Abdul Rajahussain….. *నిషా ఖుషీ కావ్యం ….”మేమే “ !! తాగినంత తాగి, రాసినంత రాసిన…. ‘కవిత్రయ’ కావ్యమ్ !! ఓ ముగ్గురు కవులు ఓ చోట చేరితే ఏమవుతుంది? అందులో ‘ గ్లాస్ ‘ కల్చర్ వున్న కవులైతే ఏం జరుగుతుంది? గ్లాసులు “ఛీర్స్” చెప్పుకుంటాయి. ‘మాస్’ కవిత్వం పుడుతుంది. పెగ్గు పెగ్గుకీ మధ్య, సిప్పు సిప్పుకీ మధ్య కవులు అక్షరాల్ని నంజుకుంటారు. ఈలోగా ఓ పద్యం పుడుతుంది… అలా పుట్టిన పద్యాలన్నీ కలిసి ఓ ‘కావ్యం’ అవుతాయి…
ఇంతకూ ఎవరా కవులు ? ఏమా కథ ? అనుకుంటున్నారు కదా! ఆ ముగ్గురిలో ఒకరు శ్రీశ్రీ, ఇంకొకరు ఆరుద్ర, మరొకరు అబ్బూరి వరద రాజేశ్వర రావు. ఈ ‘గ్లాస్ ‘త్రయం… సారీ ! ….ఈ “ కవిత్రయం “ డిసెంబర్ 1953లో అబ్బూరి వరదరాజేశ్వరరావు ఇంట్లో ‘సిట్టింగ్ ‘ వేసిన సందర్భంగా, ముగ్గురూ కలిసి రాసిన ‘ చౌ..చౌ..చౌ ‘ ‘టుమ్రీ‘ కావ్యమే “ మేమే “,తెలుగు సాహిత్యంలో ఇదో అపురూప ప్రయోగం. ముగ్గురు కవులు కలిసి చేసిన అపు
రూప ప్రయోగం.1954 జూలై లో ప్రచురితమైంది. (త్రిలింగ పబ్లిషింగ్ కంపెనీ ) ఈ కావ్యాన్ని తమలో ఒకరైన ఏల్చూరి సుబ్రహ్మణ్యంకు అంకితం
ఇచ్చారు.
ఇందులో తమాషా ఏమంటే ఆరుద్రలోని చివరి అక్షరం “ద్ర “ .. వరద లోని మొదటి అక్షరం “ వ “ “శ్రీశ్రీ లోని చివరి అక్షరం “ శ్రీ “ ..కలిపి “ ద్రవశ్రీ “ చేశారు. ఆ ‘ద్రవమే ‘ ఈ కావ్యానికి ‘జీవం’ పోసింది. ఏల్చూరి సుబ్రహ్మణ్యానికే ( ఏ సు )ఎందుకంకితం ఇచ్చారంటే… ఈ ముగ్గురిలో కాస్తంత ఎక్కువ “రా “ తాగే స్టామినా ‘ఏ సు ‘ కే వుంది కాబట్టి…!!
“రాసిందేదో రాశాం, తీసుకొనుము తోచినంత తీపో చేదో సీసాపయినేగా మన ధ్యాస హమేషా, గళాసు దాల్చిన ఏసు “ ”ఏ సోడా ఏ నీళ్ళూ
వీసం కూడా కలపక విస్కీ సౌనాయాసంగా ఔపోసన చేసేస్తావోయ్ సెబాసు శ్రీమాన్ ఏసూ “! ”వేసాల మారి లోకపు మోసాలను తాగి తాగి మూర్ఛిల్లిన ఈ కాసింత కావ్య పాత్రకు, జీససు నీవై కళాసు చేద్దూ ఏసూ, ఏల్చూరి సుబ్రహ్మణ్యానికి “ !!
ఓ నిషా ఖుషీ కావ్యాన్ని అంకితం తీసుకునేందుకు ఇంత కంటే ఏం అర్హతుండాలి. అందుకే ఏసుకు ఈ కావ్యాన్ని ఆనందో బ్రహ్మ అంటూ అంకితం చేశారు. ఈ కవిత్రయం కలిసి రాసినవి మధ్య మధ్య కొన్ని మార్పులూ, చేర్పులూ జరిగాయి. వరద రాసిన పద్యాల్లో కొన్నిటిలో శ్రీశ్రీ తప్పులు
దిద్దారు. మొత్తం మీద మద్యం మత్తులో సరదా సరదాగా ఈ … కావ్యమ్ (మేమే ) పురుడుపోసుకుంది. సాహిత్య చరిత్రలో అపూర్వ (మందు) ఘట్టం ఆవిష్కృతమైంది.!!
మన సాహిత్యంలో పోతన లాంటి హాలికులైన కవులున్నారు. శ్రీశ్రీ లాంటి ఆల్కహాలికులైన కవులూ వున్నారు. *కవులు హలికులైన నేమి? అన్నాడు పోతన. ఆల్కహాలికులైన నేమీ..అంటారు శ్రీశ్రీ !! ఈ కవిత్రయంలోని కవులు అభ్యుదయ వాదులే. అభ్యుదయ కవిత్వం రాసినవాళ్ళే. ఎప్పుడూ సీరియస్ పొయిట్రీయేనా. ? “రిలాక్స్ “ అవడానికి ఇలాంటి ఆటవిడుపు. ‘ టుమ్రీ ‘ కవిత్వం రాయాలనిపించిందేమో?
అసలే కవులు.. ఆపై మందులో వున్నారు. ఇక ‘సీన్ ‘ ఎలా వుంటుందో. ఓ లుక్కేసుకోండి.
” కొత్త పుస్తకం తెరుద్దాం
కోతి చేష్టలు మరుద్దాం
కొంగ జపం చెయ్యడం
పొరుగు బరువు మొయ్యడం
ఎలాగైన ఇప్పటికైనా అమలుపరుద్దాం.
*సిరి సిరి మువ్వలం
చెరిగిన దవ్వులం
మృత్యువు పెరట్లో
మందార పువ్వులం
భగవంతుని వితంతువులం
కరుణకు మా బ్రతుకు
కవనం మా మెతుకు”.!!
ఈ కవిత్వానికి ఓ లాజిక్కంటూ ఏం వుండదు. యతి, ప్రాసల మ్యాజిక్ వుంటే చాలు. చిత్తుగా తాగినోడి నోటి వెంట ఏం వస్తుంది? మతిమాలిన మాటలు,గతి తప్పిన భావాలు. ఇదీ అంతే. “కుట్టే ఉల్లిపాయలం… కొండల మధ్య లోయలం “ ఈ రెంటి మధ్య సంబంధం ఏం వుండక పోవచ్చు,
అంత్య ప్రాసలు కలిస్తే అంతే చాలు. ఈ కావ్యమంతా అంత్యప్రాసల వంటకమే. “కాలికి మట్టెలం.. కాలని కట్టెలం “.”భగవంతుని చిరునామాలం.. పగలు రేల పరిణామాలం” “చెట్టపట్టాలం..ఫ్యాక్టరీ గొట్టాలం “…సంచితార్థపు సంచులం… చూడ్డానికి చుంచులం ,”..
ఇక అధివాస్తవికతకు,, అరాచకత్వానికి కూడా ఈ కావ్యంలో పెద్దపీట వేశారు .
“అక్షయపాత్రలో ఉమ్మేద్దాం
మక్షికాన్ని మింగి తుమ్మేద్దాం
ప్రమాణం మీద ప్రమాణం బోర్లించి
ప్రయాణం మీద ప్రయాణం దొర్లించి
తెలిసిపోయిన రహస్యాన్ని
తెల్ల బజారులో అమ్మేద్దాం
తెరిపి లేని జడి వానలం
వెరపు లేని పసి కూనలం “…
కళ్ళకద్దుకునే పవిత్రమైన అక్షయ పాత్రలో ఎవరైనా ఉమ్మేస్తారా? కవుల అప్పటి మానసిక పరిస్థితి ఇది. మత్తులో చిత్తయి ఊగే మనసుకు ఏది మంచో? ఏది చెడో అన్న విచక్షణ వుండదు.
మనసు అదుపు తప్పి, గతిమాలుతుంది అప్పుడు ఇదిగో ఇలా..! అరాచకత్వం రాజ్యమేలుతుంది. తెలిసిపోయిన రహస్యాన్ని ఎవరైనా నల్లబజారులో అమ్ముతారు.వీళ్ళేమో తెల్లబజారులో అమ్ముతారట.విచక్షణ మరిచినపుడు ఇలానే… ఆలోచనలు గతి తప్పుతాయి. “రాకెట్లకి జాకెట్లు కుట్టిద్దాం…చీకట్ల పాకెట్లు కొట్టేద్దాం..”.వంటి కార్యకారణ సంబంధం లేని పిచ్చి ప్రయోగాలకు ఈ కావ్యం అక్షయపాత్ర లాంటిది. అలాగే…
“పోస్టు చెయ్యని జాబులం,.. అట్టలు లేని కితాబులం “వంటి ప్రయోగాలు “వ్యర్ధాన్ని తప్ప ఏ అర్థాన్ని సూచించడంలేదు. మొత్తం మీద ఓపికుంటే ఓసారి సరదాగా చదివి, వెంటనే మరిచిపోయినా ఫరవాలేదనుకునే టుమ్రీ కావ్యమిది. చిత్రంగా ఈ కావ్యం మొత్తం క్రెడిట్ శ్రీశ్రీ కి ఇచ్చేశారు. మీరు చదవాలనుకుంటే… మనసు ఫౌండేషన్ ప్రచురించిన “ శ్రీశ్రీ ప్రస్థాన త్రయం “ సంకలన కర్తలు.(పే 129..131 వరకు )– *ఎ.రజాహుస్సేన్..!!
Share this Article