సుగర్ ఫ్రీ రైస్ కనిపెట్టామహో అని ఆమధ్య మన తెలంగాణ వ్యవసాయ వర్శిటీ గొప్పగా చెప్పుకుంది కదా… సుగర్ ఉన్నోళ్లంతా రోజూ ఈ బియ్యం వండుకొని తినేయండి, బేఫికర్ అని టాంటాం చేసుకుంది కదా… సోనా మశూరికన్నా క్వాలిటీ, ఇక అన్ని మార్కెట్లలో దుమ్మురేపడం ఖాయం అని కూడా టముకు వేసుకుంది కదా… ఆ బియ్యం ధర ఎంతో తెలుసా..? క్వింటాల్‌కు 1280 రూపాయలపైమాటే… ఫ్లిప్ కార్ట్‌లో 4.5 కిలోల సంచీ 576 రూపాయలకు అమ్ముతున్నారు… అంటే ఓ మోస్తరు బాస్మతికన్నా అధికధర… సోనామశూరి చిల్లర ధరకన్నా రెట్టింపు ధర… షాక్ తినకండి… ఇంకా చాలా విశేషాలున్నయ్… ఒక్క ముక్కలో చెప్పాలంటే మన వ్యవసాయ యూనివర్శిటీకన్నా మోన్శాంటో వంటి బహుళజాతి కంపెనీలే నయం… ఈ వర్శిటీ ఈ బియ్యం అమ్మకాల రైట్స్ బేఫాక్ కంపెనీకి ఇచ్చింది… అది ఇక కుమ్మేసుకుంటోంది… ఈ బియ్యం పేరే డయాబెటిక్ రైస్ అని పెట్టేసింది… మీరు ఫ్లిప్ కార్ట్‌లోకి వెళ్లి చూస్తే కేసీయార్‌ను కూడా అది ప్రచారానికి వాడేసుకుంటున్నట్టు చూడొచ్చు… పైగా యూనివర్శిటీ లోగోను కూడా..! అంతేకాదండోయ్… టెస్టెడ్, అప్రూవ్డ్ అని కొన్ని ముద్రలు కనిపిస్తాయి… జస్ట్, వినియోగదారుల్ని భ్రమలకు గురిచేయడం… మేక్ ఇన్ ఇండియా లోగో కూడా వాడుతున్నారు… అసలు ఈ అప్రూవ్డ్, టెస్టెడ్ అనే ముద్రల్ని ఎవరు ప్రసాదించారు మహాశయా..?
అసలు దీన్ని సుగర్ ఫ్రీ రైస్ అని ప్రచారం చేయడమే పెద్ద దుర్మార్గం… బేఫాక్ కంపెనీ ఏమంటున్నదో తెలుసా..? బెటర్, ఫాస్టర్, చీపర్… దేనికన్నా బెటర్..? వోకే, ఇతర బియ్యం రకాలకన్నా తక్కువ జీఐ (గ్లైసీమిక్ ఇండెక్స్) ఉండొచ్చుగాక… కానీ సుగర్ ఫ్రీ కాదు, కార్బొహైడ్రేట్స్ సేమ్ కదా… రెగ్యులర్ వాడకానికీ వోకే అని ఓ ప్రైవేటు కంపెనీ ప్రభుత్వ లోగోలతో ఎలా ప్రచారం చేసుకుంటుంది..? ఏ వైద్యనిపుణులు చెప్పారు..? ఈ అన్నం తరువాత సుగర్ లెవల్ చెక్ చేసుకుంటే సుగర్ లెవల్స్ తక్కువ ఉన్నట్టు కనిపెట్టవచ్చునట… నిజమా..? అన్నం తిన్న తరువాత సుగర్ లెవల్స్ తగ్గుతాయా..? ప్రజల్ని ఎందుకు మోసం చేస్తున్నట్టు..? అదీ అడ్డగోలు ధరలతో అంటగట్టి…! ఫాస్టర్ అంటే త్వరగా ఉడుకుతుందా..? ఏమిటి అర్థం..? అలాగే చీపర్ ఎలాగైంది..? ఇంతగా భారీ ధరలు పెట్టి చీపర్ అని ప్రచారం చేయడం మోసం కాదా..? సంచీ మీద ఎంచక్కా వ్యవసాయ వర్శిటీ లోగో కూడా ముద్రించేస్తున్నారు… బహుశా రాయల్టీ ఏమైనా ఇస్తున్నారేమో…
Ads
ఈమాత్రం రాయల్టీ కోసం మన ప్రజలు ఎందుకు అబద్ధాలతో మోసగించబడాలి..? మరీ సాధారణ సన్నరకాలతో పోలిస్తే రెట్టింపు ధరల్ని మించి అమ్ముకోవడానికి మన ప్రజా యూనివర్శిటీ ఉపయోగపడాలా..? అంత రాయల్టీ తీసుకుంటోందా..? పోనీ, ఉత్పత్తి వ్యయం ఏమైనా ఎక్కువా..? ఒక ప్రభుత్వ యూనివర్శిటీ నిజంగా ప్రజలకు ఉపయోగపడే ఒక పరిశోధనను విజయవంతం చేస్తే, దాన్ని ప్రజలు వినియోగించుకోనివ్వండి… ఈ లాభార్జన ఏమిటి..? ఓపెన్ సోర్స్ చేస్తే సోనా మశూరి ధరలకే మార్కెట్లో దొరుకుతాయి కదా… ప్రజాధనంతో పనిచేసే వర్శిటీకి ఇంతకు మించిన సార్థకత ఏముంటుంది..? ఆమధ్య ఏదో నూనె సీసాలు కూడా అమ్మినట్టు గుర్తు… అసలు వర్శిటీ చేయాల్సిన పనేమిటి..? చేస్తున్నదేమిటి..? ఎప్పుడైనా ఈ ప్రభుత్వం ఈ వర్శిటీ గురించి చిన్న సమీక్షనైనా చేసుకుందా..? తెలంగాణ పిల్లలకు దక్కాల్సిన సీట్లనూ ఆంధ్రా పిల్లల పరం చేసిన ఆరోగ్య వర్శిటీ ఒకవైపు… ఇదుగో ఇలాంటి సుగర్ ఫ్రీ వ్యవసాయ వర్శిటీ మరోవైపు… ద్యా-వు-డా…!!
Share this Article