ఎంతటి ప్రయోజనకరమైన, సులభ అంశమైనా సరే… సంక్లిష్టం చేసి, నానా అబద్ధాలూ జతచేసి, సొంత పైత్యాలను తాళింపు వేసి, రుచీపచీ లేని వంటకంగా మార్చడంలో మన మీడియా తరువాతే ఏదైనా..! యూట్యూబర్లు, సైట్ల చెఫులను ఆడిపోసుకుంటారు గానీ, నిజానికి ఈ చెడగొట్టు విద్యలో మెయిన్ స్ట్రీమ్ మీడియా తరువాతే ఎవరైనా..! ఉదాహరణకు… చద్దన్నం..!
ఈ చద్దన్నం గురించి మనం గతంలో కూడా రెండుమూడుసార్లు ముచ్చటించుకున్నాం… మళ్లీ ఎందుకు గుర్తుచేసుకోవడం అంటే… చద్దన్నం గురించి ఎవరికి తోచినట్టు వాళ్లు రాసేస్తున్నాడు… అందుకని చెప్పుకోవాల్సి వస్తోంది మళ్లీ… ఓసారి ఈ ‘ముచ్చట’ లింకులు చదవండి…
మన తిండి మనం వదిలేశాం- వెనక్కి వెళ్లి మళ్లీ వెతుక్కుంటున్నాం…
Ads
నెల్లూరు రెడ్డి గారు చెప్పాక… చద్దన్నం, మజ్జిగపై సోయి పెరిగింది హఠాత్తుగా…
మెయిన్ స్ట్రీమ్ మీడియాకు సంబంధించిన సైట్లు కూడా ఇష్టారాజ్యం వండేస్తున్నయ్… మొన్నీమధ్య ఓ సైటు అరాచకం… మరీ పెరుగన్నం ఫోటో వేసి ఓ కథనం కుమ్మేసింది… బహుశా సాక్షి కావచ్చు… అసలు పులియడానికీ, తోడుకోవడానికీ, పాచిపోవడానికీ నడుమ తేడా కూడా తెలిసినట్టు లేదు…
‘‘రాత్రిపూట మిగిలిన అన్నంలో అది మునిగే వరకు పాలు పోసి తోడేసి, పొద్దున్నే అందులో పచ్చి ఉల్లిపాయ ముక్కలు, అల్లం, కరివేపాకు, జీలకర్ర కలుపుకుని తింటే కడుపులో ఉండే అనారోగ్య సమస్యలు తగ్గడంతోపాటు ఎముకలకి మంచి బలం కూడా…’’ అని తేల్చి పారేసింది ఆ కథనం… పాలుపోసి తోడేస్తే, తెల్లారేసరికి అది తోడుకుని పెరుగు అవుతుంది తప్ప పులిసిన చద్దన్నం ఎందుకవుతుందోయ్ కలం వీరుడా..?
పైగా అందులో పచ్చి ఉల్లిపాయ ముక్కలు, అల్లం, కరివేపాకు, జిలకర కలుపుకుని తింటే అన్ని అనారోగ్యాలూ ఫసాక్ అని ఎగిరిపోతాయట… ఇంకా నయం, దానికి ఘాటైన తాళింపు వేయాలని చెప్పలేదు… ఆవాలు, మెంతులు, ఎండు మిర్చి, పచ్చి శెనగపప్పు, కొత్తిమీర, కాస్త ధనియాల పొడి, వీలయితే చాట్ మసాలా, వెల్లుల్లి రెబ్బలు కూడా కవరైపోయేవి…
నిజానికి రాత్రి అన్నం మిగిలిపోయినా సరే, కావాలని వండుకున్నా సరే… కాస్త మజ్జిగ గానీ, పెరుగు గానీ కలిపేసి, రాత్రంతా వదిలేయాలి… ఆ పెరుగు పులుస్తుంది… బాగా పులిసిన ఆహారం కాదు గానీ, కాస్తంత పులిసిన ఆహారం ఆరోగ్యదాయకం… అది అనాదిగా ఆయుర్వేదం కూడా చెబుతోంది… పెద్దల మాట చద్దన్నం మూట అనే సామెత కూడా అదే… అలవాటున్నవాళ్లు పచ్చి ఉల్లిపాయను నంజుకుంటూ, కాస్త పులిసిన చద్దన్నాన్ని తింటే మంచిదే… చాలామంది దాన్ని తినడం కాదు, జుర్రుకుంటారు…
ఇప్పుడంటే ఆ అలవాటు తప్పిపోయింది గానీ… ఆవకాయతో, ప్రత్యేకించి మామిడికాయ తొక్కుతో చద్దన్నం లాగించేస్తుంటారు చాలామంది… అంతేగానీ దానికి పచ్చి మిరపకాయలతోపాటు మిగతా కిరాణా సామగ్రినంతా జతచేస్తే… దక్కాల్సిన ప్రయోజనం దక్కదు సరికదా… అదనపు నష్టాలూ ఉంటయ్… ఎందుకంటే… బ్రేక్ ఫాస్ట్ ఎప్పుడూ సరళంగా, త్వరగా జీర్ణమయ్యేలా, కడుపు మీద ప్రెజర్ పెంచకుండా ఉండాలి… సో, అర్థమైంది కదా… పెరుగన్నం వేరు… చద్దన్నం వేరు…!!
Share this Article