అట్టహాసం, ఆడంబరం అనేవి అధికార ప్రదర్శనలో కనిపించే పైత్యపు లక్షణాలు… ఈరోజుల్లో జెడ్పీటీసీలు కూడా కాన్వాయ్ మెయింటెయిన్ చేస్తున్నారు… ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, వీవీఐపీల ఎస్కార్ట్ కోసమే సగం మంది పోలీసులు పనిచేస్తున్న దురవస్థ మనది… ఎక్కడో ఏదో చదువుతుంటే మళ్లీ మన మాజీ రక్షణ మంత్రి మనోహర్ పరీకర్ వార్త ఒకటి కనిపించింది… దానికితోకలాగా మరో రెండు చిన్న వార్తలు…
అన్నీ పరీకర్ నిరాడంబరత్వం గురించే… తన నిరాడంబరత ప్రజలకు చూపించడం కోసం, అది ఆయన రక్తంలో ఉంది… తత్వంలో ఉంది… సహజ లక్షణం ఆయనకు… గోవాలో ఎక్కడ బడితే అక్కడ ఆగిపోయి, చాయ్ తాగుతూ అందరినీ పలకరిస్తూ ఓ సగటు మనిషిలా బతికేవాడు… తను సీఎం అయ్యాక కూడా పోలీస్ ఎస్కార్ట్ లేకుండానే తిరిగేవాడు… జస్ట్, ఒక సెక్యూరిటీ ఆఫీసర్ మాత్రం తన వెంట పరుగులు తీస్తూ ఉండేవాడు…
ఓరోజు సెక్యూరిటీ చెక్‌లో భాగంగా ఓ గూర్ఖా (గార్డ్) తనను స్టార్ హోటల్ Cidade De Goa వద్ద ఆపాడు… తన పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ కాస్త దూరంలో ఉన్నాడు… బాబూ, నేను ఈ రాష్ట్రానికి సీఎంను, ప్రోగ్రామ్‌కు చీఫ్ గెస్ట్‌ను అని చెప్పుకున్నాడు… వాడు వినిపించుకోలేదు… పరీకర్ అక్కడే ఆగిపోయి, తన సెక్యూరిటీ ఆఫీసర్ వచ్చాక తనతో చెప్పించి ప్రోగ్రామ్ స్థలం వైపు వెళ్లాడు… నిజానికి తనను రిసీవ్ చేసుకోవడానికి గేటు దగ్గర ఎవరూ లేకపోవడం ఆ నిర్వాహకుల తప్పు…
Ads
‘‘ఏం చేస్తాం ఫ్రెండ్స్, ఒకే గూర్ఖా నన్ను మెయిన్ గేటు వద్ద అయిదు నెలలో అయిదుసార్లు ఆపాడు… డ్యూటీ పట్ల తన సిన్సియారిటీకి మెచ్చుకోవాలో, సీఎంను గుర్తించలేకపోవడం చూసి నవ్వుకోవాలో అర్థం కాలేదు… ఐనా ఒక గూర్ఖాకు సీఎం ఎవరైతేనేమిటి..? ఫలానావాడు సీఎం అని తెలియాల్సిన అవసరం ఏముంది..?’’ అన్నాడు ఆ ప్రోగ్రామ్‌లో పరీకర్… దటీజ్ పరీకర్… (ఇది 2012 మెయిల్ టుడేలో వచ్చిన వార్త)…
తన దగ్గర ఐటీ అడ్వయిజర్‌గా పనిచేసిన Dr Anupam Saraph కూడా ఏదో వ్యాసంలో ఇలాంటివే రెండు మూడు సంఘటనలు రాసుకొచ్చాడు… ‘‘చాలామంది మంత్రులు తమ వద్దకు వచ్చిన ఫైళ్లను సింపుల్‌గా పర్సనల్ సెక్రెటరీలకు అప్పగించి, సంతకాలు చేసేవాళ్లు. కానీ పరీకర్ తను చదివేవాడు, తెలియకపోతే అడిగేవాడు… ఐఐటీయన్ కదా ఫైళ్లను వేగంగా చదివి అర్థం చేసుకోగలడు… ఐటీ సెక్టార్, గవర్నెన్స్‌కు సంబంధించి అర్ధరాత్రి వరకూ నాతో మాట్లాడేవాడు…
తన డ్రైవర్‌ను లేటవుతోంది, నువ్వు వెళ్లు అని పంపించేసేవాడు… ఏ అర్ధరాత్రో నేను వెళ్లి అధికార నివాసంలో దింపివచ్చేవాడిని, పొద్దున్నే 7 గంటలకు వచ్చెయ్ అనేవాడు… ఓరోజు 7 గంటలకు వెళ్లి తలుపు కొడితే, ఆయన వదిన తలుపు తీసింది… తను హడావుడిగా లేటయిపోయిందని గొణుక్కుంటూ పాలు తెచ్చుకోవడం కోసం మిల్క్ బూత్ వైపు గబగబా నడిచివెళ్లింది… ఆయనకు సలహాదారుడిని కదా, తరచూ ఢిల్లీ, ముంబై ఆయనతోపాటు వెళ్లేవాడిని… ఓరోజు నేను ముంబై ఎయిర్‌పోర్టులో వెయిట్ చేస్తున్నాను… ఈయన ఓ ఆటో రిక్షాలో వచ్చాడు… సెక్యూరిటీ వాళ్లు ఎంతకూ నమ్మడం లేదు సీఎం అంటే… ఐడీ కార్డు చూపించినా సరే అనుమానంగా చూస్తున్నారు… నేను వెళ్లి చెప్పాక, సందేహంగా చూస్తూనే లోపలకు అనుమతించారు…
తన బ్యాగు తనే పట్టుకుపోయేవాడు… వేరేవాళ్లకు ఇవ్వడం, మోయించడం ఉండేది కాదు… ఓసారి కొత్త కారు కొన్నాడు ఫ్యామిలీ అవసరాల కోసం… ఓ రాత్రిపూట తన కొత్త కారు ఆనందంగా డ్రైవ్ చేస్తూ మపూస వైపు వెళ్తున్నాడు… మాండవి బ్రిడ్జి దగ్గర సెక్యూరిటీ ఉంటుంది… ఓ కానిస్టేబుల్ కారు ఆపాడు… నేను సీఎంను అని చెబితే వినిపించుకోడు, రాత్రయితే చాలు, గోవాలో అందరూ సీఎంలే అంటూ లైసెన్సులు చూపించు అన్నాడు… కొత్త కారు కదా, ఈయన డ్యాష్ బోర్డులో ఏదో ఉంటే తీసి చూపించాడు… ‘‘ఇది టెంపరరీ రిజిస్ట్రేషన్, పర్మనెంట్ తీసుకోవాలి’’ అని వదిలేశాడు… మరుసటి రోజు డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ ఎవరో వివరాలు తెప్పించుకుని, ప్రమోషన్ ఇచ్చాడు… డ్యూటీ అంటే ఇలా చేయాలి అని రాష్ట్ర పోలీసులకు ఓ సంకేతం ఇచ్చాడు…
తను బయటికి ఎలా కనిపించినా సరే, చాలా సున్నిత మనస్కుడు, నిజానికి రాజకీయాలకు పనికిరాడు… అన్నిరంగాల్లో లీడర్లను డెవలప్ చేసేందుకు మనం ఓ భిన్నమైన ఇంటర్నేషనల్ స్కూల్ పెడదాం సార్, ఆ స్కూల్ రాజకీయ నాయకులకే కాదు, భిన్న రంగాల్లో లీడర్లకు ముందుగా నైతిక విలువల మీద శిక్షణను.., తరువాత గవర్నింగ్ మీద, కొత్త టెక్నాలజీల మీద శిక్షణ ఇద్దాం అని ప్రతిపాదించాను ఓసారి…
మొత్తం విన్నాడు, సందేహాలు అడిగాడు… తరువాత ఆయన కళ్ల వెంట నీళ్లు… మనం కాదు, ప్రతి రాష్ట్రంలోనూ ఇలాంటివి కావాలి కదా… లీడర్లు ఏ ఫీల్డులో ఉన్నా సరే, నైతికత, మానవీయత అవసరం ఉన్న రోజులివి అన్నాడు… నిజానికి రాజకీయాల్లో క్షుద్రత్వం భరించలేక సన్యాసం స్వీకరించాలని అనుకున్నాడు… నాతో చెప్పాడు… పరీకర్ వంటి నాయకుడిని మళ్లీ ఈ దేశం చూడబోదు…’’ (రాత్రిపూట అనామకంగా ఓ రైలులో ప్రయాణం, వేరే రాష్ట్రానికి ప్రైవేటు కారులో వెళ్లి అందరిలాగే పావ్ బాజీ ఆర్డర్ ఇవ్వడం వంటి ఇంకొన్ని సంఘటనలు మళ్లీ ఎప్పుడైనా చెప్పుకుందాం…)
Share this Article