ఇంతకుముందు ఏ దేవస్థానం దగ్గరకు వెళ్లినా సరే… ప్రత్యేకించి పల్లెజనం వెళ్లే గుళ్ల దగ్గర… మగాళ్లే కాదు, ఆడవాళ్లు కూడా గుండ్లు చేయించుకునేవారు… దానికి పెద్ద మథనం కూడా ఉండేది కాదు… అసలు శిరోముండనం అంటేనే, తల వెంట్రుకలు తీయించుకోవడం అంటేనే స్వామివారికి భవభోగాల్ని సమర్పించేసి, సర్వం సమర్పించుకుంటున్నామనే అర్పణ భావన… దానికి మగ, ఆడ తేడా ఏమిటి..?
కాకపోతే ఆడవారైతే గుండుతో వికారంగా కనిపిస్తామనే సందేహం, ఒకసారి గొరిగితే మళ్లీ ఒత్తుగా, పొడుగ్గా పెరగటానికి టైమ్ పడుతుందనే భావన పెరుగుతూ పెరుగుతూ… ఆడవాళ్ల గుండ్ల సంఖ్య బాగా తగ్గిపోతోంది… రోజూ ఎందరు దర్శనానికొచ్చారు..? ఎందరు గుండ్లు గీయించుకున్నారో వివరాలు చెబుతుంటుంది టీటీడీ… కానీ వారిలో ఆడవాళ్లు ఎందరు..? మగవాళ్లు ఎందరు మాత్రం చెప్పదు… దేవుడికి మొక్కుకున్న ఆడవాళ్లలో కూడా చాలామంది అక్కడికి రాగానే నాలుగు కేశాలు కత్తిరించి, దేవుడికి సమర్పించేస్తుంటారు…
గుళ్లే కాదు, ఎవరైనా చనిపోతే, కర్మ చేసేవాళ్లే గాకుండా మగ వారసులందరి తలలూ గొరుగుతారు… ఇక్కడా ఆడవాళ్లకు మినహాయింపే… పాతతరం మాటేమిటో గానీ కొత్తతరం తలలు గొరుక్కోవడాన్ని అస్సలు ఇష్టపడరు… ఎంత పెద్ద దేవుడి ఎదుటైనా సరే, ఎంత బాగా భక్తి ఉన్నా సరే… పిల్లలకు మాత్రం దగ్గరుంచి నున్నగా గొరిగిస్తారు… భర్తలకు కూడా…
Ads
అఫ్ కోర్స్, గుండు గొరిగాక, యాంటీ సెప్టిక్ డెట్టాల్‌తో కడిగి, చందనం పూసి, నిలువు నామం పెట్టుకుని, గడ్డాలు-మీసాలు తీసేస్తే… ఆహా ఆ కొత్త లుక్కే వేరు… నాలుగు రోజులు అలాగే ఉండొచ్చు కదా, ఉండరు… ఇంటికి రాగానే టోపీ పెట్టుకుని, కనిపించకుండా జాగ్రత్తపడతారు… అసలు గుండు కనిపిస్తే తప్పేమిటట… మహా అయితే ‘ఎక్కడికి వెళ్లొచ్చావోయ్, తిరుపతా…’ అనడుగుతారు, అంతే కదా… పైగా వేసవిలో గుండు పెద్ద రిలీఫ్ కూడా…
అసలు ఈ తలగొరిగించుకోవడం అనేది సౌత్ టెంపుల్స్‌లోనే ఎక్కువ కావచ్చు బహుశా… కర్నాటకలోనూ పెద్దగా ఉండదు… తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు గుళ్లలోనే ఎక్కువ… బౌద్ధంలో భిక్షుణిలా మారాలంటే గుండు తప్పనిసరి… అసలు ఈ గుండ్లు అనేది కేవలం హిందూ దేవుళ్లకే ప్రత్యేకం అనుకుంటా…….. హ్యూమన్స్ ఆఫ్ బాంబే గ్రూపులో విశాఖపట్నానికి చెందిన ఓ యువతి రాసిన పోస్టు చదివితే ఇదుగో ఇన్ని విషయాలు చకచకా మదిలో మెదిలాయి… నిజానికి ఆడవాళ్లు ప్రముఖ దేవస్థానాలకు వెళ్లినప్పుడు జుట్టు తీసేసుకుంటే తప్పేమిటట… ఆమె గుండుపై తన మథనాన్ని ఎలా షేర్ చేసుకుందో చూడండి… (ఆమె పేరు లేదు ఆ పోస్టులో…)
‘‘మా అబ్బాయి రుద్రాంశ్‌కు 11 నెలల వయస్సున్నప్పుడు… 2021లో నేను నున్నగా గుండు గొరిగించుకున్నాను… మావాడి వెంట్రుకలు తీయడం కోసం (బహుశా పుట్టువెంట్రుకలు కావచ్చు) తిరుమల వెళ్లాం నేనూ, నా భర్త సంతోష్… మా అబ్బాయితోపాటు మావారు కూడా గుండు చేయించుకోవడానికి రెడీ అయిపోయాడు… నా ఒక్కడికే జుట్టు తీసేయించారనే ఫీలింగ్ మావాడికి కలగకుండా అన్నమాట… కల్యాణకట్టలో మా వంతు కోసం ఎదురుచూస్తున్నాం…
ఎందుకోగానీ నాలో ఓ ఆలోచన తళుక్కుమంది… నేనెందుకు దేవుడికి తలనీలాలు సమర్పించకూడదు..? మావారు ఏమంటాడో అని సందేహించాను… తను సింపుల్‌గా ‘నీ ఇష్టం’ అన్నాడు… అంతే… వెక్కిరింపో, ఆటపట్టింపో ఏమీ లేదు… ఐనా భక్తిలో అవి ఎందుకుంటాయి..? నాకు ఒత్తుగా, పొడుగ్గా అందమైన జుట్టు ఉండేది… తలనీలాలు ఇచ్చాక పశ్చాత్తాపడతానా..? అరె, ఇవ్వకుండా ఉండాల్సింది అని అనుకుంటానా..? ఇదొక మథనం లోలోపల.. నా సందేహం గమనించి మళ్లీ ఆయనే అన్నాడు… ‘‘అంత ఆలోచన దేనికి..? ఇవ్వవద్దు అనుకుంటే వదిలెయ్’’ అన్నాడు…
మా వంతు వచ్చేసరికి నేను నిర్ణయం తీసేసుకున్నాను… నిశ్చింతగా తల అప్పగించేశాను… అద్దంలో చూసుకుంటే నా రూపం నాకే ముద్దొచ్చింది… అసలు బయట తిరిగేటప్పుడు కూడా అది కనిపించకుండా స్కార్ఫ్‌తో కప్పాలని కూడా అనిపించలేదు నాకు… సంతోష్ కూడా నావైపు కొత్తగా ఏమీ చూడలేదు… కాజువల్‌గా చూశాడు… అసలు ఇది పెద్ద విషయమే కాదన్నట్టుగా… నాకయితే నా నిర్ణయం హేపీగా ఉంది…
అఫ్ కోర్స్, కొందరు రకరకాల జడ్జిమెంట్లు ఇచ్చారు… అబ్బే, ఏం బాగోలేదు అని ఓ దోస్త్ మొహం మీదే అనేసింది… నా ఫ్రెండ్ మాత్రమే కాదు, మా బంధుగణంలో కొందరు, కొత్తవాళ్లు సైతం బాగాలేదన్నారు… ఈ నెగెటివిటీని దాటేయడానికి నేను పాజిటివ్ అంశాలపై కేంద్రీకరించాను… నేను పీడియాట్రిక్ డెంటిస్టును… పేషంట్లలో ఒకరు చెప్పారు… ‘‘మేడమ్, మీరు యంగ్‌గా కనిపిస్తున్నారు ఇప్పుడు’’… వావ్, మనసు సంతోషపడింది… నా మొహంపై చిరునవ్వు మొలిచింది…
కొన్నిసార్లు చిన్న పదాలు ఎంత ఆనందాన్ని ఇస్తాయో కదా… పలువురు నా గుండు చుట్టూ పేర్చుతున్న నెగెటివిటీ కాస్తా ఆ చిన్న మాటతో తొలగిపోయినట్టయింది… రెండేళ్లయింది… మళ్లీ నా ఒత్తయిన, అందమైన జుట్టు మళ్లీ పెరిగింది… మళ్లీ నేను గుండు చేయించుకోకపోవచ్చు… ఐనాసరే, అది నా నిర్ణయం మీదే ఆధారపడి ఉంటుంది… నిజానికి మనం జీవితంలో కొన్నిసార్లు తీసుకునే చర్యలు ఇలాగే ఉండాలి కదా… మనకు ఏది సంతోషాన్ని కలిగిస్తుందో దాన్నే అనుసరించాలి… ఆఫ్టరాల్, ప్రజలు ‘‘ఏమిటి, ఎందుకు’’ అంటూనే ఉంటారు, పట్టించుకుంటే ఎలా…?!’’
Share this Article