.
నేను వసారాలో, ఈజీ చైరులో కూర్చుని, పేపరు చదువుకుంటున్నాను. తూర్పు దిక్కు నుండి కొంచెం ఎండ పడుతుంది. ఇంతలో మా ఆవిడ, చీరె కొంగుతో చేతులు తుడుచుకుంటూ,
”పిలిచారా?” అని ఆతృతగా అంటూ వచ్చింది.
నేను తన వైపు చిరునవ్వుతో చూసాను.
“పిలవలేదా? పిలిచినట్టుగా అనిపించింది. కాఫీ ఏమైనా కావాలా?” అని అడిగింది.
నేను కుర్చీలో నుంచి లేచి, మా ఆవిడ భుజం మీద చెయ్యి వేసి, నవ్వాను.
“సరే సరే అవతల, స్టౌ మీద కూర పెట్టి వచ్చాను.” అంటూ లోపలికి నడిచింది.
Ads
కాసేపటికి, లోపలి నుండి మా ఆవిడ నన్ను పిలిచింది. నేను లేచి వెళ్ళి,
“ఏంటి?” అని అడిగాను.
“ఏంటి, ఏంటి?” అని తను ప్రశ్నించింది.
“పిలవలేదా?” అని నేను ఆశ్చర్యంగా అడిగాను.
“లేదే? ఏమైనా కావాలా?”
“వద్దు” అని నేను తలగోక్కుంటూ వసారాలోకి నడిచాను.
….
ఒక రోజు సాయంత్రం, నేను బయట మితృనితో పిచ్చాపాటీ మాట్లాడుతుండగా,
మా ఆవిడ పిలిచింది.
నేను లోపలికి వెళ్ళే సరికి, మా ఆవిడ గుడికి వెళ్ళడానికి తయారయి ఉంది. నా కంటికి, మా ఆవిడ, మా పెళ్ళి నాటి పదహారేళ్ళ పడుచు లాగా కనిపించింది. తెల్లటి చీర, మల్లెపూలు, ముక్కు పుడకలో ఒక వింత శోభతో మెరిసిపోతుంది. నేను అలానే చూస్తుండిపోయాను. మా ఆవిడ నా భుజం తట్టడంతో,
“ఏంటి? ఎందుకు పిలిచావ్?” అన్నాను. తను మరింత అందంగా ముసిముసి నవ్వులు నవ్వింది.
“పిలవలేదా అయితే?” అన్నాను. తను తల అడ్డంగా ఊపింది.
ఎలాగూ వచ్చాను కదా అని తనను నా కౌగిలిలోకి తీసుకుని, నుదుటి మీద చిన్న ముద్దు పెట్టాను.
తను కౌగిలి నుండి విడిపించుకున్నట్టూ గింజుకుంటున్నట్టూ నటించి మరింత హత్తుకుని,
“బయట మీ ఫ్రెండు ఉండగా ఇవేం పనులండీ?” అని అంది చిలిపిగా.
“వదులు మరి?” అని కౌగిలి వీడి బయటకు నడిచాను.
….
మా ఇంట్లో మేమిద్దరమే! పిల్లలు పెద్దవాళ్ళు అయి దేశవిదేశాల్లో సెటిలయ్యారు. మేం మా సొంత ఊళ్ళో, సొంతింట్లో ఉంటున్నాము. ఇద్దరమూ రిటైరయ్యాము. పెద్దగా రోజువారీ పనులేమీ ఉండవు. హాయిగా, సంతోషంగా కాలంతో పాటు మేమూ మారి, కాలం గడుపుతున్నాము.
పొద్దున్న మా ఆవిడ, పూజ, వంట పనులతో ఓ రెండు మూడు గంటల పాటు బిజీగా ఉంటుంది. ఆ మాత్రపు దూరాన్ని కూడా భరించ లేనట్టుగా, మా ఆవిడ అప్పుడప్పుడు మధ్యలో వచ్చి ‘పిలిచారా?’ అంటూ నన్ను పలకరించి వెళుతుంది. నేను కూడా అంతే. ఏదో వంకతో ‘పిలిచావా?’ అంటూ తన దగ్గరకు వెళ్తాను. ఎవరూ ఎవరిని పిలవలేదని మాకు తెలుసు. అయినా ‘పిలిచారనే’ నెపంతో మాట్లాడుకుంటాము.
అవే మా ఈ ఒంటరి జీవితంలో ఆనందపు క్షణాలు. ఉద్యోగంలో ఉన్నన్ని రోజులు బదిలీలు, ప్రమోషన్లు, టార్గెట్లు అంటూ ఆనందంగా, విశ్రాంతిగా గడిపిందే లేదు. ఆ లోటును ఇప్పుడూ భర్తీ చేసుకుంటున్నాము. చల్లటి పల్లెటూరు, కొంత మంది మితృలు, ఒకరికొకరంగా జీవించే మేము, ఎంత ఆనందంగా ఉందో! సింపుల్ లివింగ్ విత్ అబండెంట్ హ్యాపీనెస్!
…
ఆ రోజు అర్థరాత్రి, నా గుండెల్లో కలుక్కుమంది. పక్కకు చూసాను. మా ఆవిడ ప్రశాంతంగా నిద్రపోతుంది. గుండెల్లో అలజడి ఎక్కువైంది. భరించలేని నొప్పితో విలవిలలాడిపోయాను.
మా ఆవిడని పిలవాలని నోరు తెరిచే లోపే…
నా చివరి పిలుపు మా ఆవిడకు చేరనేలేదు.
….
రచన: ప్రభాకర్ జైనీ
Share this Article