Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

సరిగ్గా 30 ఏళ్లు… తెలుగు శాటిలైట్ చానెళ్ల తొలి రోజుల బాలారిష్టాలు…

January 22, 2026 by M S R

.

Bhavanarayana Thota …. ప్రైవేట్ శాటిలైట్ టీవీ తొలి రోజుల అనుభవాలు… 1993 ఏప్రిల్ 14… తమిళ సంవత్సరాది…

చెన్నై డిఎంకె కార్యాలయం ‘అన్నా అరివాలయం’ భవనం మూడో అంతస్తులో మురసొలి మారన్, కరుణానిధి కుటుంబసభ్యులంతా టీవీ ముందు కూర్చున్నారు. మారన్ పెద్ద కొడుకు కళానిధి మారన్, కళానిధి స్నేహితుడు శరద్ కుమార్ ఆధ్వర్యంలో మొదలవుతున్న సన్ టీవీని తొలిసారిగా తెరమీద చూడబోతున్న ఉత్కంఠ క్షణాలవి.

Ads

సినిమా రెండు భాగాలుగా రెండు టేపుల్లో రికార్డ్ చేసి రష్యాలో ఉన్న శాటిలైట్ అప్ లింకింగ్ స్టేషన్ కు పంపి అన్ని ఏర్పాట్లూ పకడ్బందీగా చేసుకుని ప్రారంభోత్సవానికి సిద్ధమయ్యారు.

అందరూ ఆతృతగా ఎదురు చూస్తుండగా తెరమీద 30 సెకెన్ల సన్ టీవీ యానిమేటెడ్ లోగో .. నేపథ్యంలో ‘నీంగళ్ పార్తుకొండిరుప్పదు సన్ టీవీయిన్ తమిళ్ మాలై’ (మీరు చూస్తున్నది సన్ టీవీ వారి తమిళ పూదండ) అని వినిపించటం పూర్తవగానే సినిమా మొదలైంది…

చప్పట్ల మధ్య కళానిధి మారన్ కి పూలదండ వేసి అభినందన పూర్వకంగా స్వీట్ తినిపించారు కరుణానిధి. అందరూ ఆ అనందంలో మునిగి తేలుతుంటే కరుణానిధి అసలు విషయం బయట పెట్టారు. “అది సెకండ్ పార్ట్ మొదలైంది చూడండిరా!” అని కాస్త గట్టిగానే అరిచారు… సినిమా మీద గట్టి పట్టున్న కరుణానిధి.

ఆయనలా సినిమా మధ్యలో మొదలైందని చెప్పేదాకా ఎవరూ ఆ సంగతే పట్టించుకోలేదు. అప్పుడు సన్ టీవీ సీనియర్ ఉద్యోగులు హడావిడిగా కిందికి పరుగుతీసి పక్కనే తేనాంపేట జంక్షన్ దగ్గరున్న ఎస్టీడీ బూత్ కి వెళ్లారు. ఐఎస్డీ కాల్ చేసి రష్యాలో ఉన్న ఆపరేటర్ తో మాట్లాడి తాము పంపిన రెండు టేప్స్ లో వరుస మారిందని, ఆ టేప్ ఆపేసి రెండో టేప్ ముందు వేయాలని చెప్పారు.

అలా అర్థగంట తరువాత మొత్తానికి సినిమా మళ్ళీ మొదటి భాగంతో మొదలైంది. అదీ సన్ టీవీ తొలి రోజు అనుభవం. కానీ రెండేళ్ళు తిరక్కముందే మూడు చానల్స్ నడిపే స్థాయికెదిగింది. కన్నడ, తెలుగు చానల్స్ కు ట్రాన్స్ పాండర్ అద్దెకివ్వగలిగింది.

*****
1995 ఫిబ్రవరి 4 శనివారం సాయంత్రం 7 గంటలు…
చెన్నై కేథడ్రల్ రోడ్ లో చోళా షెరటన్ హోటల్….
జెమిని టీవీ పేరుతో ప్రైవేట్ చానల్ ప్రారంభిస్తున్నట్టు ప్రకటించేందుకు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం.

అప్పటికి మద్రాసులో సన్ టీవీ ప్రసారాలు బాగా ఊపందుకున్నాయి, తమిళం తెలిసిన తెలుగు వాళ్ళు అవి చూస్తూనే అక్కడి దూరదర్శన్ లో వారానికొకరోజు వచ్చే తెలుగు కార్యక్రమాలతో సరిపెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు దేశమంతటా.. ఆ మాటకొస్తే చాలా దేశాల్లో తెలుగు ప్రసారాలు అందుబాటులోకి రాబోతున్నాయని జెమినీ ప్రకటించింది.

సినీ దిగ్గజం ఎల్వీ ప్రసాద్ మనుమలు (పెద్దకొడుకు ఆనంద్ బాబు కొడుకులు) రవిశంకర్ ప్రసాద్, మనోహర్ ప్రసాద్ ఆ విధంగా జెమినీ టీవీకి శ్రీకారం చుట్టారు. కానీ రోజుకు కేవలం మూడు గంటలే. సాయంత్రం 6 నుంచి 9 వరకు. అప్పట్లో శాటిలైట్ ట్రాన్స్ పాండర్ చాలా ఖరీదెక్కువ. కార్యక్రమాల తయారీ ఖర్చుకంటే అదే ఎక్కువ భారం. రష్యన్ శాటిలైట్ గాంజాంట్ లో ట్రాన్స్ పాండర్ కొనుక్కొని సన్ టీవీ, సన్ మ్యూజిక్, సన్ మూవీస్ పేర్లతో మూడు చానల్స్ నడుపుతున్న సన్ యాజమాన్యం దగ్గర జెమినీ టీవీ మూడు గంటల సమయం కొనుక్కుంది.

ఫిబ్రవరి 9 సాయంత్రం 6 గంటలు
జెమినీ గ్రూప్ లోగో ప్రతిఫలించేలా బూర ఊదుతున్న ఇద్దరు పిల్లలుండే యానిమేటెడ్ లోగోతో మొదలై తొలి తెలుగు శాటిలైట్ చానల్ ప్రసారాలు మొదలయ్యాయి. సన్ టీవీ ట్రాన్స్ పాండర్ లో సమయం కొనుక్కోవటం వలన సన్ మ్యూజిక్ చానల్ లోనే సాయంత్రం 6 నుంచి 9 దాకా జెమినీ ప్రసారాలు వచ్చేవి.

పాటలు, సినిమా సమాచారమే ప్రధాన కార్యక్రమాలు. దర్శకుడు జయంత్ సి పరాంజి ఆధ్వర్యంలో సంతూర్ టాప్ టెన్ ( కవిత, సుమ, ఝాన్సీ, అనితా ఆప్టే ) యాంకర్లుగాను, పద్మిని అగర్ బత్తీల వారి సప్తస్వరాలు పేరుతో సినీనటి రాశి యాంకర్ గా మరో కార్యక్రమం, డైరెక్టర్ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో డయల్ యువర్ సాంగ్ అనే కార్యక్రమం అప్పట్లో బాగానే ఆకట్టుకున్నాయి.

రంగుల రాట్నం పేరుతో నిర్మాణంలో ఉన్న సినిమాల సమాచారంతో స్టుడియో రౌండప్, విడుదలైన సినిమాల మీద సమీక్షలా ప్రేక్షకుల అభిప్రాయాలతోకూడిన స్పందన ప్రసారమయ్యేవి. సన్ టీవీ లో విసు నడుపుతున్న అరట్టై అరంగం చూసి ప్రభావితులైన జెమినీ ప్రమోటర్లు తమ చానల్ లో అలాంటి కార్యక్రమం ఉండాలనుకున్నారు.

చానల్ ప్రారంభమైన కొద్దిరోజులకే గొల్లపూడి మారుతీరావు గారు యాంకర్ గా రాష్ట్రమంతటా వివిధ కేంద్రాల్లో షూట్ చేసిన ప్రజావేదిక (దీని మాతృక తమిళ కార్యక్రమం) ప్రసారం చేయటం మొదలుపెట్టారు.

ఈ కార్యక్రమాలన్నీ హై బాండ్ టేప్స్ లో చెన్నై పంపితే అక్కడ వాటిని మళ్ళీ సూపర్ విహెచ్ఎస్ కాసెట్లోకి మార్చే వాళ్ళు. తక్కువ పరిమాణంలో ఉండటంతో బాటు ఒక్కో కాసెట్ లో మూడేసి గంటలు రికార్డు చేయగలిగే వీలుండటమే అందుకు కారణం. నాలుగైదు రోజులకు సరిపడా క్యాసెట్లు అలా రష్యా వెళ్ళేవి.

అప్పట్లో హైదరాబాద్ లో అంతర్జాతీయ విమానాశ్రయం లేకపోవటం కూడా చెన్నై నుంచే పంపటానికి కారణమైంది. మరోవైపు చెన్నైలో ఉన్న సినిమా నిర్మాతలు కొంతమంది టీవీ కార్యక్రమాల తయారీకి కూడా మొగ్గుచూపారు. ఆ తరువాత కాలంలో డబ్బింగ్ సీరియల్స్ మొదలయ్యాక డబ్బింగ్ పరిశ్రమ అండదండలు కూడా బాగా ఉపయోగపడ్డాయి. అలా ఆరు నెలలపాటు జెమినే ఒక్కటే తెలుగు శాటిలైట్ చానల్ గా నిలబడింది.

ఈటీవీ పకడ్బందీ ఏర్పాట్లతో అదే సంవత్సరం ఆగస్టు 27న మొదలైంది. అప్పటికే వెయ్యికి పైగా సినిమాల ప్రసార హక్కులు కొనుక్కుంది. మధ్యాహ్నం 12 గంటలనుంచి అర్థరాత్రి 12 గంటలదాకా ప్రసారాలందించడంతో సహజంగానే ఎక్కువమందిని ఆకర్షించగలిగింది. ఈటీవీలో సినిమాల ప్రసారం మరింతగా ఆకట్టుకుంది, అప్పట్లో ఈటీవీ ఫిలిప్పైన్స్ శాటిలైట్ ను ఉపయోగించుకొని ప్రసారాలు అందించేది.

అప్పటి నుంచి ప్రసార సమయం విషయంలో పోటీ పెరిగింది. జెమినీ మరింత సమయం పొడిగించి ఉదయం 6 గంటలనుంచి అర్థరాత్రి 12 గంటలదాకా ప్రసారాలందించటం మొదలుపెట్టింది.

జెమినీ టీవీకి శాటిలైట్ ట్రాన్స్ పాండర్ సౌకర్యం కల్పించిన సన్ టీవీ ఆ బకాయిల కింద చానల్ లో సగం వాటా తీసుకోవటానికి సిద్ధమైంది. కన్నడలో ఉదయ టీవీని కూడా అలాగే సొంతం చేసుకుంది, (నిజానికి స్టార్ టీవీ మొదట్లో జీ టీవీకి ఇలాగే ట్రాన్స్ పాండర్ అద్దెకిచ్చి ఆ బకాయిలకింద జీటీవీలో పెద్దమొత్తంలో వాటాలు తీసుకుంది. సన్ టీవీ అదే బాటలో నడిచింది)

etv

అప్పటికి సన్ టీవీ అప్ లింకింగ్ సింగపూర్ కి మార్చింది. ఈటీవీ కొంతకాలానికి ఫిలిప్పైన్స్ నుంచి మారి శ్రీలంక నుంచి అప్ లింక్ చేయటం మొదలుపెట్టింది. అలా శ్రీలంక నుంచి ప్రసారం చేసే వెసులుబాటు వచ్చాక చెన్నైలో వార్తలు తయారుచేసి, ఆ టేపు కొలంబో పంపి ప్రసారమయ్యేలా చేసింది.

‘ఆంధ్రావని’ పేరుతో మరుసటి రోజు ప్రసారమైనా అప్పట్లో ఆ వార్తలు బాగానే ఆకట్టుకోగలిగాయి. ఇలా ఈటీవీ కూడా ఉదయం 6 నుంచి ప్రసారాలు మొదలుపెట్టినప్పుడు జెమిని 24 గంటలకు పెంచింది. అయినా సరే ఈటీవీ మాత్రం చాలాకాలం ఆర్థరాత్రి 12కు ‘శుభరాత్రి’ చెప్పేసి ముగించేది. ఏడాదికి పైగా అలా సాగిన తరువాత సొంత అప్ లింకింగ్ సౌకర్యం వచ్చింది. అప్పుడు గాని 24 గంటలకు పొడిగించలేదు.

అప్పట్లో ఎన్నికల ఫలితాలు ప్రసారం చేయవలసి వస్తే ఈటీవీ ఘంటసాల కొడుకు, ఆర్టిస్ట్ అయిన రత్నకుమార్ ను, సీనియర్ జర్నలిస్ట్, ప్రొఫెసర్ అయిన మృణాళినిని కొలంబో పంపింది. జెమినీ వాళ్ళకు అప్పటికి న్యూస్ విభాగం లేకపోవటంతో వాళ్ళకు తెలిసిన ఒకప్పటి జర్నలిస్ట్ గొల్లపూడి మారుతీరావు సాయం తీసుకున్నారు.

ఆయన తొలినాళ్ళలో ఆంధ్రప్రభలో పనిచేసి ఉండటంతో వాళ్ళ అనుమతి తీసుకొని మద్రాసు ఆంధ్రప్రభలో కూర్చొని ఏజెన్సీ కాపీలు, ఆంధ్రప్రభ వార్తలు చూస్తూ రాసుకొని ఫాక్స్ చేస్తే సింగపూర్ లో కూర్చొన్న యాంకర్ చదివారు. అప్పుడు సింగపూర్ పంపాలనుకున్న యాంకర్స్ ఎవరికీ పాస్ పోర్ట్ లేకపోవటంతో అప్పటికప్పుడు అందుబాటులో ఉన్న సుమిత్ర పంపన అనే వీడియో ఎడిటర్ ను పంపారు. ఇప్పుడామె సీరియల్స్ లో నటిస్తున్నారు.

ఇక వార్తల విషయానికొస్తే ఈటీవీ చాలా ముందుంది. వి-శాట్ సౌకర్యాన్ని వినియోగించుకునేది. డిల్లీలోకూడా వార్తల రూపకల్పనకు ఏర్పాట్లు చేసుకొని ప్రాధాన్యాన్ని బట్టి ఆరోజు ఢిల్లీ వార్తలు ముందు ఇవ్వాలా, చెన్నై వార్తలు ముందు ఇవ్వాలా అనేది నిర్ణయించుకునేవారు.

రెండు చోట్లా న్యూస్ రీడర్స్ ఉండేవారు. అలా రెండు ప్యాకేజీలు తయారై ప్రసారమయ్యేవి. పనిభారం తగ్గటం లాంటి సౌలభ్యమున్నా, పూర్తిగా ప్రాధాన్య క్రమం పాటించటం సాధ్యమయ్యేది కాదు. అలా మొదలైన ఈటీవీ వార్తలు వరుసగా బులిటెన్స్ పెంచుకుంటూ వచ్చాయి. రాత్రి 9 గంటల బులిటెన్ అప్పటినుంచి బాగా ప్రాచుర్యం పొందింది.

మరోవైపు జెమినీ టీవీ 1998 ఫిబ్రవరిలో చెన్నైకి చెందిన ఆప్ట్ టీవీ అనే సంస్థ చేత వార్తలు తయారు చేయించేది. ఆంధ్రప్రదేశ్ నుంచి వార్తలు తెప్పించుకునేందుకు తగిన సౌకర్యాలు లేక ఎక్కువగా జాతీయ అంతర్జాతీయ వార్తలనే అనువదించి ప్రసారం చేసేవారు. బిజెపి నాయకుడు వెంకయ్యనాయుడు అప్పట్లో జెమినీ వార్తలు చూసి తెలుగులో బిబిసి చూస్తున్నట్టుందని వ్యాఖ్యానించటానికి కారణం స్థానిక వార్తలు లేకపోవటమే.

1998 మే1 నుంచి జెమినీ పూర్తి స్థాయిలో వార్తల ప్రసారానికి సొంత వ్యవస్థ ఏర్పాటు చేసుకుంది. భారత దేశం నుంచి పంపుకునే వీలున్నా, అప్పటికీ ప్రభుత్వం ఇంకా అనుమతించకపోవటంతో విఎస్ఎన్ఎల్ కేంద్రం నుంచి ముందుగా సింగపూర్ కి, ఆ తరువాత అక్కడి నుంచి అప్ లింక్ చేయాల్సి వచ్చేది. అంటే, రాత్రి 8 గంటలకు వార్తలు ప్రసారం కావాల్సి ఉంటే అప్పటికే సింగపూర్ లో ఆ వార్తలు డౌన్ లింక్ అయి ఉండాలి. అంటే ఏడు గంటలకే పంపాల్సి వచ్చేది.

అందుకే మూడు భాగాలు చేసి రెండు, మూడు భాగాలు ముందుగా పంపి, మొదటి భాగాన్ని ఏడున్నర తరువాత పంపేవారు. ఏడాదిపాటు ఇలాంటి కష్టాలు సాగిన తరువాత చెన్నై విఎస్ఎన్ఎల్ నుంచి నేరుగా పంపే వెసులుబాటు కలిగింది.

అప్పుడూ సమస్యలు పూర్తిగా తీరలేదు. ఈటీవీ, జెమినీ టీవీ సిబ్బంది అనివార్యంగా చెన్నైలోని దూరదర్శన్ కార్యాలయం పక్కనే ఉన్న విఎస్ఎన్ఎల్ కు న్యూస్ కాసెట్లతో పరుగులు తీయాల్సి వచ్చేది. తొలితరం సిబ్బందికి ఇదొక విచిత్రమైన అనుభవం.

ప్రసార సమయానికి పది నిమిషాల ముందు ఒకరు టూ వీలర్ తో రోడ్డు మీద సిద్ధంగా ఉండేవారు. ఆరేడు నిమిషాల టేప్ తయారవుతున్నప్పుడే అన్ని తలుపులూ తెరచి ఉంచితే టేపుతో ఒకరు పరుగు తీసి ఆ బైక్ ఎక్కేవారు. మళ్ళీ ఇంకో వాహనం ఆ తరువాత భాగం తీసుకెళ్ళటానికి సిద్ధమయ్యేది. అప్పటికింకా నాన్ లీనియర్ ఎడిటింగ్ లేదు కాబట్టి వరుసగా ఒక్కో కాసెట్ వెళ్ళేది. బ్రేకింగ్ న్యూస్ వస్తే అదనంగా మరో కాసెట్ పరుగు తీయాల్సి వచ్చేది.

మౌంట్ రోడ్డులో నాలుగైదు నిమిషాల్లో నాలుగు కిలోమీటర్ల దూరం ప్రయాణించి చేరుకోలేకపోతే ఖాళీ తెర కనిపించే ప్రమాదముండటంతో ప్రతిరోజూ ప్రాణాలకు తెగించేంత సాహసం చేయాల్సి వచ్చేది. జెమినీ టీవీలో అప్పట్లో ఫైనాన్స్ మేనేజర్ గా పనిచేస్తున్నప్పటికీ న్యూస్ పని కూడా భుజాన వేసుకొని స్వయంగా బైక్ నడుపుకెళ్ళిన గిరిధర్, ఇప్పుడు తమిళ సినిమాల్లో డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లో పనిచేస్తున్న అప్పటి న్యూస్ కో ఆర్డినేటర్ ప్రేమ్ కుమార్ లాంటి వాళ్ళ వేగం తలుచుకుంటే వళ్ళు గగుర్పొడిచేది.

బైక్ మీద వెనుక కూర్చున్న వ్యక్తి చేతిలో క్యాసెట్ చూపించగానే ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర పోలీసులకు అర్థమయ్యేది. అందుకే చూసీ చూడనట్టు వదిలేసేవారు. (అప్పుడున్నది డిఎంకె ప్రభుత్వం, జెమిని టీవీ అప్పటికే సన్ పరిధిలోకి వచ్చింది)

ఇది గమనించిన ఈటీవీ వాళ్ళు కూడా ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర సన్ టీవీ పేరు చెప్పి వెళ్ళేవారు. అయితే, వాళ్ళకు కాసెట్ ఆలస్యమైనప్పుడు సొంత కార్యక్రమాల ప్రకటనలు (ప్రోమోలు) వేసుకునే వెసులుబాటు ఉండటం వలన మరీ నరాలు తెగేంత ఉత్కంఠ ఉండేది కాదు)

ఈటీవీ హైదరాబాద్ ఫిల్మ్ సిటీలో సొంత ఎర్త్ స్టేషన్ ఏర్పాటు చేసుకోగానే 2000 సంవత్సరంలో చెన్నై నుంచి తరలి వెళ్ళింది. జెమిని టీవీ అదే సంవత్సరం తేజా టీవీ పేరుతో మరో చానల్ ప్రారంభించింది. వార్తలు తేజా టీవీకి మారాయి. 2003 డిసెంబర్ 29 న తేజా టీవీ వార్తల విభాగం హైదరాబాద్ కి వెళ్ళటం మొదలైంది. సరిగ్గా అదేరోజు ఈటీవీ 2 పేరుతో న్యూస్ చానల్ ప్రారంభించింది.

తొలితరం తెలుగు దిన పత్రిక ఆంధ్రపత్రికకూ, సినిమా రంగానికీ కేంద్రమైన చెన్నపట్టణమే తెలుగు శాటిలైట్ చానల్స్ ప్రారంభ సన్నివేశానికీ వేదికయింది.

ఆ తరువాత కాలంలోనూ తెలుగు చానల్స్ డబ్బింగ్ సీరియల్స్ మీద ఆధారపడుతుండగా చానల్స్ వాళ్ళు చెన్నై మీద ఆధారపడక తప్పటం లేదు. అనేక సీరియల్స్ చెన్నైలోనే తయారయ్యేవి. నేషనల్ జాగ్రఫీ, డిస్కవరీ, కార్టూన్ నెట్ వర్క్ లాంటి చానల్స్ తెలుగు విభాగాలకు డబ్బింగ్ కూడా చెన్నైలోనే నడుస్తూ వచ్చింది.

హైదరాబాద్ లో కూడా ఎర్త్ స్టేషన్ ఏర్పాటు చేసుకునే వెసులుబాటు ఉన్నా ఇప్పటికీ డజన్ చానల్స్ చెన్నై నుంచే అప్ లింక్ అవుతున్నాయి. తెలుగు టీవీ పరిశ్రమకు చెన్నై తో అనుబంధం అలా కొనసాగుతూనే ఉంది.

ప్రధాన తెలుగు దినపత్రికలన్నీ చెన్నైలో ఎడిషన్ మొదలుపెట్టినట్టే న్యూస్ చానల్స్ అన్నీ చెన్నైలో ప్రతినిధులను నియమించుకున్నాయి. చెన్నైలో తెలుగు వాళ్ళున్నంతకాలం ఈ అనుబంధం కొనసాగుతుంది….. – తోట భావనారాయణ

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • చైన్లు కాదు గానీ… అప్పట్లో మా కొట్లాటల్లో సోడా బుడ్లు పగిలేవి బాగా…
  • సరిగ్గా 30 ఏళ్లు… తెలుగు శాటిలైట్ చానెళ్ల తొలి రోజుల బాలారిష్టాలు…
  • 25 లక్షల లైకుల వైరల్ ఇన్‌స్టా పోస్ట్… ఇంతకీ ఏముందీ ఇందులో..?
  • బయట హరీష్ ప్రచారం వేరు… సిట్ అసలు విచారణ నిజాలు వేరు…
  • పెళ్లికాని ప్రసాదులు..!! నిజానికి సీరియస్ వార్తే… రాబోయే సంక్షోభాల సూచన..!!
  • లక్షల మిర్చి బజ్జీలు… వేల భక్ష్యాలు… కర్నాటక జాతరల స్పెషాలిటీ…
  • జోలా జోలమ్మ జోలా… ఈ సినిమాకు ‘సూత్రధారులు’ ఎవరయ్యా అంటే…
  • థాంక్స్ రెహమాన్… నీ అభిమానుల కళ్లు కూడా తెరిపించావు…
  • అబుదాబి ఆయిల్ క్షేత్రాల్లో… ఇండియా సొంత ఉత్పత్తి… శుభసంకేతం…
  • దంపతులకు జాయింట్ టాక్స్ … మధ్యతరగతికి ‘బడ్జెట్’ వరం..?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions