ఎవరో సరిగ్గా రాసినట్టు అనిపించింది… ఫిలిమ్ డిస్ట్రిబ్యూషన్, ఎగ్జిబిషన్ సిండికేట్ ప్రభావం పుణ్యమాని రవితేజ ఈగల్ సినిమాను మొన్నటి సంక్రాంతి బరి నుంచి తప్పించడమే మంచిదైంది… లేకపోతే కొట్టుకుపోయేది లేదా నలిగిపోయేది… వెంకటేశ్ సైంధవ్ రిజల్ట్ చూశాం కదా… హనుమాన్ దెబ్బకు అంతటి గుంటూరు కారమే హిట్టో కాదో చెప్పలేని స్థితి… నాగార్జున నాసామిరంగా సినిమా ఏదో కన్నులొట్టబోయి బయటపడిందట… శివకార్తికేయన్ సినిమా అయలాన్ కూడా వాయిదా వేసుకుని, చివరకు తెలుగు రిలీజ్ లేకుండానే, అదే తమిళ వెర్షన్‌ను ఓటీటీలో పెట్టేసుకున్నారు…
రవితేజ ఈగల్ సినిమా గురించి ఆయనెవరో నిన్న ఎక్కడో మాట్లాడుతూ… ఆకాశంలో ఎగిరే గద్దకు ఎంతటి సునిశిత దృష్టి ఉంటుందో ఈగల్ రవితేజ పాత్రకు కూడా అంతే దృష్టి ఉంటుందన్నాడు… ఏ దృష్టితో అన్నాడో సినిమా చూస్తున్నంతసేపూ అస్సలు అర్థం కాలేదు… రవితేజ ఏనాడో మామూలు కమర్షియల్ టిపికల్ తెలుగు హీరో అయిపోయాడు… పెద్దగా కొత్తదనాలు, ప్రయోగాలు ఎట్సెట్రా ఎక్స్‌పెక్ట్ చేయలేం, సేమ్, ఈ సినిమా కూడా అంతే… ఓ సాదాసీదా ఫ్యాన్స్‌కు నచ్చితే చాలు అనుకున్నట్టుగా సాగిన ఓ ఎలివేషన్లు, బిల్డప్పుల తెలుగు సినిమా హీరో మార్క్ సినిమా…
ఒక చిన్న వార్త… హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ రాసిన ఆ వార్తతో అటు రా, ఇటు సీబీఐ మండిపోయి ఏకంగా ఆ పత్రికనే మార్కెట్‌లోకి రానివ్వరు… నవ్వొచ్చింది… అదేం వార్తయ్యా అంటే… ఓ అరుదైన కాటన్‌తో నేసిన బట్టకు సంబంధించిన వార్త… అబ్బో, ఇంతగా ప్రభుత్వం ఉలిక్కిపడిందంటే వెనుక ఏదో పెద్ద స్టోరీయే ఉండి ఉంటుంది అనుకుని సదరు తెలుగు సినిమా పరిశోధనాత్మక జర్నలిస్టు తలకోనకు వచ్చేస్తుంది…
Ads
గతంలో నానా బీభత్సమైన, వీరోచితమైన చరిత్ర ఉండి… హఠాత్తుగా పెళ్లాకిచ్చిన మాట కోసమో, మరో కారణమో బుద్దిమంతుడై, ఏదో సహదేవ్ పేరిట (సైంధవ్ కాదు) అజ్ఞాతంగా బతికే హీరోల కథలు బోలెడు చూశాం కదా, ఇందులోనూ అంతే… కాకపోతే ఈ హీరో పత్తి యాపారం చేస్తుంటాడు… (నెగెటివ్ అశ్లీల అర్థంలో కాదు)… అక్రమ ఆయుధాలన్నీ కొల్లగొడుతుంటాడు… తనకు ఫ్లాష్ బ్యాక్‌లో ఓ ప్రేమకథ… నడుమ నడుమ భీకరమైన యాక్షన్ సీన్లు… అందరికీ ఇప్పుడు కేజీఎఫ్ జ్వరం పట్టుకుంది కదా… ఎంత అరివీర భయంకరమైన యాక్షన్ సీన్లు ఉంటే అంత గొప్ప సినిమా అనుకునే భ్రమలకాలం మరి…
హీరోయిన్ మరొకామె ఉంది… ఉండీ లేనట్లుగా ఉంది… పాటలున్నయ్… ఉండీలేనట్టుగానే ఉన్నయ్… కథలో అంతగా మెరుపుల్లేవ్, మలుపుల్లేవ్… ఏదో అలా నడుస్తూ ఉంటుంది… నవదీప్ కూడా ఉన్నాడు… గతం నుంచి వర్తమానానికీ, వర్తమానం నుంచి గతానికీ నడుమ సరైన స్విచ్ ఓవర్లు లేవు… దాంతో స్క్రీన్ ప్లే గందరగోళంగా మారిపోయింది… ఎటొచ్చీ దర్శకుడు మంచి సినిమాటోగ్రాఫర్ అట కదా… ఆ నైపుణ్యం విజువల్స్‌లో కనిపిస్తుంది… రకరకాల ఆయుధాల రూపకల్పన కూడా క్రియేటివ్‌గా ఉంది…
రవితేజ నటన గురించి కొత్తగా చెప్పాల్సిన పనేమీ ఉండదు కదా… నీళ్లు తాగినంత ఈజీ ఈ పాత్ర… కాకపోతే రవితేజ అంటే సహజంగానే తనదైన మార్క్ కామెడీ ఆశిస్తాం కదా… లోపించింది… అనుపమ పాత్ర ఫుల్ లెంత్… కానీ నటనకు పెద్ద స్కోపున్న కేరక్టరైజేషన్ ఏమీ ఉండదు… కావ్య థాపర్ పాత్ర గురించి చెప్పడానికి ఏమీ లేదు… ఐనా సరే, రవితేజ మారతాడు అనుకుంటున్నారా..? నెవ్వర్… ఇలాంటివే సినిమాలు చేస్తూనే ఉంటాడు… ధమాకా సినిమాలాగా ఎప్పుడో ఒకటి పేలకపోదు… కథ నడుస్తూనే ఉంటుంది ఇలా… ఇలాంటిదే మరో పాత్ర, మరో సినిమా వస్తుంది… త్వరలోనే…
Share this Article