.
ఆ వార్త చదవగానే పెద్దగా ఆసక్తి అనిపించలేదు, ఈమధ్య ఈ ధోరణి బాగా గమనిస్తున్నదే కాబట్టి… కానీ సంఘటనకు కారణాల్ని చదివితే మాత్రం సందేహాస్పదంగా అనిపించింది… పైగా ఆ ఫోటో చూడగానే కడుపులో దేవేసినట్టు అయ్యింది…
కాకినాడ ఓఎన్‌జీసీలో కొలువు చేసే వానపల్లి చంద్రశేఖర్ తన పిల్లలు సరిగ్గా చదవడం లేదనీ, ఈ పోటీ ప్రపంచంలో వాళ్లు నెగ్గుకురాలేరనీ ఓ సూసైడ్ నోట్ రాసి…పిల్లలిద్దరి కాళ్లూ కట్టేసి, తలల్ని బాత్‌రూమ్‌లో నీళ్ల బకెట్లలో ముంచి, చంపేసి… తరువాత తనూ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని వార్త… ఆ సమయంలో భార్య తనూజ మాత్రం ఈ నేరం జరిగినప్పుడు అక్కడ లేదు…
Ads
ఆ సూసైడ్ నోట్‌లో అలా ఉందని పోలీసులు చెప్పారు కదా, ఇక అదే కారణమని మీడియా రాసేసింది… కానీ ఓ సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీలో జాబ్, సొంత ఇల్లు, అప్పుల్లేవు, ఆస్తిపాస్తులున్నాయి… ఆఫ్టరాల్ ఒకటో క్లాసు, యూకేజీ చదివే పిల్లల చదువులు అనే సాకుతో వాళ్లను చంపి, తను సూసైడ్ చేసుకుంటాడా..? ఇది నమ్మేట్టుగా ఉందా..?
సరే, పిల్లలు తన ఎక్స్‌పెక్టేషన్స్ మేరకు చదవలేకపోతున్నారు… వాళ్లను క్రూరంగా చంపేశాడు, నిజమే అనుకుందాం కాసేపు, మరి తనెందుకు చనిపోయాడు..? భార్యను ఎందుకు వదిలేశాడు..? ఓ నేర వార్త రాసేముందు తలెత్తాల్సిన కీలక సందేహాలు ఇవి… అసలు ఆ సూసైడ్ నోట్ నిజమైందేనా..? పొద్దున్నుంచీ ఫాలో అప్ వార్త కనిపిస్తుందేమోనని చూస్తే కనిపించలేదు ఎక్కడా…
మావాడి మనస్తత్వం ఆత్మహత్య చేసుకునేంత దుర్బలం కాదని తన సోదరుడు చెబుతున్నాడు… అసలు నిజం వేరే ఏదో ఉంది..? అది బయటికి రావల్సి ఉంది… చూద్దాం, రాకపోదు… ఐతే ఇక్కడ మరణాలు మాత్రం నిజం… కారణాలు సందేహం… అంతే… ఏపీ పోలీసులు ఈ నిజాల్ని బయటపెట్టగలరా..? చూద్దాం…
ఆ పిల్లల్ని చంపేసిన ఫోటో ఒకటి ఇక్కడ పబ్లిష్ చేస్తున్నందుకు పాఠకులు నన్ను క్షమించాలి… కానీ నేర తీవ్రత తెలియాలి…
అవును… సామూహికంగా కుటుంబమంతా కలిసి ఆత్మహత్యలు చేసుకునే ధోరణి చాన్నాళ్లుగా ఉన్నదే… తల్లిదండ్రుల మానసిక దౌర్బల్యానికి ఫస్ట్ బలయ్యేది పిల్లలు… మేమే పోయాక మా పిల్లల గతేమిటనే ఓ ప్రేమపూర్వక ఆలోచనే కావచ్చుగాక, అదే పిల్లల ఉసురు తీస్తోంది…
ఈ ధోరణులు ఓ మానసిక వైకల్యమే అంటారు సైకాలజిస్టులు… ఇంకా చర్చ జరగాలి… పాపం, పిల్లల్ని వదిలేయండర్రా… ఎలాగో బతుకుతారు, ఎవరో కరుణిస్తారు… ఏమో… వాళ్లలో దేశం గర్వపడే స్థాయికి కూడా వెళ్లే వాళ్లున్నారేమో… ఈరోజు ఆంధ్రజ్యోతిలో ఇదే అంశంపై ఓ స్టోరీ బాగుంది చదవండి… (ఈ కేసు కాదు)…
Share this Article