కొన్ని బతుకుచిత్రాల్లో ఎదుటనుంచి చూసే కళ్లకు ప్రతీది సమస్యే. కానీ, అనుభవించేవారికి దిక్కులేని పరిస్థితుల్లో అదో అనివార్యత. అలాంటి దైన్యస్థితిలోని ఆ అనివార్యతకు ఫుల్ స్టాప్ పెట్టడానికి… ఓ నిశిత పరిశీలన, కదలికతో ఓ వ్యక్తిలో కల్గిన ఆలోచనే ఎకో సోప్ బ్యాంక్.
పేరు సమీర్ లఖానీ. ఓసారి 2014లో కొలంబియాలోని కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో పర్యటిస్తున్నాడు. ఓ మహిళ బట్టలుతికే సబ్బుతో తన పిల్లాడికి స్నానం చేయిస్తోంది. మిగిలినవారైతే దాన్ని పెద్దగా గుర్తించకపోయేవారేమోగానీ… ఆ అంశమే లఖానీని కదిలించింది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఇంకా కూడా ఒక శాతం మంది మాత్రమే స్నానపు (మెయి) సబ్బులు వాడుతున్నారనే విషయాన్ని తన పరిశోధనలో తెలుసుకున్నాడు. అలా ఓ మహిళ తన కొడుక్కు డిటర్జెంట్ సోప్ తో స్నానం చేయిస్తున్న దృశ్యం.. సమీర్ లఖానీని కదిలించి ఏకంగా ఎకో సోప్ బ్యాంక్ ఏర్పాటుకు బాటలు వేసింది.
Ads
చాలా హోటల్స్ అతిథులకు వాష్ రూమ్స్ లో ఇచ్చే సబ్బులపై లఖానీ దృష్టి పడింది. అవి కాస్త వాడిపడేశాకో.. లేక, వాడుకుండానైనా డస్ట్ బిన్ లోకి వెళ్లిపోవడం.. వృథా అవుతుండటాన్ని గమనించిన లఖానీ.. వాటిని పేదలకందేలా చేస్తే…? అనే యోచన చేశాడు. వాటిని సేకరించి పేదలకు పంపిణీ చేయాలని నిర్ణయించుకున్నాడు. అలా ఎకో సోప్ బ్యాంకును ప్రారంభించాడు సమీర్. అలా సేకరించిన సోప్స్ ను రీసైక్లింగ్ చేసి పేదలకు పంచుతున్నాడు.
ప్రస్తుతం పది అభివృద్ధి చెందుతున్న దేశాల్లో 16 రీసైక్లింగ్ యూనిట్లను నెలకొల్పి పేదలకు మెయిసబ్బులనందిస్తున్నాడు లఖానీ. ఇప్పటికే 14 కోట్ల మందికి అలా సబ్బులందిస్తుండగా… కోటిమందికి అందించేందుకు విరాళాల రూపంలో కూడా కొందరు సబ్బులిస్తున్నారంటాడు. అపరిశుభ్రత వల్ల ఎవ్వరూ రోగాలెదుర్కోకూడదనే మోటోతోనే ఈ కార్యక్రమాన్ని తన భుజానికెత్తుకున్నట్టు చెబుతున్న లఖానీ… ఈ కార్యక్రమం వల్ల ఇంకెందరికో ఉపాధి కూడా లభిస్తోందని గర్వంగా చెబుతున్నాడు. 2017లో సీఎన్ఎన్ పికప్ చేసిన పది మంది టాప్ హీరోల్లో ఎకో సోప్ బ్యాంక్ సూత్రధారైన సమీర్ లఖానీ ఒకరు కాగా.. ఫోర్బ్స్ జాబితాలోని 30 మందిలోనూ సమీర్ లఖానీకి స్థానం దక్కింది.
Share this Article