సౌత్ ఇండస్ట్రీ మీద పడి ఏడుస్తున్నారు బాలీవుడ్ పెద్దలు… వాళ్ల సినిమాలన్నీ ఫట్… సౌత్ సినిమాలేమో పాన్ ఇండియా రేంజ్ హిట్… నిజానికి బాలీవుడ్ ఖర్చు ఎక్కువ, రీచ్ ఎక్కువ… కానీ కొన్ని సినిమాల్ని సౌత్ ఇండస్ట్రీ మాత్రమే తీయగలదు… దేశభక్తి, ప్రేమ, పౌరుషం వంటి ఉద్వేగాల్ని బలంగా తెర మీద ఆవిష్కరించాలంటే మనవాళ్లే సమర్థులు… తక్కువ ఖర్చుతోనే మన అడవి శేష్ తీసిన మేజర్ చూస్తే తేడా అర్థమైంది… మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ కథ ముంబై అటాక్స్ ప్రధానంగా అడవిశేష్ మేజర్ సినిమా కథాంశం…
అది మరోసారి చూస్తుంటే అప్పట్లో, బహుశా ఏడాది క్రితం హిందీలో వచ్చిన… షేర్ షా సినిమా గుర్తొచ్చింది… నిస్సారంగా ఉంటుంది… అది కార్గిల్ హీరో విక్రమ్ బాత్రా కథ… మిగతా కథలు ఒకెత్తు… ఈ పరమవీరచక్ర సైనికుడి కథ మరో ఎత్తు… శేష్ తీసిన మేజర్ సినిమాలో లవ్ స్టోరీ కాస్త కృత్రిమంగా అనిపిస్తుంది… సినిమా కోసమే రాయబడిన ట్రాక్‌లా ఉంటుంది… కానీ విక్రమ్ బాత్రా రియల్ స్టోరీ చదివితే… యాక్షన్, త్యాగం, దేశభక్తి, సాహసం, ప్రేమ వంటి బోలెడు ఉద్వేగాల్ని కుప్పపోసినట్టు ఉంటుంది… కదిలించేస్తుంది… అన్ని ఉద్వేగాలున్న కథను కూడా షేర్ షా దర్శకుడు సరిగ్గా ప్రజెంట్ చేయలేకపోయాడు…
అంతెందుకు..? ఎల్‌వోసీ-కార్గిల్ పేరిట అభిషేక్ బచ్చన్ కూడా ఈ పాత్ర పోషించాడు… అదీ పెద్ద ఇంప్రెసివ్ కాదు… నిజానికి ఎవరైనా సౌత్ ఇండియన్ దర్శకుడి చేతిలో పడి ఉంటే ఈ కథ ఓ రేంజులో భారతీయ ప్రేక్షకులను ఆకట్టుకునేది… ఇప్పటికీ కార్గిల్ అనగానే వేల మంది సైనికులు విక్రమ్ బాత్రా పేరు తలుచుకుంటారు… కన్నీళ్లు పెట్టుకుంటారు… సెల్యూట్ కొడతారు… ఆ కథలో నిజంగా మనసుకు పట్టేది విక్రమ్ సహచరి డింపుల్ చీమా… పదండి… ఓసారి గుర్తుచేసుకుందాం…
Ads
విక్రమ్… హిమాచల్ ప్రదేశ్‌లో పుట్టిన ఓ పంజాబీ హిందూ… చండీగఢ్‌లోని పంజాబ్ యూనివర్శిటీలో ఇంగ్లిష్‌లో మాస్టర్స్‌లో జాయినయ్యాడు… పంజాబీ గరల్ డింపుల్ చీమా కూడా అదే సంవత్సరం, అదే కోర్సులో జాయినైంది… మెల్లిగా పరిచయం… దగ్గరలోని ఓ కేఫ్‌లో తరచూ కలిసేవాళ్లు… అన్ని లవ్ స్టోరీల్లాగే వీళ్ల ప్రేమ కూడా బలపడుతూ వచ్చింది… సమీపంలోనే ఉన్న మానసాదేవి గుడికి, శ్రీనద సాహెబ్ గురుద్వారాకు వెళ్లేవాళ్లు…
ఆమె ఇంట్లో ఆమె పెళ్లి కోసం… అతని ఇంట్లో అతని పెళ్లి కోసం ప్రెజర్ పెరుగుతోంది… ఏవేవో సాకులు చెప్పి వీళ్లిద్దరూ వాయిదాలు వేస్తున్నారు… ఎప్పుడో ఓసారి అందరికీ చెప్పేసి, పెళ్లి చేసుకోవాలి… కానీ ఎప్పుడు..? ఓరోజు గురుద్వారా పరిక్రమ చేస్తున్నారు… నాలుగు పూర్తయ్యాయి… వెంటనే ఆమెను ఆపి, దుపట్టా అంచు పట్టుకుని, ఏయ్, మిసెస్ బాత్రా, మన పెళ్లయిపోయిందోయ్ అన్నాడు నవ్వుతూ…
అప్పుడామె తన పెళ్లయినట్టేనని ఫిక్స్ అయిపోయింది… మరోసారి ‘మన పెళ్లి మాటేమిటి విక్రమ్, నిజంగా జరుగుతుందంటావా..?’ అనడిగింది… వెంటనే తన వ్యాలెట్‌లో ఉన్న చిన్న బ్లేడ్ తీసి, బొటనవేలు కోసుకుని, ఆ రక్తాన్ని ఆమె పాపిట్లో రాశాడు… హత్తుకున్నాడు… విక్రమ్‌తో పెళ్లయినట్టేననే ఆమె భావన మరింత బలపడింది… ఇక కాలం చెరపలేనంతగా…!
విక్రమ్‌కు సైన్యంలో జాయిన్ కావాలని కోరిక… అందుకే ఇండియన్ మిలిటరీ అకాడమీకి అప్లయ్ చేశాడు… దానికి సెలెక్ట్ కాగానే ఎగిరి గంతేశాడు… ఆమె తన నిర్ణయాన్ని ఆమోదించింది… ఇద్దరిలో ఎవరూ వాళ్లు జాయినైన ఎంఏ ఇంగ్లిష్ కోర్సు మాత్రం పూర్తి చేయలేదు, విక్రమ్ డెహ్రాడూన్‌లో శిక్షణకు వెళ్లిపోయాడు… అదయ్యాక మర్చెంట్ నేవీలో జాబ్ వచ్చింది కానీ చేరలేదు… ఇండియన్ ఆర్మీలో చేయాలని కదా తన లక్ష్యం… అనుకున్నట్టుగానే అందులో చేరాడు…
జమ్ము కాశ్మీర్‌లో కొంతకాలం డ్యూటీ… ఉగ్రవాదులతో ఎన్‌కౌంటర్లు, తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న సందర్భాలు బోలెడు… మధ్యమధ్యలో చండీగఢ్ వెళ్లి, డింపుల్‌ను కలిసేవాడు… నాలుగేళ్ల ప్రణయం పాకాన బడింది… ఇంట్లో అమ్మానాన్నలకు చెప్పాడు, నాకోసం సంబంధాలు వెతకొద్దు అని… వాళ్లకు అర్థమైంది… అమ్మాయిని చూపించురా ఓసారి అనడిగారు… నేరుగా పెళ్లిలోనే చూద్దురు గానీ అన్నాడు… ఈలోపు కార్గిల్ యుద్ధం వచ్చిపడింది… ఈ యుద్ధం అయ్యాక ఇక పెళ్లి చేసుకోవడమే… కానీ మనం అనుకున్నట్టుగా జరిగితే ఇక విధి దేనికి..? ఉరిమింది…
పాకిస్థాన్ ఆక్రమించుకున్న రెండు కీలక పోస్టులను ఇండియన్ సైన్యం పునఃస్వాధీనం చేసుకునే క్రూషియల్ ఘట్టంలో… తన ట్రూప్ సభ్యుల ప్రాణాలు కాపాడే క్రమంలో… విక్రమ్ బాత్రా ప్రాణాలు కోల్పోయాడు… తను యుద్ధానికి వెళ్లే ముందు ఆందోళనగా ఉన్న డింపుల్‌ను ఊరడిస్తూ విక్రమ్ ఓ మాటన్నాడు… ‘‘ఎందుకు డియర్ ఆందోళన..? తప్పకుండా తిరిగి వస్తాను కదా… మన మూడు రంగుల పతాకాన్నిగర్వంగా ఎగరేస్తూ వస్తాను… లేదంటే ఆ మూడు రంగుల పతాకంతో చుట్టబడి తిరిగొస్తాను మరింత గర్వంగా..! సినిమాటిక్ అనిపిస్తోంది కదా… నిజంగానే తన కథ అంతే…
విగతజీవుడై తిరిగొచ్చాడు… ఆమె గుండె పగిలింది… శవం దగ్గర కుప్పకూలింది… అప్పుడే తొలిసారిగా డింపుల్‌ను చూశారు విక్రమ్ తల్లిదండ్రులు ఆమెను… ఆమె అంతకుముందే తన ఇంట్లో చెప్పింది కదా… ‘‘జీవితంలో పెళ్లి చేసుకుంటే విక్రమ్‌నే… లేకపోతే ఇక పెళ్లే చేసుకోను’’ అని… అంతే… అదే మాట మీద నిలబడింది… ఇప్పటికి 22 ఏళ్లు… విక్రమ్ విడోగానే… చండీగఢ్‌లో ఒంటరిగా బతుకుతోంది… జస్ట్, విక్రమ్ జ్ఙాపకాలే తోడుగా… పిల్లలకు పాఠాలు చెబుతూ…!
అదేమిటమ్మా, తనతో నీకు పెళ్లి కాలేదు కదా అని ఎవరైనా అడిగితే అంటోంది ఇలా… ‘‘పెళ్లా..? అయిపోయింది.., అయిపోయినట్టే… ఇప్పటికీ ఏరోజైనా నన్ను విక్రమ్ స్మృతులు వదిలితే కదా… రేపోమాపో హఠాత్తుగా వస్తాడు అనిపిస్తూనే ఉంటుంది ఈరోజుకూ… మరో పెళ్లి ఎలా చేసుకోను..? ఇప్పటికీ నా దుపట్టా అంచు పట్టుకుని, ఓ నీడగా నా చుట్టే విక్రమ్ తిరుగుతూ ఉంటే… ఎటు వెళ్లను..? ఏం చేయను..? ఇంకెవరో ఎరుపు చేయడానికి నా పాపిడి ఖాళీగా ఉంటే కదా..?!
Share this Article