రాష్ట్రాలవారీగా వీళ్లు కలెక్షన్ల లెక్కలు చెప్పరు గానీ… ఓటీటీలో వీడియో ఆన్ డిమాండ్ ద్వారా చేసే వసూళ్లకూ జీఎస్టీ వేయవచ్చుగా…!! ఆ సాకుతో ఇంకెంత పెంచుతారో అదీ చూడొచ్చు…
Share this Article