అవసరమైన వార్తల విషయంలో గింజుకుంటున్న ఈనాడు ఈమధ్య వింత, తిక్క వార్తల విషయంలో మాత్రం ముందుంటోంది… రాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది… సహజంగానే ఇది మోడీ ప్రభుత్వానికి ప్రిస్టేజియస్… సరిపడా సంఖ్యాబలం లేకపోయినా తమ రాష్ట్రపతి అభ్యర్థిని గెలిపించుకోవాలి… అదీ అవసరం… ఈ నేపథ్యంలో ఈనాడు సైట్‌లో కనిపించిన ఓ సెంటి‘మెంటల్’ వార్త నవ్వు పుట్టించేలా ఉంది…
ఆ సెంటిమెంట్ ఫలిస్తే వెంకయ్యనాయుడే తదుపరి రాష్ట్రపతి అనే హెడింగ్‌తో ఉంది ఆ వార్త… ఏమిటా సెంటిమెంట్ అంటే..? ఇప్పటివరకు 13 మంది ఉపరాష్ట్రపతులుగా చేస్తే వారిలో తొలి ముగ్గురు రాష్ట్రపతులు అయ్యారట, తరువాత ముగ్గురు కాలేదట, మళ్లీ ముగ్గురు అయ్యారట… అంటే ముగ్గురు వరుసగా అవుతున్నారు, ముగ్గురు వరుసగా కాలేకపోతున్నారు… ఆ ఈక్వేషన్‌లో చూస్తే వెంకయ్యనాయుడు రాష్ట్రపతి అవుతాడట… ఏదో వెంకయ్యనాయుడి మీద ప్రేమ తప్ప ఆ వార్తలో ఇంకేమీ లేదు…
Ads
అందులోనే నిర్మలా సీతారామన్ పేరు కూడా రాసిపారేశారు… ఆమెను నిజంగా రాష్ట్రపతి అభ్యర్థిగా చేసే ఆలోచన గనుక ఉండి ఉంటే మొన్న రాజ్యసభ సభ్యత్వాన్ని రెన్యువల్ చేయకపోయేవారు కదా… అసలు మంత్రిగానే ఆమె పెద్ద ఫెయిల్యూర్… తెలంగాణ గవర్నర్ తమిళిసై పేరు కూడా వినిపిస్తోంది అని కూడా వార్తలో రాసేశారు… సౌత్ ఇండియన్, విద్యాధికురాలు, మహిళ, బాగానే ఉంటుంది… కానీ వ్యూహాత్మక సమీకరణాల్లో ప్రస్తుతానికి ఆమెకు చాన్స్ ఉండకపోవచ్చు…
వెంకయ్యనాయుడు కూడా ఏ సమీకరణంలోనూ ఫిట్ కాలేడు… అసలు తనను క్రియాశీల రాజకీయాల నుంచి తప్పించి ఉపరాష్ట్రపతిని చేయడమే మోడీ మార్క్ రాజకీయం… వెంకయ్యకన్నా తెలుగుదేశాన్ని బీజేపీలో గనుక బేషరతుగా విలీనం చేస్తే చంద్రబాబును రాష్ట్రపతిని చేయడం కరెక్టు అనే చెణుకులు కొన్నాళ్లుగా వినిపిస్తున్నాయి… ఇప్పుడున్న రాజకీయ అవసరంలో ఓ అగ్రవర్ణ హిందువు స్ట్రాటజిక్‌గా సరైన చాయిస్ కాకపోవచ్చు…
నిజానికి యూపీయే నుంచి రాష్ట్రపతి అభ్యర్థిత్వం మీద ఇప్పటికీ ఏ కసరత్తూ లేదు… మోడీని ఇరుకున పెట్టాలంటే ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిని పెట్టడం సరైన రాజకీయ వ్యూహం… కానీ ఆ ప్రయత్నాలూ లేవు…
రెండుమూడు నెలల్లో సంచలనం చూస్తారు అన్నాడు కదా కేసీయార్… మరి తనేం చేస్తున్నాడో తెలియదు… (తను జాతీయ క్రియాశీల రాజకీయాల్లో ఉండి, మొత్తం దేశాన్ని అత్యంత వేగంగా సెట్‌రైట్ చేయాలనే ఆలోచనల్లో సతమతమవుతున్నాడు కాబట్టి తనే రాష్ట్రపతి అయితే ఎలా ఉంటుందని బహుశా ఆలోచించడు…) బీహార్‌లో నితిశ్‌కు వారసుల్లేరు, తనను వదిలించుకుంటే రాష్ట్రం బీజేపీ వశమవుతుంది… అందుకని నితిశ్‌ను రాష్ట్రపతిగా చేస్తారనే మరో ఊహాగానం ఉంది… వీలయితే వదిలించుకుంటారు గానీ మళ్లీ తెచ్చి ఢిల్లీలో పెట్టుకుంటారా అనేది డౌటే… శరద్ పవార్ కు చాన్సే లేదు… ఆయన ఏ ఈక్వేషన్‌లో కూడా మోడీషా ఆలోచనల్లో ఫిట్ కాడు… పైగా తను ఇప్పుడు upa క్యాంప్…
యాంటీ – ముస్లిం ముద్రను పోగొట్టుకునే వ్యూహంలో భాగంగా గతంలో కలాంను తెరపైకి తీసుకొచ్చినట్టుగా… ఇప్పుడు గవర్నర్‌గా ఉన్న ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్‌ను అభ్యర్థిగా ప్రతిపాదిస్తారనే మరో ఊహాగానం ఉంది… కానీ ఆ కోణంలో అయితే గులాం నబీ ఆజాద్ కరెక్టు… కశ్మీర్ కోణం కూడా కలిసొస్తుంది… కాంగ్రెస్ శిబిరాన్ని కకావికలం చేయడానికి పనికొస్తుంది… తనతో మోడీకి దోస్తీ కూడా ఉంది… వ్యూహాత్మకంగా మోడీ శిబిరం ఇప్పుడు ఏదీ లీక్ చేయదు… కానీ చాలామంది తటస్థ మేధావుల అభిప్రాయం ప్రకారం కరెక్ట్ చాయిస్ ద్రౌపది ముర్ము… జార్ఖండ్ మాజీ గవర్నర్… చదువుకున్నది… ఫస్ట్ నుంచీ కాషాయశిబిరమే… తరతరాలుగా వివక్షకు గురవుతున్న ఓ గిరిజన జాతికి ప్రతినిధి… మహిళ… తనకు సంబంధం లేని రాజకీయాల్లో ఎప్పుడూ జోక్యం చేసుకోదు… మోడీ శిబిరానికి విధేయురాలు… అవునూ… అత్యంత వెనుకబడిన ఓ గిరిజన జాతికి ఈ దేశ అత్యున్నత పదవి ఎందుకు దక్కకూడదు..?! Why not a tribal lady…!?
Share this Article