గొప్ప దర్శకులైనంత మాత్రాన… తీసిన ప్రతి సినిమా గొప్పగా ఉండకపోవచ్చు, ఉండాలని లేదు… కొన్నిసార్లు కోతిని చేయబోతే కొండెంగ కావచ్చు కూడా… సినిమా అంతా అద్భుతంగా ఉండి ఒకటోరెండో సీన్లు, సాంగ్స్ చికాకు పెట్టవచ్చు… ఎస్, బాపు గొప్ప చిత్రకారుడు… ఒక చిత్రాన్ని, ఒక వ్యంగ్య చిత్రాన్ని, ఒక దృశ్యాన్ని చిత్రిక పట్టడంలో కుంచెలు తిరిగినవాడు… కానీ భక్తకన్నప్పలో ఓ సూపర్ పాటను సరిగ్గా టాకిల్ చేయలేదేమో, అంటే చిత్రీకరణలో తన మార్క్ చూపించలేక, చివరకు అలా మనమీదకు వదిలేశాడేమో అనిపిస్తుంది…
1976 నాటి ఆ సినిమా సూపర్ హిట్… కృష్ణంరాజు స్టార్‌డమ్ మాత్రమే కాదు, వాణిశ్రీ కూడా చిత్రానికి సగం బలం… కాకపోతే మేకప్పు ఖర్చు సినిమా ఖర్చుకన్నా ఎక్కువైందని అప్పట్లో జోకులు పడేవి… కానీ అప్పటికే వయస్సు మీదపడుతున్నా సరే అందంగా కనిపిస్తుంది… భక్తి, అనురక్తి, భయం, ఆందోళన వంటి ఉద్వేగాలను బ్రహ్మాండంగా ఆవిష్కరించింది…
ప్రతిదీ బాలుయే పాడాలనే డిక్టేటర్‌షిప్ రాలేదు అప్పటికి… రాస్తే వేటూరి మాత్రమే రాయాలన్నంత సుప్రిమసీ కూడా రాలేదు… కిరాతార్జునీయం వంటి సాంగ్ మళ్లీ తెలుగు సినిమాలో రాదు, రాసి పెట్టుకొండి, రాసేవాడు లేడు, తీసేవాడు లేడు, చూసేవాడు లేడు… అదొక అబ్బురం… నిజానికి ఇది రీమేక్… ఒరిజినల్ కాదు… కన్నడంలో రాజకుమార్ కన్నప్ప నయనార్ జీవితకథ ఆధారంగా తీసిన బెదర కన్నప్ప అనే సినిమాకు భక్తకన్నప్ప రీమేక్… కానీ 1000 శాతం తెలుగీకరించబడిన సినిమా… సినారె, వేటూరి, ఆరుద్ర చేయిచేసుకోగా… రామకృష్ణ, బాలు గొంతు విప్పారు… కిరాతార్జునీయం బాలు కెరీర్ మొత్తానికి హైలైట్…
Ads
ప్రతి పాట ముత్యమే… కానీ ఎన్నీయెల్లో ఎన్నీయెల్లో అనే పాట మొత్తం పంటి కింద రాయిలా తగులుతుంది… ఆరుద్ర రాశాడు… సరళమైన పదాలతో సాగిపోతుంది… కానీ హఠాత్తుగా జంప్స్… ఇప్పటికీ యూట్యూబులో ఆ పాట చూస్తుంటే ఈ సడెన్ జంప్స్ ఇబ్బంది పెట్టి, పాట మీద సదభిప్రాయాన్ని ఆవిరి చేస్తాయి… ఆ హీరో కృష్ణంరాజుకేమో బెన్‌హర్ వంటి సినిమా తీయాలని ఆశ… ఎలాగూ వాళ్ల సొంత సినిమా… రిస్క్ అయినా సరే, ఎవరినీ అడగాల్సిన పనిలేదు… అవసరమైతే అదనంగా డబ్బు పెట్టడానికి కూడా రెడీగా ఉన్నాడు…
రచయిత ముళ్లపూడి మీద, దర్శకుడు బాపు మీద అదే ప్రెజర్… ప్రత్యేకించి ఆ యూనిట్ పాటల చిత్రీకరణకు అడవుల్లోకి వెళ్లి తమ ట్యూన్స్, రిథమ్స్ ప్రయోగించడానికి ప్రయత్నించింది… ఈ ఎన్నీయెల్లో పాట వెన్నెల ఎఫెక్ట్ వచ్చేలా తీయాలని సంకల్పం… లైట్ సరిపోదు, ఏం చేయాలి… 1957లో మాయాబజార్‌లో లాహిరి లాహిరి పాటకు ఎత్తుగడ దీనికీ వాడుదామని అనుకున్నారు… ఈ సినిమా కెమెరా వీఎస్ఆర్ స్వామి జగమెరిగినవాడే… కానీ ఈ పాట విషయంలో చేతులెత్తేశాడు…
సడెన్‌గా లైట్ ఎక్కువ అవుతుంది, మళ్లీ వెంటనే డౌన్ అయిపోతుంది… మంచి లొకేషన్, గిరిజనుల నృత్యాన్ని పోలిన స్టెప్పులు, గలగలపారే ప్రవాహాలు… అన్నీ కుదిరాయి… కానీ ఆ లైటింగ్ కుదరలేదు… ప్రతి పాట మీద ప్రాణం పెట్టే బాపు ఎంత గిలగిలాలాడిపోయాడో… రీషూట్‌కు చాన్స్ లేనట్టుంది… ఫైనల్ ఔట్‌పుట్‌లో తోసేశారు… అఫ్‌కోర్స్, ఆ పాట కూడా బంపర్ హిట్… కాకపోతే ఆడియో మాత్రమే… చిత్రీకరణ విషయంలో మాత్రం ఫ్లాపే… మాయాబజార్‌లో మార్కస్ బార్లే మండుటెండలో వెన్నెల ఇంపాక్ట్ తీసుకురాగలిగాడు… ఎటొచ్చీ బెన్‌హర్ రేంజ్ కావాలనుకున్న కృష్ణంరాజుకు ఈ కోణంలో మాత్రం నిరాశే మిగిలింది…!
Share this Article