Dynasty Forever: ఒకానొక గ్రేట్ ప్రజాస్వామిక దేశం. అక్కడి ప్రజలు వారి వ్యక్తిbగత స్వేచ్ఛ, స్వాతంత్ర్యాల కోసం పరితపిస్తుంటారు. సమూహంగా అందరి హక్కుల కోసం ఎలుగెత్తుతూ ఉంటారు.
వారి భాష వారికి గ్రేట్. వారి వేషం వారికి గ్రేట్. వారి మర్యాదలు వారికి గ్రేట్. వారి ఆలోచనలు వారికి పులకింత. వారి రాతలు వారికి తుళ్లింత. వారి కవిత్వమే కవిత్వం. వారి నడకే నడక. ప్రపంచానికి వారివ్వనిదేదీ లేదని వారనుకుంటూ ఉంటారు.
అలాంటి మా గొప్ప ప్రజాస్వామిక భావనలకు భవనాలు కట్టి, భాష్యాలు రాసిన దేశంలో…రాజు పట్టాభిషేక కిరీట ధారణ మహోత్సవం నేత్రోత్సవంగా హృదయోత్సవంగా జరుగుతోంది.
Ads
పదండి తోసుకు…పదండి పోదాం…రాచరికపు బంగారు పంజరాల్లోకి…సర్వ సత్తాక గణతంత్ర సర్వతంత్ర స్వతంత్ర సార్వభౌమ దేశాల అధినేతలు మర్యాదగా లేచి నిలుచునే కఠిన వజ్ర సౌధాల్లోకి…కిరీటం నడిచి వెళుతుంటే…వంగిన వెన్నెముకలు తలవంచుని అభివాద పూర్వకంగా కాళ్లు వంచి…పులక శరీరులైన పులకేశుల కళ్లల్లో వెలుగులు విరజిమ్మే అంతఃపురాల్లోకి…కస్టమైజ్డ్ రోల్స్ రాయిస్ లు, జాగ్వార్లు వెనక్కు వెళ్లి…మొద్దు ఎద్దు చర్మం కుచ్చు టోపీల్లో మొహం కనిపించని సైనికుల కవాతుల్లోకి….గుగ్గిళ్లు తిన్న గుడ్డి గుర్రాల డెక్కల చప్పుళ్లలోకి…వేసేది ఓటయినా గెలిచేది రాజయిన వింత ప్రజాస్వామ్యంలోకి…ప్రపంచానికి శకునం చెప్పే బల్లులు పడ్డ కుడితి తొట్టెల్లోకి…
కాకిపిల్ల కాకికి ముద్దు. ఎవరి ఆచారాలు వారికి ముద్దు కావచ్చు. కానీ…మారిన ప్రపంచంలో మారని రాచరికపు బంగారు గొలుసుల్లో బందీ కావడమే గొప్ప అనుకునేవారు…ప్రపంచానికి చెప్పే నీతులకు విలువేముంటుంది?
రాజధాని రాచ వీధుల్లో రాజు భుజ వస్త్రం పట్టులో పట్టు ఎంత? అర కిలో మీటరు పొడవున్న ఆ పట్టు వస్త్రాన్ని పాల బుగ్గల పసి పిల్లలు పట్టుకుని రాజు వెనుక మౌనంగా నడవడం ఏమిటి? అన్నవి చర్చించకూడని విషయాలు. ఒకవేళ చర్చిస్తే రాజద్రోహ నేరం అయ్యే విషయాలు.
మన మహాకవి శ్రీశ్రీ-
“ఏ యుద్ధం ఎందుకు జరిగెనో ?
ఏ రాజ్యం ఎన్నాళ్ళుందో ?
తారీఖులు , దస్తావేజులు
ఇవి కావోయి చరిత్రకర్థం .
ఈ రాణి ప్రేమ పురాణం ,
ఆ ముట్టడికైన ఖర్చులూ ,
మతలబులూ , కైఫీయతులూ
ఇవి కావోయ్ చరిత్రసారం
ఇతిహాసపు చీకటి కోణం
అట్టడుగున పడి కాన్పించని
కథలన్నీ కావాలిప్పుడు !
దాచేస్తే దాగని సత్యం .
నైలునది నాగరికతలో
సామాన్యుని జీవన మెట్టిది ?
తాజ్ మహల్ నిర్మాణానికి
రాళ్లెత్తిన కూలీలెవ్వరు ?
సామ్రాజ్యపు దండయాత్రలో
సామాన్యుల సాహస మెట్టిది ?
ప్రభువెక్కిన పల్లకి కాదోయ్ ,
అది మోసిన బోయీ లెవ్వరు ?”
అని ఎందుకన్నాడో అర్థమవుతోందా?
అన్నట్లు-
వారిది అక్షరాలా “constitutional monarchy”. అంటే “రాజ్యాంగబద్దమయిన రాచరికం”. ఆ పేరు గొప్ప బంగారు పంజరంలో అంతా ఇంతే. ఎప్పటికీ అంతే!
-పమిడికాల్వ మధుసూదన్
madhupamidikalva@gmail.com
Share this Article