Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

యంత్రమే ఆధునిక మంత్రం… సుఖం, సౌకర్యం… వికటిస్తే ప్రమాదం..!!

November 30, 2025 by M S R

.

దాదాపు తొంభై అయిదేళ్ల కిందట అంటే 1930లలో ప్రపంచవ్యాప్తంగా పెను ఆర్థిక సంక్షోభం సంభవించింది. అమెరికాలో మొదలై ఈ సంక్షోభం భూగోళమంతా విస్తరించింది. ఆర్థిక శాస్త్రం ఈ సంక్షోభానికి “గ్రేట్ డిప్రెషన్” అని నామకరణం చేసింది.

ఈ సంక్షోభానికి మూల కారణం అతి పారిశ్రామికీకరణ అని తేల్చాడు చార్లీ చాప్లిన్. గ్రేట్ డిప్రెషన్ ఇతివృత్తంగా మోడరన్ టైమ్స్ పేరుతో 1936లో చార్లీ చాప్లిన్ తీసిన సినిమా ఒక విషాదానికి కన్నీటి ప్రతిరూపం. ఈ సినిమాకు దర్శకుడు, నిర్మాత, రచయిత, సంగీతం, కథానాయకుడు అన్నీ చాప్లినే.

Ads

ఆ సినిమా సందర్భం ప్రకారం- ఒక పెద్ద ఫ్యాక్టరీలో కొత్తగా తయారు చేసిన యంత్రాన్ని ప్రయోగాత్మకంగా పరీక్షించే సన్నివేశం. ప్లేట్లో ఉన్న బ్రెడ్డు ముక్కను మనిషి చేత్తో విరుచుకుని నోటి దాకా తెచ్చుకుని తినాల్సిన అవసరం లేకుండా, మొక్కజొన్న పొత్తును గింజలుగా పంటితో ఒలుచుకుని తినాల్సిన అవసరం లేకుండా, గ్లాసుతో నీళ్ళు తాగాల్సిన అవసరం లేకుండా…ఈ పనులన్నిటినీ ఒకదాని తరువాత ఒకటి చేసి పెట్టే అధునాతన ఆటోమేటిక్ యంత్రమది.

దానిముందు మనిషి కూర్చుంటే చాలు. నోట్లోకి అదే తోస్తుంది లేదా కుక్కుతుంది. చివర తడి స్పాంజ్ తో మూతి తుడుస్తుంది కూడా. వేల మంది కార్మికుల్లో అమాయకంగా కనిపించే చాప్లిన్ ను ఆ యంత్రం ముందు కూర్చోబెడతారు. స్విచ్ ఆన్ చేస్తారు.

మొదటి రౌండు అంతా బాగానే సాగుతుంది. రెండు, మూడో రౌండ్లో స్పీడ్ పెంచేసరికి ఆ యంత్రం చాప్లిన్ పళ్ళూడగొట్టి చేతిలో పెడుతుంది. ఎదుటి మనిషి తిన్నాడో లేదో చూడకుండానే యాంత్రికంగా నోట్లోకి కుక్కడం దాని పని. చివరకు చాప్లిన్ ఏమీ తినకుండానే మూతి తుడిచి పెడుతుంది.

ప్రపంచ సినిమా చరిత్రలో చార్లీ చాప్లిన్ ఒక్కడే ఇలాంటివి రాయగలడు. తీయగలడు. నటించగలడు. చాప్లిన్ అధివాస్తవికతగా, వ్యంగ్యంగా, తమాషాగా చెప్పినా అందులో వాస్తవంగా విషాదమే ఉంటుంది. విషాదానికి హాస్యపు రంగు అద్ది ఏడుపులో నవ్వును ఆవిష్కరించి… నవ్వుతో బాధను మైమరపింపచేసినవాడు చాప్లిన్.

మనిషి యంత్రంలో యంత్రమై, బోల్ట్ లో బోల్ట్ అయి, చక్రాల పళ్ల మధ్య బెల్ట్ అయి, సైరన్ మోగగానే మరబొమ్మలా పనిచేసి; మళ్లీ సైరన్ మోగగానే ఆగిపోయే ఒక పరికరంగా ఎలా మిగిలిపోయాడో ఆనాడే చాప్లిన్ కన్నీళ్లకే కళ్లల్లో రక్తం కారేలా తెలుపు నలుపు మూగసినిమాలో చెప్పాడు.

chaplin

అప్పటికే అంతగా గుండెలు బాదుకోవాల్సిన పరిస్థితి అయితే- ఇప్పటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పుట్టించిన స్వయంచాలిత రోబో యంత్రాల అధునాతన పరిశ్రమలను, ఆ పరిశ్రమలను ఇళ్లల్లో నుండి నిద్రలో అయినా మానిటర్ చేసే వర్క్ ఫ్రమ్ హోమ్ లను చూస్తే చాప్లిన్ ఎన్ని మోడరన్ టైమ్స్ సినిమాలు తీయాల్సి వచ్చేదో?

కేరళ మున్నార్ అద్భుతమైన టీ తోటల ప్రదేశం. భూమికి పట్టు చీర కట్టినట్లు ఆ అందమే అందం. మున్నార్ లో ప్రకృతి పాడే పరవశగీతాలను వినడానికి మనసుకు చెవులుండాలి. ఆ దృశ్యాన్ని కళ్ళల్లో ఒంపుకోవడానికి కళ్ళకు మనసుండాలి. కొండపైన భవనాలనుండి టీ తోటల కొండలను, వంపు దారులను, ఆకాశమే ఒంగి ప్రకృతిని ముద్దాడే ఉదయాస్తమయ సంధ్యలను చూడడడం దానికదిగా ఒక అలౌకిక అనుభవం.

సౌందర్యారాధన. పర్యాటకులను ఆకర్షించడానికి హోటళ్ళవారు ఇలాంటిచోట్ల చిత్రవిచిత్రాలు చేస్తూ ఉంటారు. అలా అతి భారీ క్రెయిన్ తో ఒక గాజు పెట్టెను నేల నుండి 150 అడుగుల ఎత్తులో వేలాడదీస్తారు. ఆకాశంలో వేలాడుతూ దాదాపు పదిమంది అందులో కూర్చుని భోంచేస్తూ చుట్టూ కలియజూస్తూ గాల్లో తేలిపోతూ ఉంటారు. ఇదో ప్రత్యేకమైన ఆకర్షణ.

machine

యంత్రం ఎప్పుడైనా యంత్రమే. ఎప్పుడైనా మొరాయించవచ్చు. అలా మొన్న ఒకరోజు భోజనం చేసే గాజు పెట్టె వంటావార్పుతో, అతిథులతో, ఒక సర్వర్ తో ఆకాశంలోకి పైకి లేచింది. అతిథులు తినరా మైమరచి అని పాడుకుంటూ తిన్నారు. తినగానే కిందికి దిగాలి. క్రెయిన్ హైడ్రాలిక్ వ్యవస్థ పనిచేయలేదు. రెండు గంటలైనా బాగు కాలేదు.

పైనున్నవారి ప్రాణాలు పైనే పోతున్నాయి. దూకడానికి లేదు. అంతా అయోమయం. పోలీసులు, డిజాస్టర్ మేనేజ్మెంట్ బృంద నిపుణులు వచ్చి తాళ్ళ సాయంతో పైకి ఎగబాకి, అదే తాళ్ళ సాయంతో అందరినీ క్షేమంగా కిందికి దించారు. హమ్మయ్య అనుకుని అతిథులు గొంతులోకి దిగిన ముద్దను, అరచేతిలోకి వచ్చిన ప్రాణాలను ఉగ్గబట్టుకుని వెనక్కు తిరిగి చూడకుండా వాళ్ళ ఊళ్ళకు వెళ్ళిపోయారు.

మూడు కోట్ల స్నానపు తొట్టె

సినిమాలో చాప్లిన్ తిండి తినిపించే మెషిన్ ను కనుక్కున్నట్లే జపాన్ లో ఒకాయన స్నానం చేయించే యంత్రాన్ని కనుక్కున్నాడు. పూర్తిగా మూసుకుపోయే ఈ గాజు బాత్ టబ్ లోకి దిగగానే అదే స్నానం చేయిస్తుంది. మసాజ్ చేస్తుంది. ఆవిరిపడుతుంది. స్నానం వేళ మనకు బోర్ కొట్టకుండా పాటలు వినిపిస్తుంది. ఇంతకూ దీని ధర ఎంతనుకున్నారు? మన కరెన్సీలో జస్ట్ అక్షరాలా మూడు కోట్లు- అంతే!

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఎర్ర రాజకీయాలకు కొరుకుడుపడని కొయ్య… కేరళ కొత్త ముఖ్యమంత్రి…
  • మనోభావాల యూనివర్శిటీ… విభిన్న కోర్సులకు అడ్మిషన్ల నోటిఫికేషన్…
  • బాధితురాలిని బజారుకు లాగడం పక్కా నేరం, అనైతికం…!!
  • ఎటూ మొగ్గు లేదు.., ఎవరికీ వత్తాసు లేదు – సీఎం రేవంత్ పరిణతి…
  • కాసింత నువ్వుల నూనె… ఓ నల్ల రిబ్బన్ ముక్క… కాసిన్ని నల్ల నువ్వులు…
  • ‘‘నా స్టార్‌డమ్ ఎంత అల్పమైందో నాకప్పుడు అర్థమైంది’’
  • ప్రతీక్ యాదవ్..! ములాయం చిన్న కొడుకు కథ కూడా ఓ సినిమా స్క్రిప్టే..!!
  • … ఇప్పుడైతే పోలీసుల మనోభావాలు దెబ్బతినేవేమో…!!
  • బుల్డోజర్ జస్టిస్… మజ్లిస్ నేతకు దెబ్బ… నేరస్తులకు షెల్టరిస్తే ఇల్లే ఉండదు..!
  • ఎంతసేపూ పూరేకలు విచ్చుకోవడంపైనేనా వేటూరి దృష్టి..!?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions