మీరు మాట్లాడలేరు… కనీసం సంజ్ఞలతోనూ చెప్పలేరు… మరి మీ భావాన్నెలా ప్రకటించాలి..? కానీ మీ మెదట్లో పుట్టే ఆలోచలను కృత్రిమ మేధతో కంప్యూటీకరించి… ఇతరులకు మీ భావమేంటో స్పష్టం చేయగల్గితే..? అదే.. ‘ఆల్టర్ఈగో’ అంటున్నారు ఢిల్లీకి చెందిన ఆర్నవ్ కపూర్. మసాచూసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో పోస్ట్ డాక్టరేట్ స్కాలర్ గా ఉన్న ఆర్నవ్ కపూర్ రూపొందించిన ఈ పరికరం టైమ్స్ గుర్తించిన జాబితాలో ఇప్పుడు ప్రపంచంలోనే వంద అద్భుతమైన పరిశోధనల్లో ఒక్కటిగా నిల్చింది. ఆ ముచ్చటేందో ఓసారి చెప్పుకుందాం పదండీ.
స్టీఫెన్ విలియమ్ హాకింగ్… గుర్తున్నారుగా..? ఆ ప్రసిద్ధ సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్తను మనమిప్పుడోసారి పైన చెప్పకునే కథలోకి వెళ్లే ముందు మననం చేసుకోవాలి మరి. హాకింగ్ శరీరం చాలావరకూ చచ్చుబడిపోయినా ఆయన జీవితాంతం ఒకే ఒక్క దవడ ఎముక కదులుస్తూ… దానికి అమర్చిన సంభాషణలను ఉత్పత్తి చేసే పరికరాన్నుపయోగించి సంభాషించేవాడు. ఎమియోట్రోఫిక్ లేటరల్ స్కెర్లోసిస్ అనే నాడీమండలానికి సంబంధించిన జబ్బు వల్ల క్రమక్రమంగా దశాబ్దాల తరబడి శరీరభాగాలు చచ్చుబడిపోయినా… కృష్ణబిలాలపై పరిశోధన చేసిన స్టీఫెన్ విలియం హాకింగ్ స్టోరీ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న ఈ స్టోరీకి ఓ ఉదాహరణలా కూడా కనిపిస్తుంది.
Ads
ఇంతకీ అసలు విషయం ఏంటంటారా..? మన ఢిల్లీకి చెందిన 25 ఏళ్ల ఆర్నవ్ కపూర్ తన సోదరుడు శ్రేయాస్ తో పాటు… MIT మీడియా ల్యాబ్‌లోని తోటి పరిశోధకులతో కలిసి ప్రయోగాత్మకంగా ఓ మైండ్ రీడింగ్ హెడ్ సెట్ ను రూపొందించారు. దానిపేరే మనం మొదట చెప్పకున్న ‘ఆల్టర్ఈగో’. ఏంటీ దీని ప్రత్యేకత అంటారా..? నరాల బలహీనతతో పాటు… శరీరంలో సరిగ్గా పనిచేయని కొన్ని అవయవాల సమూహంగా చెప్పుకునే సెర్రిబ్రల్ పాల్సీ అనే వ్యాధితో బాధపడే వారు పూర్తిగా చచ్చుబడిపోయినప్పుడు… కనీసం వారేం చెప్పదల్చుకుంటున్నారో కూడా అర్థం కాని పరిస్థితుల్లో… వారి మెదట్లో పుట్టే ఆలోచనలను చదివి ఆ ఆలోచనలనే మనకు స్పష్టమైన భావంగా రూపాంతరం చేసి అందించగల్గే వినూత్న పరికరమే ఆర్నవ్ కపూర్ ఇతర సహచర పరిశోధకులతో కలిసి తయారుచేసిన ఈ ఆల్టర్ఈగో అనే మైండ్ రీడింగ్ హెడ్ సెట్.
ఉదాహరణకు ఎప్పుడో గతంలో కద్రి గోపాలనాథ్ స్యాక్సాఫోన్ వాద్యకచేరీ విన్నప్పుడు కల్గిన అనుభూతిని గురించి సదరు సెర్రిబ్రల్ పాల్సీ లేదా లేటరల్ స్కెర్లోసిస్ వంటి వ్యాధులతో బాధపడుతున్నవారు చెప్పదల్చుకున్నారే అనుకుందాం. వారి మెదట్లో ఉన్న ఆలోచనలను సదరు ఆర్నవ్ కపూర్ అండ్ టీం తయారు చేసిన హెడ్ సెట్ తో కూడిన ఆల్టర్ఈగో అనే పరికరంలోని సెన్సార్స్ గ్రహించడంతో పాటు… చెప్పాలనుకునే విషయాన్ని ముఖకవళికలు, లోపలి వోకల్ కార్డ్స్ కదలికలు వంటివాటిని కూడా సంగ్రహించుకుని కంప్యూటర్ ద్వారా అనుసంధానమై స్పీకర్స్ ద్వారా ఇతరులకు చేరవేయడమే ఈ పరికరం ప్రత్యేకత. దాదాపు 92 శాతం సదరు రోగపీడిత వ్యక్తులు ఏం చెప్పదల్చుకున్నారో దాన్ని కచ్చితంగా విశ్లేషించే పరికరం కాబట్టే… ఇప్పుడీ ఆల్టర్ఈగోను ప్రపంచంలోని వంద ఈ ఏటి మేటి ఉత్తమ పరిశోధనల్లో ఒక్కటిగా టైమ్స్ గుర్తించింది. దీనివల్ల నరాలు చచ్చుబడిపోయి జీవశ్ఛవాలుగా ఏమీచేయలేకపోతున్నామనుకునే వారికి చిమ్మచీకట్లో ఇదో చిరుదీపంలాంటి పరికరం మరి!
వాణిజ్యపరంగా ఇంకా మార్కెట్ లో అందుబాటులోకి రాని ఈ ఆల్టర్ ఈగో పరికరం… ఇప్పుడిప్పుడే కొన్ని ఆసుపత్రుల్లో రోగులకు ఎలా పనిచేస్తుందో పరీక్షీస్తున్న దశలో ఉండగా… అమియోట్రోఫిక్ ల్యాటరల్ స్కెర్లోసిస్ వంటి వ్యాధుల బారినపడి వారనుకున్న విషయాలను కమ్యూనికేట్ చేయలేని వారి కోసం ఈ పరికరం ఉపయోగపడనున్నట్టు మసాచూసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వెబ్ సైట్ పేర్కొంటోంది. అనుకున్నట్టుగా ఈ ఆల్టర్ ఈగో అనే పరికరం మార్కెట్ లోకి అందుబాటులోకొస్తే మాత్రం కచ్చితంగా ఎంతో మేధస్సుండి ఏమీ చేయలేని ఎందరో స్టీఫెన్ హాకింగ్స్ ప్రతిభ బయటకొచ్చే అవకాశముంటుంది.
- రమణ కొంటికర్ల
Share this Article