చాలా చాలా గద్దర్ ఫోటోలు, జ్ఞాపకాల నడుమ… జనంపాటగా తను వేసిన అడుగుల నడుమ… అన్నంలో మెరిగెల్లాంటి కొన్ని ఫోటోలు, జ్ఞాపకాలు పంటి కింద కలుక్కుమంటయ్… ఉన్నయ్, గద్దర్ కొన్నేళ్లుగా తీసుకుంటున్న నిర్ణయాలు, పోకడలు, వేసే అడుగులపై చాలామందికి చాలా అభ్యంతరాలున్నయ్… ఉంటయ్, ఉండటంలో తప్పులేదు…
గుడి పూజారి ఎదుట ‘శెల్ల’ పట్టుకుని, ఆశీస్సుల కోసం కూర్చున్న ఫోటో తను చివరకు ఎలా మారిపోయాడో తెలుపుతుంది… ఆ ఫోటో చూసినప్పుడు ఎలాంటి గద్దర్ ఇలా ఎంతగా మారిపోయాడు అనిపిస్తుంది ఆయన పాటను అభిమానించేవాళ్లకు… భద్రాచలం, యాదాద్రి, వేములవాడ, కొమురవెల్లి సందర్శనలు… అందరినీ విస్తుపోయేలా చేశాయి… దేవుడు లేడన్నవాడు పూజారి ఎదుట శెల్ల చాపాడు…
బుల్లెట్ ద్వారానే రాజ్యాధికారం అని ఎలుగెత్తినవాడు చివరకు తనే ఓ సొంత పార్టీ పెట్టాడు… మోడీ, రాహుల్ దాకా వెళ్లాడు… తనను చంపించబోయిన చంద్రబాబు దగ్గరికీ పోయాడు… చివరకు కేఏపాల్‌తో కూడా జతకట్టాడు… ఇంకా ఉన్నయ్ విమర్శలు… తనకు అధికారికంగా అంత్యక్రియలు చేయడం మీద కూడా విమర్శలున్నయ్… ఇవన్నీ కాసేపు పక్కన పెడదాం…
Ads
కొన్నేళ్ల తన పయనాన్ని కాసేపు విస్మరించగలిగితే… గద్దర్ అంటేనే జనంపాట… ఓ విప్లవగీతం… ఓ చైతన్యగీతిక… మన దేశంలోనే ఇంతగా జనాన్ని కదిలించిన గాయకుడు మరొకరు లేరంటే అతిశయోక్తి కాదు… కోట్ల మందిని చేరిన ప్రజాగళం అది… సమసమాజం కోసమే పాట పల్లకీ మోసినవాడు… నిర్బంధాలు, కాల్పులు, కేసులు, అజ్ఙాతాలు… గద్దర్ అనుభవించని విప్లవ జీవితం ఏముందని..? రాజ్యం తన దేహంలో వదిలిన అజ్ఞాత, అక్రమ తూటాను జీవితాంతం మోశాడు కదా…
తన మరణవార్తకు ఖచ్చితంగా ప్రాధాన్యం ఉంది… బ్యానర్ స్టోరీ మాత్రమే కాదు, ప్రత్యేక కథనాలకూ అర్హుడు… కానీ తెలుగు టీవీ మీడియా ఒకవైపు అసెంబ్లీలో సీఎం ప్రసంగం, తరువాత చిరంజీవి రాబోయే సినిమాకు ప్రమోషన్ మీటింగుకు ప్రాధాన్యం ఇచ్చినట్టు కనిపించింది… సరే, టీవీమీడియా విజ్ఞతలు, పాత్రికేయ పోకడల గురించి తెలిసిందే… మరి పత్రికలు..?
పొద్దున్నే పలు తెలుగు పత్రికలు పరిశీలిస్తే… అందరూ మంచి ప్రాధాన్యమే ఇచ్చారు… చివరకు నమస్తే తెలంగాణ సైతం తన బాస్ ప్రసంగానికి ప్రాధాన్యం ఇస్తూనే, మాస్ట్ హెడ్ పక్కకు జరిపి, దాని పక్కనే గద్దర్ ఫోటో పెట్టి, ఫస్ట్ లీడ్‌గా గద్దర్ మరణవార్తనే ప్రచురించింది… పాత్రికేయ విజ్జత కనబర్చింది… అన్ని పత్రికల్లోకెల్లా ఆంధ్రజ్యోతి కవరేజీ బాగనిపించింది… పొద్దు వాలిపోయింది హెడింగ్ దగ్గర నుంచి అనేక గద్దర్ జ్ఞాపకాల్ని ప్రత్యేక పేజీలుగా వేసింది…
ఎటొచ్చీ… ఘనత వహించిన ఈనాడు మాత్రం సిగ్గుపడేలా… గద్దర్ మరణవార్తను కిందకు దింపేసి, జస్ట్, కేసీయార్ ‘ఎన్నో అస్త్రాలున్నయ్’ అంటూ ఏదో రాజకీయ ప్రసంగం చేస్తే దానికి ఎనలేని ప్రాధాన్యం ఇచ్చింది… సరే, ఇప్పుడు కేసీయార్‌ను మోయాల్సిన దుస్థితి ఈనాడుది… రాస్తుంది, రాయకతప్పదు, అసలే మార్గదర్శి మీద జగన్ దాడులతో పునాదులు కదులుతున్నయ్… మొక్కుబడిగా ఏదో ఓ ప్రత్యేక కథనం… ఎందుకు ఈనాడుకు గద్దర్ మీద కోపం..?
ఉండవచ్చుగాక… కానీ గద్దర్ మరణవార్తను అండర్ ప్లే చేయాల్సినంత కోపం ఇప్పుడు ప్రదర్శించడం ఏమిటి..? చివరకు ‘నమస్తే తెలంగాణ’ చూపిన పాత్రికేయ విజ్ఞత కూడా ఈనాడుకు లేదా..? ఒకనాటి ఏకే-47 గద్దర్ మొన్నమొన్నటిదాకా వేసిన పొలిటికల్ అడుగులపై ఎలా మనకు చివుక్కుమంటుందో… ఒకప్పటి ఘనమైన ఈనాడు ఇప్పుడిలా మారిపోయిన తీరూ సేమ్… సేమ్…
Share this Article