ఖలిస్థాన్ పంచాయితీ ముదురుతోంది… కెనడా-ఇండియా నడుమ దూరం మరింత పెరుగుతోంది… తాజాగా కెనడా ప్రభుత్వం ఓ భారతీయ దౌత్యవేత్త (డిప్లొమాట్)ను దేశం నుంచి బహిష్కరించింది… ఇది కేవలం ప్రాథమిక చర్యేననీ, ఇంకా లోతుల్లోకి వెళ్లబోతున్నామని కెనడా విదేశాంగ మంత్రి మెలనీ జోలీ చెబుతోంది… ఆమే కాదు, కెనడా ప్రధాని ట్రూడా కూడా ఇండియాపై నిప్పులు చెరుగుతున్నాడు…
కారణం :: హర్‌దీప్‌సింగ్ నిజ్జర్… తను సిక్కు వేర్పాటువాది… కెనడా పౌరసత్వం కలిగినవాడు… ఖలిస్థానీ శక్తుల సమీకరణ తన పని… ఇండియాకు వాంటెడ్ టెర్రరిస్ట్… ఆమధ్య కెనడాలోనే గుర్తుతెలియని ముసుగు ఆగంతకులు తనను షూట్ చేసి చంపేశారు… అదీ కెనడా-ఇండియా నడుమ చిచ్చును రాజేసింది… మా దేశ సార్వభౌమత్వానికి ప్రమాదకరమైన వేర్పాటువాద ఉగ్ర శక్తులను కెనడా అడ్డాగా మారిందనేది ఇండియా ఆరోపణ…
నో, నో, మా జాతీయుడిని మా గడ్డ మీదే కాల్చి చంపుతారా..? ఇది మా దేశ సార్వభౌమత్వానికే ప్రమాదకరం, అవమానకరం, దుర్మార్గం అంటోంది కెనడా… నిజ్జర్ హత్య వెనుక ఇండియా ప్రభుత్వ రహస్య దళాలున్నాయని ఆ దేశం ఆరోపణ… ట్రాడా స్ట్రెయిట్‌గానే చెబుతున్నాడు ఇది… ‘‘మోడీకి కూడా మొన్నటి జీ20 సదస్సుల సందర్భంగా నా అసంతృప్తిని తెలియజెప్పాను…’’ అంటున్నాడు… రెండు దేశాల నడుమ చర్చలు కూడా ఈ కారణం వల్లే ఆగిపోయాయి…
Ads
ప్రస్తుతానికి రెండు దేశాల నడుమ సంబంధాలు ఏమాత్రం బాగాలేవు… బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా దేశాలు ఖలిస్థానీ శక్తులకు అడ్డాలుగా మారాయని ఇండియా ఆయా దేశాలకు తన ఆందోళనను వ్యక్తపరుస్తోంది… ప్రత్యేకించి కెనడా… అక్కడ సిక్కులు రాజకీయంగా బలంగా ఉన్నారు… రాజకీయాల్ని శాసిస్తున్నారు ఒకరకంగా… కెనడా ప్రభుత్వం కూడా ఖలిస్థానీ శక్తుల కార్యకలాపాలను చూసీచూడనట్టు ఉపేక్షిస్తోంది… అదీ ఇండియాకు ఆందోళనకరం…
ఒకప్పుడు పంజాబ్‌లో హిందువుల ఊచకోతలతో ఖలిస్తానీ శక్తులు ఎలా వ్యవహరించాయో యాభయ్యేళ్లు దాటిన ప్రతి ఇండియన్‌కూ తెలుసు… ఆ తరువాత స్వర్ణదేవాలయంపై సైనికచర్య, ఆ తరువాత ఇందిర హత్య, తదనంతరం ఢిల్లీలో జరిగిన దాడుల్లో కొన్ని వేల మంది సిక్కుల మృతి… వరుసగా చోటుచేసుకున్నాయి… కేజ్రీవాల్ వంటి అవకాశవాద రాజకీయ నాయకుల పుణ్యమాని మళ్లీ ఈ శక్తులు బలం పుంజుకున్నాయి… అకాలీదళ్, కాంగ్రెస్, బీజేపీ వంటి పార్టీలు సంయమనం పాటిస్తున్నాయి గానీ… కేజ్రీవాల్ వంటి నేతలే ఖలిస్తానీవాదానికి అండగా నిలబడ్డాడు… కాదు, కేజ్రీవాల్ అధికారానికి ఖలిస్తానీవాదమే అండగా నిలబడింది…
మా జాతీయుడిని మా గడ్డ మీద కాల్చి చంపుతారా అనే కెనడా ప్రశ్న స్థూలంగా చూస్తే సబబైనదే… కానీ ఓ ఉగ్రవాది ఏ దేశంలో ఉన్నా ఉగ్రవాదే కదా… మా దేశానికి థ్రెట్ ఎక్కడున్నా, ఎవరైనా సరే అంతుచూస్తాం అనేది ఇండియా పరోక్ష భావన… ఇప్పట్లో కెనడా- ఇండియా సంబంధాలు చక్కబడే స్థితి కనిపించడం లేదు… పైగా మరింత దిగజారే సూచనలే ఉన్నాయి…
ఎటొచ్చీ కెనడాకు వలసవెళ్లిన లక్షల మంది హిందువుల్లో ఆందోళన పెరిగిపోతోంది… ఎర్రకోటపై సిక్కుల జెండా ఎగురవేసి, ఢిల్లీ వీథుల్లో వీరంగం వేసి, ముట్టడించి, చివరకు ప్రధాని కాన్వాయ్‌ను జస్ట్, ఓ ట్రాక్టర్‌తో దిగ్బంధించిన తీరు, జనానికి సారీ చెప్పి వ్యవసాయ చట్టాల్ని ఒక ప్రధాని వాపస్ తీసుకున్న తీరు మనకు ఆందోళనకరం… నడుమ ట్రాడాది ఏం పోయింది..? తన అధికారానికి సిక్కుల మద్దతు కొనసాగితే చాలు…!!
తాజా :: ఇండియా కూడా కెనడా దౌత్యవేత్తను బహిష్కరించింది…
Share this Article