Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

జోలా జోలమ్మ జోలా జేజేలా జోల… విశ్వనాథుడి లాలిపాటల మాధుర్యం….

August 3, 2024 by M S R

.. కాశీనాథుని విశ్వనాథ్ … ఈ పేరు వినగానే … పాటల మీద కాస్త దృష్టి పెట్టే డైరెక్టర్ అనిపిస్తుంది. ఆయన తొలి చిత్రం ఆత్మగౌరవం నుంచీ ఒక నిబంధనలా … సంగీత సాహిత్య సమలంకృత గీతాలను మనకి అందించడానికి కంకణ బద్దులైనట్టు కనిపిస్తుంది. రాజేశ్వర్రావుగారి స్వరరచనలో ఆయన తొలి చిత్రంలో ఈ పాట చూడండి …

అందెను నేడే అందని జాబిల్లీ… ఇలా హాయైన సంగీతాన్ని అందించడమే కాదు … ఎందుచేతో విశ్వనాథ్ గారి చిత్రాల్లో మిగిలిన దర్శకుల చిత్రాలతో పోలిస్తే జోలపాటలు ఎక్కువగా ఉంటాయి. అసలు ఈ విషయం చెప్పడమే నా ముఖ్యోద్దేశ్యం. ఈ విషయం ఆయన గుర్తించారో లేదోగానీ … నిజం. అసంకల్పితంగా జరిగిపోయి ఉండవచ్చు. ఆయన సినిమాలకు ఆయనే కథ సమకూర్చుకోవడం వల్ల కావచ్చు … ఆయన మీద చిన్నతనంలో విన్న లాలి పాటల ప్రేరణ ఉండడం వల్లనూ కావచ్చు …

మనసు సేద తీరే లాలి పాటలు విశ్వనాథ్ గారి చిత్రాల్లోనే అధికంగా వినిపిస్తాయి … వటపత్రసాయికి వరహాల లాలీ – స్వాతి ముత్యం

Ads

తల్లి పాడే లాలి పాటలే కాదు .. ప్రేయసి పాడే లాలి పాటలనూ ఊహించగలగడం దర్శకుడుగా ఆయనలోని ఆర్ద్రతను తెలియచేస్తుంది. నిండు హృదయాలు చిత్రం కోసం కథానాయిక వాణిశ్రీ కథానాయకుడు ఎన్టీఆర్ కు జోలపాడే సందర్భం ఉంటుంది.

స్క్రిప్ట్ రాసుకునేప్పుడే అబద్దపు పల్లవులు రాసుకోవడం విశ్వనాథ్ కు అలవాటు. ఆ అలవాటు నుంచి వచ్చిన పల్లవి రామలాలీ మేఘశ్యామలాలీ … దీన్ని పుచ్చుకుని నారాయణరెడ్డి గారు కొనసాగించి చరణాలు పూర్తి చేశారు. రామలాలి మేఘ శ్యామలాలి – నిండు హృదయాలు..

జోల పాటల క్రేజ్ పెంచిన దర్శకుడుగా కూడా విశ్వనాథ్ గారిని చెప్పుకోవాలి … జోలపాట అనేది కేవలం పాట కాదు …. పిల్లలైనా పెద్దలైనా …. అలసిన మనసులకు సాంత్వన కలిగించడం లాలిపాట లక్ష్యం … సాంత్వన పొందిన మనసు నెమ్మదిగా నిద్రలోకి జారుకుని సేదతీరుతుంది …. అలా శక్తి పుంజుకుంటుంది. తిరిగి జీవన సమరంలోకి మళ్లుతుంది. ఇదే జీవన చక్రం.

ఈ మర్మాన్ని ఎరిగి ఉండడం చేత రకరకాల సందర్భాలకు ఆయన లాలి పాటల తరహా గీతాలను ఎంచుకుంటూ ఉంటారేమో అని అనుమానం.

చుక్కాల్లారా చూపుల్లారా ఎక్కడమ్మా జాబిల్లి – బాలు పాడిన వర్షన్ … అమ్మని మర్చిపోని వాడికి అమ్మ పాడిన లాలి పాటని మర్చిపోవడం కూడా కుదరదు … అమ్మతనానికీ జోలపాటకూ ఉన్న సంబంధం అది. విశ్వనాథ్ గారిలో … ఈ రెండూ చెదరకుండా ఉండడం వల్లే కావచ్చు … ఆయన సందర్భం దొరికినప్పుడల్లా లాలి పాట పెట్టేయడానికి ప్రయత్నం చేస్తూంటారు. ఆ లాలిపాటతోనే సినిమాలు విజయతీరాలు చేరిన సందర్భాలూ ఉన్నాయి. ముద్దుల మా బాబు నిద్దరోతున్నాడు – జీవన జ్యోతి…

ఏ తల్లి పాడేను జోలా ఏ తల్లి ఊపేను డోలా … ఎవరికి నీవు కావాలి ఎవరికి నీ మీద జాలి అంటూ ఓ తండ్రి కాని తండ్రి పాడే లాలిపాట వింటూ పాప ఏడుపు ఆపి నిద్రపోతుంది …. అంటరాని కులంలో పుట్టి అనాధ అయిన ఆ పాపకు లోకం తనను ఎందుకు పట్టించుకోవడంలేదో అర్ధం కాదు … ఏడ్చినా తన వైపు జాలి చూపదెందుకో పోల్చుకోలేకపోతుంది …

ఆ పాప కోసం …. కులం వదిలేసి కదిలిన ఓ హృదయం అక్కున చేర్చుకుంటుంది. ఈ సందర్భానికి దేవులపల్లి కృష్ణశాస్త్రిగారితో జోల పాట రాయించుకున్నారు విశ్వనాథ్ … ఆ సాహిత్యానికి స్వరరాజేశ్వరుడు బాణీ కట్టారు. ఘంటసాల సుశీల ప్రాణం పెట్టి పాడారు. ఏ తల్లి పాడేను జోలా – కాలం మారింది…

అంత దవ్వునుంచే అయ్యడుగులు తెలిసేనా ఓసి వేలెడంత లేవు బోసి నవ్వులదానా …. ఈ మాటలు వింటుంటేనే మనసులు పులకరిస్తాయి … ఉయ్యాలలో జాబిలి కూనల్లాంటి పిల్లలు పెద్దవాళ్లని చూసి పలకరిస్తూ … ఎత్తుకోమని చేతులు చాస్తూ … కాళ్లు కొట్టుకుంటూ …. ఉంటే చూడడం ఓ మురిపెం. సరిగ్గా ఇలాంటి సందర్భాన్ని తన సినిమా కోసం కల్పన చేశారు విశ్వనాథ్. ఇక్కడా దేవులపల్లి కృష్ణశాస్త్రిగారే … ఆ సన్నివేశానికి తన కవిత్వంతో రససిద్ది కల్పించారు. చాలులే నిదురపో జాబిలి కూనా ….

బుజ్జగిస్తూ …. లాలిస్తూ పాడే పాటలు కనుకే వీటిని జోల పాటలనీ లాలి పాటలనీ అంటారు. ఈ లాలించడానికి వారి ముందు వారికి తెలియని లోకాన్ని ఆవిష్కరిస్తూ …. పాటల్లోనే ఓ కల్పన చేస్తారు కవులు… చందమామను పిలుస్తారు … అదిగదిగో చందమామ అనగానే పిల్లలు అటు వైపు చూస్తారు …. చూసి అదేదో భలే ఉందే అనుకునే లోపు …. ఆ చందమామ నీ కోసం పాలబువ్వ తెస్తుంది … హాయిగా తినేసి బజ్జో అని చెప్తాం …
.
నిజంగానే చందమామ తెచ్చి అమ్మకు ఇచ్చిన పాల బువ్వే తినేస్తున్నానుకుని పాపాయి హాయిగా తినేసి బజ్జుంటుంది …. చందమామనే కలగంటూ …. ఇలా ప్రపంచాన్ని చూడలేని ఓ పాప చూడాలనుకున్న వెన్నెల్లో బృందావనాన్ని చూపించి మనసుకు సాంత్వన కలిగించే సందర్భాన్ని సృష్టించడానికి ఎంత తపన ఉండాలి? చందమామ రావే … సిరివెన్నెల…

అమ్మకడుపు చల్లగా … అంటూ బిడ్డకు ఆశీస్సులు ఇవ్వడం వెనకాల ఆ బిడ్డకు జన్మనిస్తూ ఆ తల్లి అనుభవించిన బాధకు అనునయింపు కూడా ఉంటుంది. బిడ్డ కేరింతలు వింటే చాలు అప్పటి వరకూ అనుభవించిన బాధనంతా ఒక్క క్షణంలో మర్చిపోతుందా మాతృహృదయం … ఈ సందర్భాన్ని పాటలో పొదివి తన సినిమాలో వినియోగించారు విశ్వనాథ్ … ఒక్క క్షణం … స్వరాభిషేకం

రొమాన్స్ కూడా లాలి పాటలోనే నడిపించడం మామూలు ఫీట్ కాదు …. నిజానికి హృద్యమైన ఆలోచన. రఘువంశ తిలకుడివై రాముడివై రమణుడివై … సీత తోనే ఉండిపోరా… గీత నువ్వే దిద్దిపోరా అంటూ కథానాయకుడ్ని ఉద్దేశించి నాయిక పాడడం నిజంగానే సొగసైన మాత్రమే కాదు సంస్కారవంతమైన ఆలోచన. జోలా జోలమ్మ జోలా – సూత్రధారులు

జోలపాటలు ఎప్పుడూ తల్లులే పాడాలని నిబందన ఏదీ లేదు కదా … పిల్లలు కూడా తల్లులకు లాలి పాడవచ్చు. కలికితనమున విధుల అలసినవుగాన లాలీ శుభలాలీ అంటూ తల్లికి లాలి పాడే సందర్భాన్ని ఊహించడం ఆ దర్శకుడి అద్భుతం అయితే …

అన్నమయ్యను తోడుగా తీసుకుని అంత చక్కటి సాహిత్యాన్ని అందించిన ఆ సాహితీమూర్తి దర్శనం. చిన్ననాటి నీ లాలి నన్ను నిదుర పుచ్చగా ఈనాటి నీ లాలి మేలుకొలుపుకాగా అంటూ …. అమ్మతనాన్ని పాటంతా నింపారు వేటూరి విశ్వనాథులు. పలుకు తేనెల తల్లి పవళించవమ్మ కలికితనమున – జననీ జన్మభూమి

స్వాతిముత్యం సినిమాలో రెండు రకాల లాలిపాటలుంటాయి. ఒకటి తల్లి పిల్లాడికి పాడే లాలి పాటైతే … మరోటి తన జీవితాన్ని ముందుకు నడిపించిన తోడు నీడ శాశ్వత నిద్రపోయిన సందర్భంలో ఆ దేవతకు పంచభూతాల లాలీ అని పాడించాలనుకోవడం …. హృదయాలను తడిమేస్తుంది … మనసులను తడిచేస్తుంది … తల్లి పిల్లవాడికి పాడే జోలపాట నారాయణరెడ్డి గారు రాస్తే …. జీవిత సహచరి అయిన దేవతకు పాడే ఈ లాలిపాటను సీతారామశాస్త్రి రాశారు. నా దేవతకు పంచభూతాల లాలి……. [ భరద్వాజ రంగావఝల ]

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • కేసీయార్ లేదా బాబు అయిఉంటే… ఈ ఈవెంట్ దద్దరిల్లిపోయేది…
  • భారత్ చేతిలో భార్గవాస్త్రం… విదేశీ డ్రోన్లకు పర్‌ఫెక్ట్ విరుగుడు మంత్రం…
  • టర్కీ, అజర్‌బైజాన్… శత్రువుకు మిత్రులు… కాళ్లబేరానికి వస్తున్నారు…
  • పాకిస్థాన్ భారీ సంఖ్యలో యుద్ధ విమానాలను కోల్పోయింది..!!
  • భారీగా బోరాన్ తరలింపు దేనికి..? ఆ అమెరికా విమానం ఏమిటి..?
  • ఆపరేషన్ సిందూర్…! కాల్పుల విరమణ అసలు కహానీ ఇదీ..!
  • ఎట్టెట్టా… ఎన్టీయార్ ఘాట్ వెళ్తే సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయా..?
  • ‘ఆ పాట’ మధురాలు… ఉన్నదే రెండు లైన్లు… సో సో ట్యూన్… ఐతేనేం..!!
  • … మరి ఇప్పుడు తెలుగు చచ్చిపోదా మాస్టారూ… మాట్లాడరు..!!
  • నూటికో కోటికో ఒక్కరు… అది మీరే మీరే మాస్టారూ… ధన్యజీవి…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions