పార్ధసారధి పోట్లూరి …… మూడవ ప్రపంచ యుద్ధం – అప్డేట్ 2. అమెరికా – దక్షిణ కొరియాలు కలిసి దక్షిణ కొరియా గగనతలం మీద 100 కి పైగా యుద్ధ విమానాలతో మాక్ డ్రిల్ నిర్వహించాయి 24 గంటలపాటు ఆపకుండా ! వారానికోకసారి ముందస్తు సమాచారం లేకుండా ఉత్తర కొరియా బాలిస్టిక్ మిసైళ్ళ ని ప్రయోగిస్తుండడం అమెరికా, దక్షిణ కొరియాల ప్రతి చర్య అని భావిస్తున్నారు!
గత కొన్ని నెలలుగా కొరియా ద్వీప కల్పం ప్రాంతంలో తరచూ ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటూ వస్తున్నాయి. ఉత్తర కొరియా ఇప్పటికే మూడు బాలిస్టిక్ మిసైల్ ప్రయోగాలు నిర్వహించింది. అవి అణు బాంబులని కలిగి ఉన్నాయా లేవా అనే భయం నిత్యం వెంటాడుతూ ఉన్నది ఉత్తర కొరియా మిసైల్ ప్రయోగించినప్పుడల్లా ! ఒక దశలో దక్షిణ కొరియాలో సైరన్లు మోగించి ప్రజలని అప్రమత్తం చేయాల్సిన స్థితి వస్తున్నది.
గత సెప్టెంబర్ నెలలో ఉత్తర కొరియా ఎలాంటి కవ్వింపు చర్యలు చేయకున్నా జపాన్ గగనతలం మీదుగా బాలిస్టిక్ మిస్సైల్ ని ప్రయోగించింది కానీ అది పసిఫిక్ మహా సముద్రంలో కూలిపోయింది. అయితే ఉత్తర కొరియా ఇలాంటి కవ్వింపు చర్యలకి పాల్పడుతున్నది కేవలం రష్యా, చైనాల ప్రోద్బలంతో అని దక్షిణ కొరియా, జపాన్, అమెరికాలు భావిస్తున్నాయి. కొన్ని నెలలపాటు ఇలా ఎలాంటి వార్ హెడ్ లేని షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిస్సైళ్లని ప్రయోగించి హఠాత్తుగా న్యూక్లియర్ వార్ హెడ్ ఉన్న మిస్సైల్ ని ప్రయోగిస్తే ? ఇప్పుడు ఉన్న భయం ఇదే !
Ads
ఇక చివరకి ఇలా ఉపేక్షిస్తూ పోతే ప్రమాదం అని భావించిన దక్షిణ కొరియా అమెరికాలు వరుసగా నాలుగు రోజుల పాటు కొరియా ఎయిర్ స్పేస్ పైన యుద్ధ విన్యాసాలు చేయాలని నిర్ణయం తీసుకొన్నాయి. నవంబర్ 1 వ తేదీ నుండి నవంబర్ 4 వ తేదీ వరకు విరామం లేకుండా ఫైటర్ జెట్స్ తో యుద్ధ విన్యాసాలు చేయడం మొదలుపెట్టాయి. విజిలెంట్ స్ట్రామ్ [Vigilant Storm] పేరుతో కొనసాగుతున్న ఈ విన్యాసాలలో అమెరికన్ మరియు కొరియన్ ఫైటర్ జెట్లు కలిసి విన్యాసాలు చేస్తున్నాయి.
దక్షిణ కొరియా 140 జెట్ ఫైటర్స్ లలో F-15K,F-16, F-35A స్టెల్త్ లు ఉన్నాయి. అమెరికా KC135 టాంకర్స్, U-2 హై ఆల్టీట్యూడ్ రికాన్ నిఘా విమానం, EA-18 ఎలెక్ట్రానిక్ వార్ ఫేర్ విమానాలు, జపాన్ లోని వకినావ ఎయిర్ బేస్ లో ఉన్న F-35B స్టెల్త్ ఫైటర్స్ ని సియోల్ కి తరలించి విన్యాసాలలో పాల్గొంటున్నది. ఈసారి ఉత్తర కొరియా ఏ మాత్రం సమాచారం ఇవ్వకుండా బాలిస్టిక్ మిసైల్ ప్రయోగం చేస్తే మాత్రం దక్షిణ కొరియా, అమెరికాలు విరుచుకుపడే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
ఉత్తర కొరియా దగ్గర ఒక్క అణ్వస్త్ర బాలిస్టిక్ మిసైల్స్ ఉన్నాయి అని తప్పితే మిగతా ఆయుధాలు రెండవ ప్రపంచ యుద్ధ కాలం నాటివి. మరి కొన్ని సోవియట్ యూనియన్ మనుగడలో ఉన్న కాలం నాటివి . మూడు గంటలు చాలు ఉత్తర కొరియాని స్వాధీనం చేసుకోవడానికి దక్షిణ కొరియా అమెరికాల సంయుక్త సైన్యానికి.
2022 లో మొత్తం 28 బాలిస్టిక్ మిసైల్స్ ని ప్రయోగించింది ఉత్తర కొరియా గత వారం క్రితం ప్రయోగించిన 2 మిస్సయిళ్లతో కలిపి. నిజానికి ఏదన్నా బాలిస్టిక్ మిసైల్ ప్రయోగం చేస్తున్నప్పుడు పక్క దేశానికి ఆ ప్రయోగం తాలూకు వివరాలు తెలియచేయాలి కనీసం 3 రోజుల ముందు. కానీ ఉత్తర కొరియా ఈ నిబంధనలని ఏ మాత్రం ఖాతరు చేయకుండా ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఈ సంవత్సరంలో ఇప్పటివరకు 28 బాలిస్టిక్ మిసైల్స్ ని ప్రయోగించింది. పోయిన నెలలో ఒక మిసైల్ జపాన్ మీదుగా వెళ్ళింది. జపాన్,దక్షిణ కొరియాలు తీవ్ర ఆందోళనలో ఉన్న సమయంలో ప్రస్తుతం 4 రోజుల పాటు సైనిక, వైమానిక, నౌకా విన్యాసాలు చేస్తున్నాయి.
మరో వైపు ఆస్ట్రేలియా తన మిడ్ ఎయిర్ ఫ్యూయెల్ టాంకర్స్ ని సియోల్ కి పంపించింది తన వంతు సహాయంగా ! ఈ చర్య ఎలా చూసిన యుద్ధ సన్నద్ధతని సూచిస్తున్నది ! అయితే అమెరికా, జపాన్, దక్షిణ కొరియాల ఆందోళన కేవలం అణ్వస్త్ర బాలిస్టిక్ మిసైల్స్ తో పాటు అక్టోబర్ మొదటి వారంలో ఉత్తర కొరియా కొరియన్ పెనిన్సులా సముద్రంలో తన వైమానిక దళంకి చెందిన Su-25, MiG-29, MiG-23, MiG-21, and MiG-19 ల తో విన్యాసాలు నిర్వహించింది. అంతటితో ఆగకుండా రెండు బాలిస్టిక్ మిసైళ్ళని ప్రయోగించింది ఎలాంటి సమాచారం లేకుండా! ఇది పిచ్చి చర్య ! ఉత్తర కొరియా ఏ మాత్రం దక్షిణ కొరియా, అమెరికాల ముందు మూడు గంటలు కూడా నిలబడి యుద్ధం చేయలేదు ఒక వేళ పూర్తి స్థాయి యుద్ధం అంటూ జరిగితే !
ఉత్తర కొరియా దగ్గర ఉన్న యుద్ధ టాంకులు, ఆర్టీలరీ లు అన్నీ సోవియట్ కాలం నాటివి. అంటే 35 ఏళ్ల పాతవి. మరి కొన్ని 40 ఏళ్ల పాతవి. ఇక యుద్ధ విమానాలలో ఒక్క Mig-29 లు మాత్రమే కొద్దో గొప్పో నిలబడగలిగేవి. అదీ కొద్ది గంటల పాటు మాత్రమే పోటీని ఇవ్వగలవి.
ప్రస్తుతం అమెరికా తన U-2 హై ఆల్టీట్యూడ్ రికాన్ విమానాన్ని సియోల్ కి తరలించడంలోని ఆంతర్యం చాలా స్పష్టంగా కనిపిస్తున్నది. భూమి మీద నుండి 80 వేల ఆడగుల ఎత్తులో ప్రయాణిస్తూ U-2 భూమి మీద ఉన్న టార్గెట్ లని చాలా స్పష్టంగా ఫోటోలు తీయగలదు. అలాగే 80 వేల అడుగుల ఎత్తులోకి వెళ్ళి దాడి చేయగల మిసైళ్లు ఉత్తర కొరియా దగ్గర లేవు కాబట్టి, ముందు బాలిస్టిక్ మిసైల్ లాంచ్ చేసే ప్రదేశాలని ఫోటోలు తీసి, ఆపై అమెరికా తన F-35 లతో వాటిని ధ్వంసం చేసిన తరువాత, నేరుగా భూమి మీద ఆకాశ మార్గాన ఉత్తర కొరియా మీద దాడి చేయవచ్చు. ఆ ప్రాంతం మీద పట్టు ఉన్న దక్షిణ కొరియా పైలట్లు అమెరికాకి సహాయంగా ఉంటారు కాబట్టి మొదలు పెట్టిన మూడు గంటలలోనే ఉత్తర కొరియా ఎయిర్ స్పేస్ ని తన అధీనంలోకి తీసుకోగలదు అమెరికా !
ఉత్తర కొరియా ఒకవేళ రహస్యంగా ఏదన్నా యుద్ధ ఒప్పందం చైనా, రష్యాతో చేసుకొని ఉండి ఉంటే అది ఖచ్చితంగా తీవ్ర పరిణామాలకి దారి తీయవచ్చు. అయితే ఇక్కడ రెండు అడ్డంకులు ఉన్నాయి. మొదటిది రష్యా ఉక్రెయిన్ తో యుద్ధo చేస్తూ తలమునకలుగా ఉంది కాబట్టి ఇప్పటికిప్పుడు ఉత్తర కొరియా విషయంలో జోక్యం చేసుకోకపోవచ్చు. ఒక వైపు నల్ల సముద్రం లో తన ఆధిపత్యం నిలబెట్టుకుంటూ మరో వైపు సిరియా దగ్గర మధ్యధరా సముద్రం మీద సిరియాకి రక్షణగా ఉన్న తన యుద్ధ నౌకలని కాపాడుకుంటూ ఉత్తర కొరియాకి మద్దతుగా రష్యా ఉండలేకపోవచ్చు. రెండవది చైనా! చైనాలోని చాలా ప్రావిన్స్ లలో మళ్ళీ కొత్త రకం కోవిడ్ వేరియంట్ తీవ్రంగా విజృంభిస్తున్నది కాబట్టి చైనా ముందుకు రాకపోవచ్చు. ఒక వేళ చైనా అలా చేస్తే మరో వైపు తైవాన్ దగ్గర అమెరికా చికాకులు సృష్టించే అవకాశం ఉంది. ఇలా రష్యా, చైనాలకి రెండు వైపులా ఇబ్బందులు ఉన్న సమయంలో ఉత్తర కొరియా పని పట్టే అవకాశాన్ని అమెరికా ఒదులుకోదు.
వోలోదిమిర్ జెలెన్స్కీ – జో బిడెన్ ల మధ్య ఘర్షణ !
తాజాగా జెలెన్స్కీ అమెరికా మాకు తగినంత సహాయం చేయట్లేదు అంటూ విమర్శలు చేయడం మొదలుపెట్టాడు. పుతిన్ తన కుబ్ బ్లా డ్రోన్ల తో పాటు క్రూయిజ్ మిస్సైళ్ల తో మళ్ళీ విరుచుకుపడుతున్నాడు. ఈ సారి ఉక్రెయిన్ రాజధాని కీవ్ ని లక్ష్యంగా చేసుకొని మంచినీళ్ళ సరఫరా మరియు కీవ్ ని కలిపే ప్రధాన రోడ్ల ని ధ్వంసం చేస్తున్నాడు. ఇప్పటికే కీవ్ లో జెనరేటర్స్ లో విద్యుత్ వాడుకోవాల్సిన స్థితిని కల్పించాడు పుతిన్ !
దీని మీద జెలెన్స్కీ అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ని టార్గెట్ చేస్తూ మాకు అర కొర సహాయం చేస్తే రష్యాతో ఎలా యుద్ధం చేస్తాం అంటూ ప్రశ్నిస్తున్నాడు ప్రెస్ మీట్ పెట్టి మరీ ! డానికి జవాబుగా జో బిడెన్ ముందు ఇప్పటివరకు చేసిన సహాయానికి కృతజ్ఞత చూపించాలి అంటూ జెలెన్స్కీ ని ఎత్తి పొడిచాడు బిడెన్ ! ఇలా మొదటి సరిగా అమెరికా, ఉక్రెయిన్ ల మధ్య విభేదాలు బయటికి వచ్చాయి.
ఉక్రెయిన్ పాకిస్థాన్ సహాయంతో డర్టీ బాంబ్ తయారుచేయడానికి సన్నాహాలు చేస్తున్నది – పుతిన్.
గత కొంతకాలంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ జెలెన్స్కీ ని ఉద్దేశించి ఉక్రెయిన్ డర్టీ బాంబ్ లని మా మీద ప్రయోగించడానికి సన్నాహాలని చేస్తున్నది అంటూ ఆరోపిస్తూ వచ్చాడు ! పుతిన్ కి ఇంటెలిజెన్స్ ఇన్పుట్ లేకుండా అలా మాట్లాడడు! డర్టీ బాంబ్ అంటే శుద్ధి చేయని యురేనియంని మామూలు పేలుడు పదార్ధాలతో కలిపి తయారుచేస్తారు. ఇలాంటి పేలుడు పదార్ధము యుద్ధ టాంక్ లలో వాడే షెల్స్ లోకి చొప్పించి, వాటిని శత్రు దేశం మీద ప్రయోగిస్తారు. దీని వల్ల స్వల్ప ప్రాంతంలో కొద్ది పాటి రేడియేషన్ ప్రభావం ఉంటుంది. అదే వరుసగా వందల షెల్స్ ని ప్రయోగిస్తే అది ఇంకొంచెం ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. అయితే వీటిని గైడెడ్, ఆన్ గైడెడ్ రాకెట్లతో కూడా మరింత దూరం ప్రయోగించవచ్చు. ఇప్పటికే అమెరికా ఇచ్చిన హిమార్స్ రాకెట్ లు ఉక్రెయిన్ దగ్గర వేలల్లో ఉన్నాయి. ఉక్రెయిన్ పాకిస్థాన్ ని శుద్ధి చేయని లేదా అణు విద్యుత్ కేంద్రాలలో వాడేసిన అణు వ్యర్ధాలని సప్లై చేయమని అడిగినట్లు ఆరోపిస్తున్నాడు పుతిన్ !
అయితే ఇప్పటికే ఉక్రెయిన్ యుద్ధ టాంకులు కోసం వాడే షెల్స్ ని పాకిస్థాన్ సప్లై చేసినట్లు నిరూపించే ఆధారాలు పుతిన్ దగ్గర ఉన్నాయి. షెల్స్ పాకిస్థాన్ లోని ఆయుధ ఫాక్టరీలలో తయారయినట్లు తెలిపే గుర్తులు వాటి పై భాగంలో ముద్రించి ఉన్నవి రష్యాకి దొరికాయి. పుతిన్ ఆరోపణలని తేలికగా తీసుకోకుండా అంతర్జాతీయ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీ [IAEA] దర్యాప్తు చేయాలని నిర్ణయించింది. ఒక వేళ పుతిన్ ఆరోపణలు నిజమని తేలితే IAEA రిపోర్ట్ ని బట్టి పాకిస్థాన్ మరియు ఉక్రెయిన్ ల మీద తీవ్ర ఆంక్షలని విధించే అవకాశం ఉంది…!!
Share this Article