.
సరే, పోలీసులు ఎన్ని చెప్పినా… ఎంతమందిని మొహరించినా… కొత్త సంవత్సరంవేళ జనం తప్పతాగుతూనే ఉంటారు… రోడ్లపైకి తూలుతూ వస్తూనే ఉంటారు…
నిన్న రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కొన్ని వేల కేసులు నమోదయ్యాయి… నాలుగు పెగ్గులు పడ్డాక నన్నెవడు పట్టుకుంటారనే ధీమా కాదు, అసలు పట్టుకోవడం ఏమిటి అనేదే సోయిలోకి రాదు… అది మందు మహత్తు.,.
Ads
ఒకరు మాత్రం ఫుల్లు వైరల్ అయిపోయాడు… అంతా ఇంతా కాదు… ఏకంగా 550 రీడింగ్ చూపించింది టెస్టు చేస్తే… ఆ టెస్ట్ చేసినవాడికి రెండురోజులపాటు తాగినా కిక్కు ఎక్కనంత షాకు అది…
రాత్రి నుంచే బోలెడు సోషల్ పోస్టులు… ట్రాఫిక్ పోలీసులు ఇచ్చిన టెస్ట్ రిజల్ట్ ఇమేజ్ పెట్టి మరీ… అఫ్‌కోర్స్, సదరు వ్యక్తిని టెస్టు చేస్తున్న ఫోటోలు కూడా వచ్చాయి, కానీ వద్దులెండి, తాగేవాడికీ ప్రైవసీ హక్కు ఉంటుందట, నిన్న ఇంట్లోనే ఆరు పెగ్టులు కొట్టిన ఓ మహానుభావుడు చెప్పాడు…
రాత్రి ఏడు నిమిషాలు తక్కువ పదకొండు గంటలు… ఎహె, కొత్త ఏడాది రావడానికి ఇంకా గంట టైమ్ పైనే ఉంది… ఐతేనేం, తాగిన మత్తులో ఒక గంట తొందరపడ్డాడు… ఏడాది వచ్చేదాకా నేనెందుకు ఆగాలి అనుకుని, బయల్దేరాడు…
అసలే డ్రంకెన్ డ్రైవ్ క్యాచుల మీద కసికసిగా ఉన్న పోలీసులు పెట్టేసుకుని ఇదుగో ఇలా తేల్చేశారు… బండి స్వాధీనం చేసుకుని, చేసుకున్నట్టు రిసీట్ రాసిచ్చి, ఇక పోరా భయ్ అని దండం పెట్టారు… ఫాఫం, ఆ స్థితిలో ఇంటి దాకా ఎలా వెళ్తాడనే కనికరం, ఆలోచన కూడా లేదు… పోలీసులెప్పుడూ క్రూరులే అనుకుని ఎలా పోయాడో గానీ…
ఆ టెస్ట్ రిజల్ట్ వైరల్ అయిపోయింది… మామూలుగా 50 దాటితేనే బుక్ చేస్తారు కదా… ఈయన రిజల్ట్ 550 చూపించింది… మామూలుగా ఒక స్మాల్ బీర్ లేదా ఒక స్మాల్ పెగ్ దాటితేనే 50 దాకా చూపిస్తుంటుంది… మరి 550 రీడింగ్ అంటే, ఎంత తాగి ఉంటాడు అని ఒకటే చర్చలు సోషల్ మీడియాలో… కాస్త జాలితో, కాస్త అభినందనతో…
సరే, తిట్టేవాళ్లు ఎలాగూ తిడతారు గానీ… అసలు ఎంత తాగితే 550 చూపిస్తుంది అనేది చర్చ… నిజానికి ఈ రీడింగ్ కారణాలు రకరకాలు… ఎంత తాగావు అనేది ముఖ్యమే కానీ… తాగి ఎంతసేపైందనేదీ ముఖ్యమే గానీ… ఆ వ్యక్తి బాడీ కానిస్టిట్యూషన్, రెండు రోజులుగా తను తీసుకున్న డైట్, రక్తంలోకి ఎంతగా చేరింది వంటి చాలా కారణాలుంటాయట…
అసలు ఆ వ్యక్తి అంత తాగడానికి కారణమైన భౌతిక, మానసిక, సోషల్, ఫ్యామిలీ మ్యాటర్స్ మీద ఎవరికీ జాలి ఉండదు… తాగాడా లేదానేదే చూస్తుంటారు, ఈ సొసైటీ ఎంత క్రూయల్ అని జాలిపడేవాళ్లు కూడా ఉంటారు గానీ… తరువాత ఏమిటి..?
ఏముంది..? ముందు కౌన్సెలింగ్… దానికి హాజరైతే మళ్లీ న్యూ ఇయర్ వరకూ తాగకూడదనేంత వైరాగ్యం… తరువాత ఏదో కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు… బుక్ చేశారు సరే, మరి బండి ఎవడు సీజ్ చేయమన్నారు అని కూడా న్యాయమూర్తి పోలీసులనే ఉల్టా అడగొచ్చు… నేరం మొదటిసారా..? రెండోసారా..? పలుసార్లా..? ఈ ప్రాతిపదికతో ఓ పదివేలు జరిమానా కూడా వేయొచ్చు, లేదా జైలుకు కూడా పంపించొచ్చు… ఎందుకో ఈమధ్య జైలు శిక్షలు తగ్గాయట…
సపోజ్, ఆ బండి పాతది అయి ఉంటే, ఆ పదివేలు ఎవడు కడతాడు అనుకుని ఇక సదరు వ్యక్తి మళ్లీ పోలీసుల జోలికి పోకపోవచ్చు… అలాంటి వాహనాలు హైదరాబాదులోనే కొన్ని వందలు… పోనీ, డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తారంటారా..?
రెన్యువల్ కోసం మళ్లీ ఎన్నేళ్లకో ఆర్టీవో ఆఫీసుకు పోతే కదా, సదరు లైసెన్స్ రద్దు చేసినట్టు ఉండేది… అడ్డుపడేది… ఆ వ్యక్తి దగ్గర డూప్లికేట్ డీఎల్ కార్డు ఉంటే సరి… చల్తా… ఫలానా లైసెన్స్ రద్దు చేసినట్టు కార్డు మీద ప్రింట్ చేయరు కదా… ఇదుగో ఇన్ని ఉంటాయి ఈ 550 రీడింగ్ చుట్టూ..! సీరియస్‌గా ఆలోచించకండి, రాత్రి తాగింది ఠక్కున దిగిపోతుంది…!!
అవునూ, రాత్రి పన్నెండు గంటలకే కొత్త సంవత్సరం వస్తుందని ఎవరు చెప్పారు..? నాన్సెన్స్… ఉదయం బార్ తెరిచేవేళకు ఛడావ్ స్టార్ట్ చేస్తే, రోడ్డు మీదకు వచ్చి ఊగినా, తూగినా, తూలినా ఎవడూ పట్టించుకోడు… పట్టుకోవాల్సిన వాళ్లకూ ఫాఫం కొత్త ఏడాది కదా… వాళ్లకూ కొత్త ఏడాదికి స్వాగతం పలికే పని ఉంటుంది కదా… ఎక్కడో బిజీగా ఉండే ఉంటారు…!! లేదా బుక్ చేసీ చేసీ అలిసిపోయి ఉంటారు..!!
Share this Article