పాయె, పాయె, వచ్చె, వచ్చె…. 1) అదుగో కాంగ్రెసోళ్లతో దోస్తీ చేస్తడట… రేవంతుతో మంతనాలట… ఇదుగో బీజేపీతో కలుస్తడట, చర్చలు అయిపోవచ్చినయ్… 2) ఎహె, కాదు, కొత్త పార్టీ పెడుతున్నడు, కేసీయార్ వ్యతిరేకులతో విస్తృత వేదిక క్రియేట్ చేస్తాడు… తను మాజీ పీడీఎస్‌యూ కదా, బీసీ కదా, దళిత బహుజన ఎజెండాతో ముందుకు పోతడు… 3) ఎటూ పోడు, ఎక్కడ చేరడు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా కూడా చేయడు, పార్టీలోనే కొన్నాళ్లు ఉంటడు, బయటికి రాడు…. 4) ఈటల రాజేందర్ అడుగుల మీద బోలెడు విశ్లేషణలు, ఊహాగానాలు… రోజుకో తరీక అంచనాలు… ఒకరిద్దరు జర్నలిస్టులయితే ఇదుగో ఇన్ని పార్టీల పేర్లు రిజిష్టరై ఉన్నయ్, ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకో అని పేజీ మొత్తం పరిచేశారు… ఆయన తనకు నచ్చిన కొత్త పేరుతో పార్టీ రిజిష్టర్ చేసుకోలేడా ఏం..? సరే, ఇప్పుడిక ఆయన బీజేపీలో చేరుతున్నాడు అని దాదాపు మొత్తం మీడియా తేల్చిపడేసింది… నిజానికి ఆయన బోలెడంత డైలమాలో ఉన్నాడట… చౌరస్తాలో నిలబడి ఉన్నాడు… ఐనాసరే, కాషాయతీర్థం వార్తలే నిజం అనుకుందాం ఓసారి… నిజానికి బీజేపీతో ఆయన చాలారోజులుగా టచ్‌లో ఉన్నమాట నిజం… మంతనాలు సాగుతూనే ఉన్నయ్, కొత్త పార్టీ పెడితే ఎలా ఉంటుందని అందరినీ అడుగుతున్నాడు… ఇవన్నీ కేసీయార్‌కు తెలుసు… ఓ ముహూర్తం చూసి, ఇక చాలుపో అనేశాడు…
కాంగ్రెస్ వైపు లాగుదామని రేవంత్ కొంత ప్రయత్నించినట్టున్నాడు… కోదండరాం, మరికొందరు ప్రొగ్రెసివ్ పంథాలో వెళ్దాం, బీజేపీ వైపు మాత్రం వెళ్లకు అని అడిగినట్టున్నారు… కానీ ఈటల బీజేపీనే ఎందుకు ఎంచుకుంటున్నట్టు..? ఎందుకంటే..? తనకూ కేసీయార్‌కూ చాలారోజులుగా పడటం లేదు, ఎప్పుడో ఈ బంధం పుటుక్కుమనేట్టుంది… ఆ తరువాత కేసీయార్ నన్ను వేటాడతాడు… సో, బీజేపీలో ఉంటే కొంత ప్రొటెక్షన్… పైగా ఆ పార్టీ ప్రాస్పెక్టస్ కాస్త ఆశాజనకంగానే ఉంది… బహుశా ఇదే ఈటల ఆలోచన అయి ఉండవచ్చు కొన్నాళ్లుగా… కేసీయార్‌ను ఏళ్లుగా దగ్గరి నుంచీ చూస్తున్నాడు, తనకు కేసీయార్ తత్వం తెలుసు కదా… అనుమానించినట్టుగానే కేసీయార్ ఇప్పుడు వేటాడుతున్నాడు… చుట్టూ ఉన్నవాళ్లందరినీ కత్తిరించేస్తున్నాడు, ఆక్రమణల కేసులేవో పెట్టేస్తున్నాడు… అందుకని ఈటల బీజేపీకే నెట్టేయబడుతున్నాడు… పైగా ఆయన తన పాత ప్రోగ్రెసివ్, బీసీ పంథా నుంచి ఎప్పుడో చాలా దూరం వచ్చేశాడు… ఉద్యమ పార్టీ నుంచి ఫక్తు రాజకీయ పార్టీగా మారిన ఓ కలగాపులగం, నియో ఫ్యూడల్ పార్టీలో మొన్నటిదాాకా కీలకనాయకుడు తను… మళ్లీ తన పాత పంథాకు ఇంకేం వెళ్తాడు..?
Ads
ఒకవేళ కొత్త పార్టీ పెట్టినా అది నిలదొక్కుకునే చాన్స్ తక్కువ… పెద్ద పార్టీలనే కేసీయార్ తొక్కేస్తున్నాడు… పైగా కోదండరాంరెడ్డి, షర్మిలారెడ్డి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, రేవంత్‌రెడ్డిలు తమ యాస్పిరేషన్స్ వదిలేసుకుని, ఈటలకూ జై అని ఎందుకంటారు..? ప్రస్తుతానికి హుజూరాబాద్‌లో స్వతంత్రుడిగా పోటీకి దిగుతాను, మీరంతా సపోర్ట్ చేయండి అని అందరినీ అడిగినా… అందరూ సపోర్ట్ చేసినా… వాట్ నెక్స్ట్..? తరువాతైనా తన కెరీర్ ఏమిటో నిర్ణయించుకోవాల్సిందే కదా… సో, ఏ కోణం నుంచి చూసినా ఈటలకు బీజేపీయే దిక్కులా కనిపిస్తోంది… స్థూలంగా పైపైన చూస్తే…
మరి బీజేపీకి ఈటలతో ఏం సుఖం..? ఏం ప్రయోజనం..? నాగం వంటి నేతే ఉండలేకపోయాడు, డీకేఅరుణ, స్వామి గౌడ్ వంటి నేతల పరిస్థితే అయోమయం… పార్టీ పగ్గాలు సంజయ్ చేతిలో ఉన్నాయా, కిషన్‌రెడ్డి చేతిలో ఉన్నాయా ఎవరికీ తెలియదు… దుబ్బాక, గ్రేటర్ సక్సెసుల తరువాత మళ్లీ పార్టీ పట్టాలు తప్పింది… సాగర్ ఉపఎన్నిక, కార్పొరేషన్ల ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల్లో దయనీయంగా పనితీరు… ఒక్కసారిగా చప్పున చల్లారిపోయిన జోష్… కొత్తగా రెడ్లు ఎవరూ ఆసక్తి చూపించడం లేదు… వెలమ, కమ్మ నేతలు రావడం లేదు… పార్టీ నేతలు కాపు ఫ్యాక్టర్ వైపు పార్టీని తీసుకుపోతున్నారు… ఈ స్థితిలో ఈటల వస్తే పార్టీకి కొంత ప్రయోజనమే… కానీ వాడుకోగలిగితేనే..! వాడుకునే స్థితిలో పార్టీ ఉన్నదానేదే అసలు ప్రశ్న..!
ఒక్క కాపు మాత్రమే కాదు, ఏపీ కాపు నేతల తోకలు పట్టుకుని ఈదడం కాదు… ముదిరాజ్, గౌడ్, యాదవ, పద్మశాలి తదితర బీసీ సెక్షన్లలోకి పార్టీ పోగలగాలి… ఆదివాసీల్లోకి సోయం బాపూరావు వల్ల పోగలిగింది… సాగర్‌లో ఓ బంజరా డాక్టర్‌కు టికెట్టు ఇవ్వడమూ మంచి పనే… పైకి చూస్తే ఇదంతా బాగున్నట్టే అనిపిస్తుంది కదా… కానీ ఎటొచ్చీ పార్టీ హెడ్డాఫీసే పెద్ద గందరగోళం… ఈటలతోపాటు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఏనుగు రవీందర్‌రెడ్డి, తుల ఉమ తదితరులు కూడా పార్టీలో చేరతారు అని వినికిడి… కొండా ఎప్పుడో చేరాల్సింది, కానీ ఇలాంటి సందర్భం కోసమే ఆయన చేరికను హోల్డ్‌లో ఉంచినట్టున్నారు ఇన్నాళ్లు… సో, ఈటలను సరిగ్గా వాడుకోగలిగితే పార్టీకి ప్రయోజనమే… ఈటలకూ నయమే… అన్నీ అనుకున్నట్టు జరిగితే… కనుక హుజూరాబాద్ ఉపఎన్నిక గనుక వస్తే, ఎలాగూ కేసీయార్ తప్పకుండా హరీష్‌రావుకు బాధ్యత అప్పగిస్తాడు… అభ్యర్థి ఎవరనేది అప్రధానం… అప్పుడు ఆ ‘‘ఇద్దరు మిత్రుల’’ నడుమ ఆసక్తికరమైన పోరు సాగబోతున్నదన్నమాట…!!
Share this Article