.
ఎమర్జెన్సీ సినిమా తొలిరోజు వసూళ్లు కేవలం 2.4 కోట్లు… ఆశ్చర్యం కలిగించలేదు… కేవలం 99 రూపాయల టికెట్టు ధర పెట్టింది ఆమె… బాలీవుడ్ సినిమాలు కొంతకాలంగా పేలవమైన ప్రదర్శన కనబరుస్తున్నాయి జనాదరణలో…
ఎక్కువ రేట్లు పెడితే ఈమాత్రం జనం కూడా రారని తెలుసు వాళ్లకు… సోనూ సూద్ కూడా మొన్న తన సినిమాకు ఇంతే రేటు పెట్టాడు… రేటు మాట అటుంచితే కంగనా రనౌత్ ఎమర్జెన్సీ సినిమాకు ఏమాత్రం బజ్ లేదు… కొన్నాళ్లుగా ఆమె నెగెటివిటీని మూటగట్టుకున్న ఫలితం అది…
Ads
ఆమధ్య మోడీ సహా ఇతర కేబినెట్ మంత్రులు, ఎంపీలు పార్లమెంటు ఆవరణలో ‘ది సబర్మతి రిపోర్ట్’ సినిమా చూశారు కదా… ఆ పరోక్ష ప్రమోషన్ వర్క్ ఆ సినిమాకు పెద్దగా వసూళ్లకు ఏమీ ఉపకరించలేదు… బహుశా కంగనా రనౌత్ సినిమాకు మరోసారి ఇలాంటి ప్రమోషన్ జరిగినా అదే ఫలితం ఉంటుందేమో.,.
నిజానికి రంగనా రనౌత్ తన రాజకీయ ఆలోచనలకూ సినిమా ఆలోచనలకూ నడుమ ఓ స్పష్టమైన విభజన రేఖను గీసుకోవాల్సింది… ఆమె ఎంచుకున్న పొలిటికల్ మార్గం చాలామందికి నచ్చకపోవచ్చు… కానీ తను సాహసి, వివాదాలకు భయపడదు… ఫైటర్… బాలీవుడ్ మాఫియాను, శివసేన అరాచకాన్ని ఎదిరించి నిలబడింది ముంబైలో…
అదేసమయంలో మంచి దర్శకురాలు కాకపోవచ్చుగాక… కానీ మంచి నటి.,. ఎమర్జెన్సీ సినిమాను కూడా ఓ నటిగా, ఓ దర్శకురాలిగా తీసి ఉండాల్సింది… కానీ ఆమె ఓ బీజేపీ నాయకురాలిగా తీసింది… అదీ సమస్య… పైగా ఈ చిత్రానికి మరో ప్రధాన సమస్య… కథా విస్తృతి…
ఎమర్జెన్సీ అని పేరు పెట్టింది గానీ… ఈ సినిమా కథ కేవలం ఎమర్జెన్సీకి పరిమితమైంది కాదు, అలా పరిమితం చేసి ఉంటే కంగనా నటనకు, దర్శకత్వ ప్రతిభకు పేరొచ్చేది, నాలుగు డబ్బులూ వచ్చేవి… వరుస పరాజయాల్లో ఉన్న కంగనాకు ఇది మరో పరాజయం… బహుశా నటిగా తన కెరీర్ ప్రమాదంలో పడినట్టే కావచ్చు…
ఇందిరాగాంధీ పొలిటికల్ కెరీర్ ప్రారంభంలో ఆమె బలహీన నాయకురాలు… అక్కడి నుంచి తను ఎలా ఎదిగింది, పాకిస్థాన్‌తో యుద్ధం, రష్యా సహకారం, అమెరికా ఆధిపత్యం పట్ల తృణీకరణ వంటివి ఆమెను బలమైన నేతగా పెంచాయి… ఇందిర అంటే ఓ చరిత్ర… అలాంటి నాయకురాలు క్రమేపీ ఎలా పతనమైందో చూపడానికి అనేక సంఘటనల్ని కథలో కూరుస్తూ పోయింది కంగనా…
అందులోనే ఎమర్జెన్సీ పరిస్థితులు, ఖలిస్థానీ సమస్య, కొడుకు సంజయ్ గాంధీ విలనీ, తిరిగి అధికారాన్ని కైవసం చేసుకోవడం, తరువాత హత్య దాకా… దాదాపు ఓ బయోపిక్ అయిపోయింది సినిమా… మొదట్లో ఇందిరగా బాగా కనిపించిన కంగనా ఇందిరను బాగానే ఇమిటేట్ చేసింది… క్రమేపీ సినిమా చివరకు కంగనా కనిపించి, ఇందిర కనిపించకుండా పోయింది…
అస్సలు సినిమా బాగాలేదా అంటే… బాగుంది… కాకపోతే ఒకే రాజకీయ భావజాలం నుంచి చూస్తున్నట్టుగా… ఓ డాక్యుమెంటరీలాగా..! ఈ తరం ప్రేక్షకులకు ఇందిర గురించిన చాలా విషయాలు చెప్పింది కంగనా… జయప్రకాష్ నారాయణ, వాజపేయి తదితరులతో కూడిన సీన్స్ రక్తికట్టాయి…
నాటి కాలంలోకి కూడా కంగన తీసుకుపోతుంది మనల్ని నిర్మాణ విలువలపరంగా… వాజపేయి, జయప్రకాష్ నారాయణ, సంజయ్ గాంధీ పాత్రధారులు కూడా బాగా నటించారు… ఐతే ఒకే రంగు కళ్లద్దాల నుంచి చరిత్రను చెప్పడమే కంగనా రనౌత్ చేసిన తప్పు… మూల్యం చెల్లిస్తోంది..!! (చెప్పలేం, స్లో స్టార్ట్, తరువాత పుంజుకోవచ్చు కూడా..)
చివరగా… ఒక నటిగా ఇందిరను సినిమాలో దింపేసింది… ఆ మెరిట్‌కు ప్రశంసలు… దర్శకురాలిగా మాత్రం ప్రశంసలకు అనర్హురాలు..!! మరోమాట… కంగనా సాహసి కాబట్టి ఓ సంక్లిష్టమైన కథను, దేశం మరవలేని ఓ నాయకురాలి కథను సినిమాగా తీయడానికి సాహసించింది… రిలీజు దాకా సమస్యలు వస్తాయని తెలిసీ… వివాదాలు ముంచెత్తుతాయని తెలిసీ… ఆ టెంపర్‌మెంట్ కూడా అభినందనీయమే… ఎటొచ్చీ అది వృథా అయిపోయింది కదా…!!
Share this Article